Share News

డబ్బులిచ్చి.. రిమాండ్‌ ఖైదీ పరార్‌

ABN , Publish Date - Apr 22 , 2026 | 06:02 AM

బాపట్ల జిల్లా రేపల్లె సబ్‌జైల్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావుకు డబ్బు ఎరగా వేసి రిమాండ్‌ ఖైదీ భీముడు అజిత్‌కుమార్‌ పారిపోయినట్లు జైళ్లశాఖ విచారణలో తేలింది.

డబ్బులిచ్చి.. రిమాండ్‌ ఖైదీ పరార్‌

  • రూ.60 వేలు లంచం తీసుకున్నట్లు విచారణలో నిర్ధారణ

  • రేపల్లె జైల్‌ సూపరింటెండెంట్‌ సస్పెన్షన్‌

రేపల్లె, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి): బాపట్ల జిల్లా రేపల్లె సబ్‌జైల్‌ సూపరింటెండెంట్‌ వెంకటేశ్వరరావుకు డబ్బు ఎరగా వేసి రిమాండ్‌ ఖైదీ భీముడు అజిత్‌కుమార్‌ పారిపోయినట్లు జైళ్లశాఖ విచారణలో తేలింది. దీంతో సూపరింటెండెంట్‌ను జైళ్లశాఖ వారం క్రితం సస్పెండ్‌ చేసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముందస్తు ప్రణాళిక ప్రకారం చికిత్స పేరుతో గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చిన అజిత్‌కుమార్‌ మార్చి 28న వాష్‌రూమ్‌కు వెళ్లి వస్తానంటూ పరారైన విషయం తెలిసిందే. ఇందులో కాపలా ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని అప్పట్లోనే జైళ్లశాఖ సస్పెండ్‌ చేసింది. ఆరోగ్య సమస్య లేని ఖైదీ భీముడు అజిత్‌కుమార్‌ కార్డియాలజీ ప్రాబ్లమ్‌ ఉందని మెరుగైన వైద్యం అవసరం అంటూ జైలు సూపరింటెండెంట్‌, వైద్యులు కుమ్మక్కై గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి అక్కడి నుంచి పారిపోయేందుకు సహకరించారని అధికారులు గుర్తించారు. ఇందుకు సూపరింటెండెంట్‌కు చెన్నైలో ఉన్న తన సోదరుడి ద్వారా రూ.60 వేలు అజిత్‌కుమార్‌ ఫోన్‌పే చేయించినట్లుగా నిర్ధారించారు. గతనెలలో పారిపోయిన అజిత్‌కుమార్‌ ఇంకా పోలీసులకు చిక్క లేదు. ఎలాంటి సాంకేతిక ఆధారాలు లభించకపోవడం, అతడి ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు.

Updated Date - Apr 22 , 2026 | 06:04 AM