Transport Department: వాహనాలపై రహదారి భద్రతా సెస్
ABN , Publish Date - Jan 14 , 2026 | 04:11 AM
రోడ్డు ప్రమాదాలను నివారించి.. రహదారి భద్రతను మరింత పటిష్ఠం చేసే కీలక లక్ష్యంతో సొంత(వైట్ బోర్డు) వాహనాల జీవితకాల పన్ను(లైఫ్ ట్యాక్స్)పై 10శాతం సెస్ వసూలు చేసేందుకు...
లైఫ్ ట్యాక్స్‌పై 10శాతం వసూలుకు ఆర్డినెన్స్
ప్రమాదాల నివారణకు పటిష్ఠ చర్యలు
అమరావతి, జనవరి 13(ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలను నివారించి.. రహదారి భద్రతను మరింత పటిష్ఠం చేసే కీలక లక్ష్యంతో సొంత(వైట్ బోర్డు) వాహనాల జీవితకాల పన్ను(లైఫ్ ట్యాక్స్)పై 10శాతం సెస్ వసూలు చేసేందుకు రవాణా శాఖ సిద్ధమైంది. ఈ మేరకు అదనపు సెస్ వసూలుకు సంబంధించి ఏపీ మోటార్ వాహన పన్ను చట్టం-1963ను సవరిస్తూ రవాణా శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. దీనిని రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించింది. అనంతరం.. మంత్రి మండలి నిర్ణయాన్ని గవర్నర్‌కు పంపించడంతో సోమవారం ఆయన ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో న్యాయశాఖ మంగళవారం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీంతో లైఫ్ ట్యాక్స్ చెల్లించే వాహనాలు ఇకపై అదనంగా 10 శాతం రహదారి భద్రతా సెస్సును చెల్లించాల్సి ఉంటుంది. వాహనాల కొనుగోలు దారులు ఆయా వాహనాల ధరపై కనిష్ఠంగా 9 శాతం నుంచి గరిష్ఠంగా 18 శాతం జీవితకాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు లైఫ్ ట్యాక్స్‌పై 10 శాతం సెస్సుగా చెల్లించాలి. ఉదాహరణకు రూ.లక్షకు పైగా ఖరీదైన బైకు కొనుగోలు చేసే వారు 12 శాతం లైఫ్ ట్యాక్స్(రూ.12 వేలు)తో పాటు అదనంగా రూ.1200 సెస్ చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా రూ.25 లక్షల ఖరీదైన కారు కొనుగోలు చేసే వారు 18శాతం లైఫ్ ట్యాక్స్(రూ.4.50 లక్షలు)తో పాటు మరో రూ.45 వేలు అదనంగా చెల్లించాలి. ఈ విషయమై ఇటీవల రవాణా శాఖ వివరణ ఇస్తూ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ సంస్కరణల్లో భాగంగా 28శాతం జీఎస్టీని 18శాతానికి తగ్గించిందని.. రోడ్డు భద్రత కోసం విధిస్తున్న సెస్ చాలా చిన్న మొత్తమేనని తెలిపింది. కాగా, రాష్ట్రంలో ఇటీవల రోడ్డు ప్రమాదాలు పెరుగుతుండటంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలో వాహనాల జీవితకాల పన్నుపై అదనంగా వసూలు చేసే 10 శాతం సెస్సును రహదారి భద్రతను పటిష్ఠపరిచేందుకు వినియోగించనుంది. ఈ నిధులతో రహదారుల మరమ్మతులు, బ్లాక్ స్పాట్స్ తొలగింపు, సిగ్నలింగ్ వ్యవస్థ బలోపేతం చేస్తారు.