‘జలధార’తో రాష్ట్రం సస్యశ్యామలం
ABN , Publish Date - Jun 14 , 2026 | 05:52 AM
‘జలధార- జలహారతి’ పనుల్లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.
గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు ప్రాధాన్యం: సీఎం
అమరావతి, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ‘జలధార- జలహారతి’ పనుల్లో గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. జలధారపై జల వనరుల శాఖ, పట్టణ, గ్రామీణ స్థానిక సంస్థలతో మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, సీఎంవో కార్యదర్శి రాజమౌళి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం పాల్గొన్నారు. ఉపాధి నిధులను పూర్తిగా వినియోగించుకునేలా పనులు చేపట్టి కాలువలు, కరకట్టలు పటిష్ఠపరచాలని సూచించారు. నీటి ప్రవాహాలకు ఆటంకం లేకుండా చూడాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంతో రాష్ట్రం సస్యశ్యామలంగా మారుతుందని చెప్పారు. చిన్న చెరువుల ద్వారా సాగుకు నీరందించడంతో పాటు భూగర్భ జల మట్టాలనూ పెంచవచ్చన్నారు. ఈ నెలాఖరులోగా ‘జలధార- జలహారతి’ పనులు పూర్తి చేయాలని సూచించారు. దీనికింద చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో పాటు ఇంకుడు గుంతలు, ఫామ్‌పాండ్‌లు, కాంటూరు కందకాల తవ్వకాలు చేపట్టాలని ఆదేశించారు. చిన్న వాగుల అభివృద్ధికి వాల్మీకిపురం వాగు అభివృద్ధిని మోడల్‌గా తీసుకోవాలని చెప్పారు. జలధార-జలహారతి విషయంలో ప్రతి జిల్లా ఆదర్శంగా ఉండాలని సీఎం స్పష్టంచేశారు. పనులు పూర్తయ్యాక చెక్‌డ్యామ్‌లు, ఫామ్‌పాండ్‌లు, చెరువులకు గండ్లు పడకుండా అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. నీటి లభ్యతపై ఎప్పటికప్పుడు అంచనా వేసేలా అవేర్ సేవలను వినియోగించుకోవాలని చంద్రబాబు ఆదేశించారు. జలవనరుల శాఖ కమాండ్ ఏరియా డెవల్‌పమెంట్ కమిషనర్ ప్రశాంతి, సలహాదారు ఎం. వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.