నిషేధిత భూములపై స్పష్టత
ABN , Publish Date - Jul 23 , 2026 | 04:37 AM
నిషేధిత భూములపై పారదర్శకత, స్పష్టత కోసం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైవేటు, పట్టా భూములను ఎడాపెడా నిషేధిత జాబితాలో చేర్చకుండా కీలక చర్యలు తీసుకుంది.
పట్టా భూములు ఆ జాబితాలో ఉండొద్దు
రిజిస్ర్టేషన్ల ఐజీ ఆధ్వర్యంలో కొత్త డేటాబేస్
భూముల స్థితి తేల్చేందుకు అదే ప్రామాణికం
సర్వీస్ ఇనాం, భూదాన్, షరతుగల భూములకు రిజిస్ర్టేషన్ నిరాకరించకూడదు
పూర్తి మార్గదర్శకాలతో జీవో జారీ
అమరావతి, జూలై 22 (ఆంధ్రజ్యోతి): నిషేధిత భూములపై పారదర్శకత, స్పష్టత కోసం ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ప్రైవేటు, పట్టా భూములను ఎడాపెడా నిషేధిత జాబితాలో చేర్చకుండా కీలక చర్యలు తీసుకుంది. అలాగే... ఇప్పటికే నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూములను దాని నుంచి తొలగించేందుకు అవసరమైన నిబంధనలను రూపొందించింది. ప్రభుత్వ భూములు, మతపరమైన/ధార్మిక సంస్థల ఆస్తులు, వక్ఫ్‌బోర్డు భూములు, అదనపు భూములు అక్రమంగా రిజిస్ర్టేషన్ కాకుండా నిషేధించడానికి 2007లో సెక్షన్ 22-ఏను అమల్లోకి తెచ్చారు. కాలక్రమేణా వివిధ జిల్లాల్లో ఈ నిషేధిత ఆస్తుల జాబితా నిర్వహణలో తేడాలు రావడం మొదలైంది. దీంతో సాధారణ పౌరులు తమ సొంత ఆస్తుల రిజిస్ర్టేషన్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మొత్తం ప్రక్రియను పునఃసమీక్షించి సరళతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇవీ కొత్త మార్గదర్శకాలు
సీసీఎల్‌ఏ కమిషనర్ వెబ్‌ల్యాండ్ 2.0 లోని నిషేధిత ఆస్తుల జాబితాను ఐజీఆర్‌ఎ్‌సకు బదిలీ చేస్తారు. పాతడేటాను తొలగించి, నూతన డేటాను పొందుపరుస్తారు. వెబ్‌ల్యాండ్ 1.0లో గ్రామాల్లో రీసర్వే పూర్తయ్యే వరకు పాతడేటానే తాత్కాలికంగా కొనసాగిస్తారు.
నిషేధిత ఆస్తుల డేటాబేస్‌ను వెబ్‌ల్యాండ్ ప్లాట్‌ఫామ్‌తో అనుసంధానిస్తారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా ఆస్తుల నిషేధిత జాబితాలో ఒకేవిధమైన, పారదర్శకమైన, సులభతరమైన నిర్వహణకు వీలుటుంది. భూముల స్థితిని నిర్ధారణకు రిజిస్ర్టేషన్ స్టాంపుల శాఖ ఐజీ ఆధ్వర్యంలో ఉండే ఈ డేటాబేస్‌ను మాత్రమే ఏకైక, తుది ప్రామాణికంగా పరిగణిస్తారు.
నిషేధిత ఆస్తుల డేటాబేస్‌లో లేని భూములను రిజిస్టర్ చేయాల్సిందే. అందుకు నిరాకరించిన అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటారు.
పట్టణ ప్రాంతాల్లో ప్రభుత్వం స్థానిక సంస్థలు, దేవదాయ, వక్ఫ్‌సంస్థలకు చెందిన భూములను తగిన విచారణ తర్వాతే నిషేధిత జాబితాలో చేర్చాలి.
సర్వీస్ ఇనాం, షరతుగల పట్టా భూములను నిషేధిత జాబితాలో ఉంచకూడదు. నిషేధిత జాబితాలో ఉన్నాయా, లేవా అనే దానితో సంబంధం లేకుండా ఈ భూములను రిజిస్ర్టేషన్ చేయాలి.
భూమిపై హక్కులున్నాయని చెప్పుకొనేవారికి నోటీసు ఇవ్వకుండా, న్యాయపరమైన నిర్ణయం తీసుకోకుండా ఏ ఆస్తినీ నిషేధిత జాబితాలో చేర్చకూడదు.
విక్రేత వద్ద 2007 జూన్ 20 కంటే ముందునాటి లింక్ డాక్యుమెంట్లు ఉంటే, పట్టణ ప్రాంతాల్లో రిజిస్ర్టేషన్‌ను ఎట్టిపరిస్థితుల్లోనూ నిరాకరించకూడదు.
నిషేధిత ఆస్తుల డేటాబే్‌సలో ఏ అధికారీ సొంతంగా మాన్యువల్ ఎంట్రీలు చేయడానికి వీల్లేదు. కేవలం నిర్దేశిత సాఫ్ట్‌వేర్ లేదా ఆన్‌లైన్ ప్రక్రియ ద్వారా మాత్రమే మార్పులు చేయాలి. పట్టణప్రాంత భూములను నిషేధిత ఆస్తుల జాబితాలో చేర్చాలంటే జియో కోఆర్డినేట్స్ నమోదు చేయడం తప్పనిసరి.
వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో భూమి రకం ‘గవర్నమెంట్’ అని ఉండి, ఇతర కాలమ్‌లలో ‘అసైన్డ్’ లేదా ‘డీకేటీ’ అని ఉంటే వాటిని సెక్షన్ 22-ఏ(1)(ఏ) కింద నిషేధిత జాబితాలోకి తీసుకుంటారు.
ప్రభుత్వ యాజమాన్యంలో ఉండి, అసైన్డ్ భూములు కాని వాటిని నిషేధిత జాబితాలోకి చేరుస్తారు. వెబ్‌ల్యాండ్‌లో ఏపీఐఐసీ, ఏపీ మారిటైమ్‌బోర్డు కోసం కొత్తగా భూమి వర్గీకరణలు సృష్టిస్తారు.
స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ సంస్థలు తమ భూముల వివరాలను ఆర్డీవో/సబ్‌కలెక్టర్ ద్వారా రిజిస్ర్టేషన్ల శాఖ డేటాబేస్‌కు పంపాలి.
దేవదాయ, ధార్మిక సంస్థలకు చెందిన నిషేధిత భూముల జాబితాలో ఉన్న నకిలీ ఎంట్రీలను రిజిస్ర్టేషన్ల శాఖ తొలగిస్తుంది. ఈ మార్పులను 6నెలల్లోగా దేవదాయ శాఖ కమిషనర్ సరిచూసి పంపాలి. వక్ఫ్‌భూముల విషయంలో వక్ఫ్ బోర్డు సీఈవో సరిచూసి పంపాలి.
రిజిస్ర్టేషన్ల శాఖ డేటాబేస్‌లో ‘కోర్టు కేసులు’, ‘ఇతర’ విభాగాల కింద ఉన్న భూములకు చట్టబద్ధమైన కోర్టు ఉత్తర్వులు, సెక్షన్ 22-ఏ (2) కింద గెజిట్ నోటిఫికేషన్ తప్పనిసరిగా ఉండాలి.
గ్రామకంఠం భూములను నిషేధిత జాబితాలో చేర్చకూడదు. భూదాన్ భూముల వివరాలన్నింటినీ రిజిస్ర్టేషన్ల శాఖ డేటాబేస్‌లోకి చేరుస్తారు. డేటాబేస్‌ను
వెబ్‌ల్యాండ్ 1.0, 2.0లో ‘పట్టా’ విభాగం కింద వర్గీకరించిన భూములను నిషేధిత జాబితాలో చేర్చకూడదు. పొరపాటున చేరిస్తే వాటిని తొలగించే బాధ్యత ఆర్డీవో/ సబ్‌కలెక్టర్‌లదే.
సాంకేతిక కారణాల వల్ల ఇవి ఇంకా నిషేధిత జాబితాలో చూపిస్తున్నప్పటికీ... సదరు భూములు పట్టా భూములని స్పష్టంగా ఉంటే వాటి రిజిస్ర్టేషన్‌కి అధికారులు నిరాకరించకూడదు.
క్రమబద్ధీకరించిన యూఎల్‌సీ భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలి. ఏపీఎస్ఎఫ్ సీకి తాకట్టు పెట్టిన భూములను ఒకవేళ వేలం వేయాల్సి వస్తే వాటి ఫలితాల ఆధారంగా నిషేధిత జాబితా ఉంచి తొలగిస్తారు.
నీటి వనరులు, నీటి వనరుల పోరంబోకు భూములను ప్రభుత్వం ప్రత్యేక ఉత్తర్వు లిస్తేనే నిషేధిత జాబితా తొలగించాలి.