Share News

‘కారుణ్యం’పై కరుణ!

ABN , Publish Date - Jul 09 , 2026 | 04:12 AM

తీవ్రమైన వ్యాధుల బారినపడి.. చికిత్సకు లొంగని స్థితిలో.. మరణానికి చేరువై నరకయాతనను అనుభవించే రోగులకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

‘కారుణ్యం’పై కరుణ!

  • చికిత్సకు లొంగని రోగులకు కారుణ్య మరణం పొందే హక్కు

  • ఫస్ల్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ అనుమతితో చికిత్స నిలిపివేసేందుకు అవకాశం

  • సుప్రీం ఆదేశాలతో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించిన ఆరోగ్యశాఖ

అమరావతి, జూలై 8(ఆంధ్రజ్యోతి): తీవ్రమైన వ్యాధుల బారినపడి.. చికిత్సకు లొంగని స్థితిలో.. మరణానికి చేరువై నరకయాతనను అనుభవించే రోగులకు ఊరట కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అటువంటి వారికి కారుణ్య మరణం లభించేలా విధివిధానాలను రూపొందించింది. దీంతో వ్యాధి నుంచి కోలుకునే అవకాశం లేక, చికిత్స పేరిట నానా ఇబ్బందులు పడేవారికి ఊరట లభించనుంది. అవసాన దశలో ఉన్నవారికి వైద్యులందించే లైఫ్‌ సపోర్ట్‌ సిస్టమ్‌ను తొలగించడానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎటువంటి చట్టపరమైన నిబంధనలను ప్రభుత్వాలు సిద్ధం చేయలేదు. చికిత్స నిష్ప్రయోజనమని తెలిసినా రోగులు కృత్రిమంగా ఊపిరి పీల్చుకుంటూ పలు కష్టనష్టాలకు గురయ్యేవారు. ఈ నేపథ్యంలో రోగులకు సహజ రీతిలో కారుణ్య మరణానికి అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది. ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ బుధవారం వీటిని ఆమోదించారు. ఈ మార్గదర్శకాలను అమలు చేసే బాధ్యతను డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ సెకండరీ హెల్త్‌, జిల్లాల్లో జీఎంహెచ్‌వోలకు ప్రభుత్వం అప్పగించింది.


మార్గదర్శకాల్లో కీలకాంశాలు ఇవీ..

నయం కాని వ్యాధితో బాధపడుతున్న రోగి ఎటువంటి నిర్భంధానికి గురికాకుండా, పూర్తి చేతనావస్థలో ఉండి, స్వతంత్రంగా, ఇద్దరు సాక్షుల సమక్షంలో తనకందించాల్సిన చికిత్సపై పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయం తీసుకునే గార్డియన్‌ను సూచిస్తూ, తన సంతకంతో కూడిన ‘అడ్వాన్స్‌ డైరెక్టివ్‌’ను రూపొందించాలి. దీనిని నోటరీ లేదా గెజిటెడ్‌ అధికారి ధ్రువీకరించాలి. రోగికి కొనసాగుతున్న చికిత్సను ఆపివేయడం ఉత్తమమని వైద్యుడు నిర్ణయిస్తే ఆ విషయాన్ని గార్డియన్‌కు తెలియజేయాలి. చికిత్స చేస్తున్న వైద్యుడితో పాటు ఐదేళ్లకు పైగా అనుభవం కలిగిన ఇద్దరు వైద్యులతో ప్రైమరీ మెడికల్‌ బోర్డును ఆస్పత్రి యాజమాన్యం ఏర్పాటు చేయాలి. ఈ బోర్డు రోగిని క్షుణ్నంగా పరిశీలించి 48 గంటల్లో ప్రాథమిక నిర్ణయం తీసుకోవాలి. అన్ని ఆమోదాలు లభించాక ఆఖరున ఫస్ల్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ అనుమతితో చికిత్సను నిలిపివేయవచ్చు.

Updated Date - Jul 09 , 2026 | 04:13 AM