ఒక్క రోజులోనే వాహన రిజిస్ట్రేషన్
ABN , Publish Date - May 12 , 2026 | 05:07 AM
కొత్త వాహనం కొన్నారా..? రిజిస్ర్టేషన్ కోసం గతంలో వలే రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మీ వాహనాన్ని ఒక్కరోజులోనే రిజిస్ర్టేషన్ చేసేలా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
డీలర్ అప్‌లోడ్ చెయ్యగానే ఆర్టీవోకు..
24గంటల్లో ఆమోదించకపోతే ఆటోమెటిక్‌గా నంబర్ జారీ
అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): కొత్త వాహనం కొన్నారా..? రిజిస్ర్టేషన్ కోసం గతంలో వలే రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. మీ వాహనాన్ని ఒక్కరోజులోనే రిజిస్ర్టేషన్ చేసేలా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కొనుగోలుదారులు డీలర్ వద్ద వాహనం కొనగానే తగిన డాక్యుమెంట్లను ‘వాహన్’ పోర్టల్‌లో అప్‌లోడ్ చెయ్యాలి. పోర్టల్‌లో ఆ వివరాలు చూసుకుని అన్నీ సక్రమంగా ఉంటే ఆర్టీవో ఆమోదం తెలుపుతారు. వాహనానికి వెంటనే నంబర్ ఇచ్చేస్తారు. ఏదైనా కారణాలతో ఆర్టీవో ఆమోదించకుండా ఉంటే ఆ వాహనానికి ఆటోమెటిక్‌గా నంబర్ కేటాయిస్తారు. ఒకవేళ ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వాటి విలువ ఆధారంగా కేటాయిస్తారు. ఒకే నంబర్‌ను ఎక్కువ మంది కోరుకుంటే ఆన్‌లైన్ వేలంలో ఎక్కువ మొత్తం కోట్ చేసిన వారికి ఆ నంబర్ కేటాయిస్తారు. రాష్ట్ర విభజన తర్వాత 2017లో చంద్రబాబు ప్రభుత్వం ఆన్‌లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ప్రభుత్వం మారడం, కరోనా వల్ల ఈ ప్రక్రియ రాష్ట్రంలో ఆగిపోయింది. అయితే 2022లో కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయినప్పటికీ అప్పటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేయలేదు. కూటమి ప్రభుత్వం హయాంలో తిరిగి పాత విధానం మొదలైనా కొందరు అధికారులు జాప్యం చేస్తుండటంతో పాతిక వేలకు పైగా వాహనాలకు రిజిస్ర్టేషన్ నెలల తరబడి పెండింగ్‌లో ఉంది. దీంతో వాహనదారుల్లో అసంతృప్తి వ్యక్తమైంది. అప్రమత్తమైన రవాణా శాఖ ఆర్టీఏ వద్ద 24గంటలకు మించి ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఫైలు పెండింగ్‌లో పెట్టరాదంటూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆటోమెటిక్‌గా ఆమోదం పొందితే డీలర్ అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్లు కచ్చితమైనవి కాకపోతే, దానికి ఎవరు బాధ్యత వహిస్తారనే ప్రశ్న రవాణా వర్గాల్లో వినిపిస్తోంది. ఒక ఆర్టీవో కార్యాలయం నుంచి ఎక్కువ ఫైళ్లు ఆటోమెటిక్‌గా ఆమోదం పొందితే అందుకు కారణాలు తప్పనిసరిగా చెప్పాల్సిందేనని, చెప్పకపోతే ఆ ఫైలులో నకిలీ డాక్యుమెంట్లు ఉన్నా సంబంధిత అధికారే బాధ్యత వహించాల్సి ఉంటుందన్న నిబంధన జీవోలో ఎక్కడా లేదని రవాణా శాఖ అధికారులే చెబుతున్నారు. సెలవు రోజుల్లోనూ ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ ఫైళ్లు ఆమోదం తెలపాల్సిందేనన్న నిబంధనపై ఆర్టీఏ అధికారులు పెదవి విరుస్తున్నారు.