Share News

‘ఎలక్టివ్‌’లో విద్యార్థుల తడబాటు!

ABN , Publish Date - Feb 24 , 2026 | 04:14 AM

రాష్ట్రంలో సోమవారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ‘ఎలక్టివ్‌’ సబ్జెక్టుల విషయంలో కొందరు విద్యార్థుల తమ ఆలోచనను మార్చుకున్నారు.

‘ఎలక్టివ్‌’లో విద్యార్థుల తడబాటు!

  • రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం

  • గణితం, సైన్స్‌ తీసుకుని మళ్లీ భాషా సబ్జెక్టులే రాసిన కొందరు

  • మొదటి రోజు 20,123 మంది గైర్హాజరు

అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సోమవారం ఇంటర్మీడియట్‌ పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ‘ఎలక్టివ్‌’ సబ్జెక్టుల విషయంలో కొందరు విద్యార్థుల తమ ఆలోచనను మార్చుకున్నారు. ముందుగా సీఈసీ విద్యార్థులు ఎలక్టివ్‌ సబ్జెక్టు కింద గణితం తీసుకున్నారు. కొందరు ఇతర ఆర్ట్స్‌ గ్రూపుల విద్యార్థులు అయితే సైన్స్‌ సబ్జెక్టులనూ ఎంపిక చేసుకున్నారు. తీరా పరీక్షలకు ముందు అవన్నీ మన వల్ల కాదులే అనుకుని.. తిరిగి భాషా సబ్జెక్టులకు వెళ్లిపోయారు. వారంతా సోమవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో భాషా సబ్జెక్టు పేపర్ల పరీక్షలు రాశారు. వంద మందికి పైగా విద్యార్థులు ఇలా సబ్జెక్టుల ఎంపికను మార్చుకున్నారు. కాగా, 20,123 మంది మొత్తంగా పరీక్షలకు గైర్హాజరయ్యారు. 5,24,771 మంది విద్యార్థులు భాషా సబ్జెక్టుల పరీక్షలు రాసినట్లు ఇంటర్‌ విద్యామండలి వెల్లడించింది. మంగళగిరిలోని పలు కేంద్రాలను ఇంటర్‌ విద్యామండలి కార్యదర్శి పి.రంజిత్‌ బాషా పరిశీలించారు. విద్యార్థులకు సౌకర్యాలపై ఆరా తీశారు. సీసీ కెమెరాలు, నిఘా వ్యవస్థ అమలు తీరును పరిశీలించారు.

ఎలక్టివ్‌ ఎంపికలో మార్పులు

ఇంటర్‌ విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం అనేక సంస్కరణలు చేపట్టింది. అందులో భాగంగా గణితం, సైన్స్‌ సబ్జెక్టులు విలీనం చేసింది. కొత్తగా ఎలక్టివ్‌ సబ్జెక్టు విధానం ప్రవేశపెట్టింది. అంటే విద్యార్థులు ఇంగ్లిష్‌, మిగిలిన మూడు సంబంధిత గ్రూపు సబ్జెక్టులు తప్పనిసరిగా చదవాలి. ఐదో సబ్జెక్టు ఎలక్టివ్‌గా ఉంటుంది. గ్రూపుతో సంబంధం లేకుండా ఏ సబ్జెక్టు అయినా ఎలక్టివ్‌ కింద తీసుకోవచ్చు. ఈ క్రమంలోనే కొందరు ఆర్ట్స్‌ గ్రూపుల విద్యార్థులు గణితం, బయాలజీలను ఎంపిక చేసుకున్నా.. పరీక్షలు సమీపించిన తర్వాత ఆ సబ్జెక్టులు కష్టంగా ఉన్నాయని.. వాటి స్థానంలో భాషా సబ్జెక్టులు తీసుకున్నారు. పరీక్షల్లో భాషా సబ్జెక్టులే రాశారు.

Updated Date - Feb 24 , 2026 | 04:16 AM