Share News

రైతులకు లింక్‌ ప్రొడక్ట్స్‌ అంటగట్టడం శిక్షార్హం

ABN , Publish Date - Jun 13 , 2026 | 05:11 AM

రాష్ట్రంలో రసాయన ఎరువులతోపాటు రైతులకు లింక్‌ ప్రొడక్ట్స్‌ను బలవంతంగా అంటగడితే డీలర్ల లైసెన్సుల సస్పెన్షన్‌, రద్దుతోపాటు ప్రాసిక్యూషన్‌ ద్వారా చట్ట ప్రకారం జరిమానాలు..

రైతులకు లింక్‌ ప్రొడక్ట్స్‌ అంటగట్టడం శిక్షార్హం

  • ట్యాగింగ్‌, బండ్లింగ్‌ చేస్తే లైసెన్సుల రద్దు, కేసులు

  • ఎరువుల డీలర్లకు వ్యవసాయశాఖ డైరెక్టర్‌ హెచ్చరిక

అమరావతి, గుంటూరు సిటీ, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో రసాయన ఎరువులతోపాటు రైతులకు లింక్‌ ప్రొడక్ట్స్‌ను బలవంతంగా అంటగడితే డీలర్ల లైసెన్సుల సస్పెన్షన్‌, రద్దుతోపాటు ప్రాసిక్యూషన్‌ ద్వారా చట్ట ప్రకారం జరిమానాలు విధించడం, కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ శాఖ డైరెక్టర్‌ మనజీర్‌ జిలానీ స్పష్టం చేశారు. ఈమేరకు రాష్ట్రంలోని ఎరువుల తయారీ కంపెనీలు, టోకు వ్యాపారులు, ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల డీలర్ల అసోసియేషన్లకు తాజాగా ఆయన లేఖ రాశారు. ఎరువుల తయారీ సంస్థ, దిగుమతిదారులు, పంపిణీదారులు సబ్సిడీ లేని ఎరువులు, జీవ ఎరువులు, జీవ ఉత్ర్పేరకాలు, నీటిలో కరిగే ఎరువులు, సూక్ష్మపోషకాలు, పురుగు మందులు, సేంద్రియ ఎరువులు, ఇతర వ్యవసాయ ఉత్పాదక వస్తువుల అమ్మకాన్ని ట్యాగ్‌, బండ్లింగ్‌ చేయడం, లేదా అనుసంధానించడం చేయరాదని స్పష్టం చేశారు. టోకు పంపిణీదారులు కూడా రాయితీ ఎరువుల సరఫరాను పొందడానికి షరతుగా, రాయితీ లేని ఎరువులను లేదా మరే ఇతర వ్యవసాయ ఉత్పాదకాలను కొనుగోలు చేయాలని ఏ చిల్లర వ్యాపారినీ ఒత్తిడి, బలవంతం, ప్రేరేపించడం చేయరాదని పేర్కొన్నారు. అలాగే ఏ ఎరువుల విక్రయదారుడూ, ఏ రైతునూ రాయితీ ఎరువులతోపాటు రాయితీ లేని ఎరువులను కొనుగోలు చేయాలని ఒత్తిడి, బలవంతం చేయరాదన్నారు. ఈవిధంగా చేస్తే నిత్యావసర వస్తువుల చట్టం 1955, ఎరువుల నియంత్రణ ఉత్తర్వు 1985లోని నిబంధనల ప్రకారం ముందస్తు నోటీసు లేకుండానే కఠినమైన శిక్షా చర్యలకు బాధ్యులవుతారని హెచ్చరించారు. ఈ ఉత్తర్వులపై ఫెర్టిలైజర్స్‌, పెస్టిసైడ్స్‌ అండ్‌ సీడ్‌ డీలర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు వజ్రాల వెంకట నాగిరెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 13 , 2026 | 05:12 AM