Share News

‘ఆర్టీఐ’తో ఆటలా?!

ABN , Publish Date - Jun 21 , 2026 | 05:48 AM

సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) దుర్వినియోగం చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై సమాచార కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా..

‘ఆర్టీఐ’తో ఆటలా?!

  • చట్టం దుర్వినియోగంపై రాష్ట్ర సమాచార కమిషన్‌ ఆగ్రహం

  • ఇద్దరిని నిషేధిస్తూ కీలక నిర్ణయం

  • తిరుపతిలో ‘ఆర్టీఐ’ ఆఫీస్‌నే తెరిచిన జయచంద్రారెడ్డి

  • సీజ్‌ చేయాలని కలెక్టరుకు కమిషన్‌ ఆదేశం

అమరావతి, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టాన్ని (ఆర్టీఐ) దుర్వినియోగం చేస్తున్న ఇద్దరు వ్యక్తులపై సమాచార కమిషన్‌ తీవ్రంగా స్పందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఆ ఇద్దరి ఆర్టీఐ దరఖాస్తులు, వివిధ ఆఫీసుల్లో పెండింగ్‌లో ఉన్న అప్పీల్‌ పిటిషన్‌లను తిరస్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక భవిష్యత్తులోనూ వారు ఆర్టీఐ దరఖాస్తులు ఇవ్వడానికి వీల్లేదంటూ నిషేధం విధించింది. ఈ మేరకు రాష్ట్ర సమాచార ప్రధాన కమిషనర్‌ వజ్జా శ్రీనివాసరావు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఇద్దరిలో ఒకరు తిరుపతికి చెందిన లీగల్‌ ఎయిడ్‌ వెల్ఫేర్‌ సొసైటీ ప్రెసిడెంట్‌, న్యాయవాది పెరుమాల్‌ జయచంద్రారెడ్డి కాగా, మరొకరు మదనపల్లెకు చెందిన విద్యార్థి సంఘం నేత వి.ఉత్తన్న. తిరుపతిలోని జయచంద్రారెడ్డి ఆఫీసులో విలువైన రెవెన్యూ రికార్డులు చాలానే ఉన్నాయని, వెంటనే ఆయన ఆఫీసును సీజ్‌ చేయాలని తిరుపతి కలెక్టర్‌ను సమాచార కమిషన్‌ ఆదేశించింది. తప్పులు పునరావృతం ఆ ఇద్దరిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.


ఏం జరిగిందంటే..

తిరుపతికి చెందిన పెరుమాల్‌ జయచంద్రారెడ్డి ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం కోరుతూ పబ్లిక్‌ ఇన్‌ఫర్మేషన్‌ ఆఫీసర్‌ (పీఐఓ)లకు భారీగా ఆర్టీఐ దరఖాస్తులు ఇచ్చారు. తను కోరిన సమాచారం ఇవ్వడం లేదంటూ సమాచార చట్టంలోని ఫస్ట్‌ అప్పిలేట్‌ అఽథారిటీ వద్ద అనేక ఫిర్యాదులు దాఖలు చేశారు. 2017 నుంచీ (ఎస్‌నెం.9611 ) వరుసగా దరఖాస్తులు ఇవ్వడం, వాటిపై సమాచారం రాలేదని అప్పీల్‌ పిటిషన్‌ వేయడం ఒక పనిగా పెట్టుకున్నారు. ఈ కేసులన్నింటినీ చీఫ్‌ కమిషనర్‌ వజ్జా శ్రీనివాసరావు అమరావతిలోని తన కార్యాలయంలో విచారించారు. ఆర్టీఐ చట్టాన్ని జయచంద్రారెడ్డి దుర్వినియోగం చేస్తున్నారని, దీని కోసం తిరుపతిలో ఒక పెద్ద ఆఫీసునే నడుపుతున్నారని, దాన్నో వ్యాపారంగా చేసుకున్నారని వివిధ శాఖల అధికారులు ఆరోపణలు చే శారు. అదే సమయంలో జయచంద్రారెడ్డిపై వి.లలితాదేవి, చంద్రయ్య అనే ఇద్దరు ఫిర్యాదు చేశారు. జయచంద్రారెడ్డి నిర్వహిస్తున్న ఆఫీసులో ఎక్కువగా రెవెన్యూశాఖ రికార్డులే ఉన్నాయని, తమకు సమాచారం ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని వాళ్లు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఇటు పీఐవోలు, అటు అప్పీలేట్‌ అధికారులు, బాధితులు ఇచ్చిన ఫిర్యాదులను కమిషన్‌ పరిశీలించింది. ఆర్టీఐ చట్టం కింద ఆయనను నిషేధిస్తూ, నిర్ణయం తీసుకుంది. ఆర్టీఐ చట్టం కింద సమాచారం కోరడం తప్పు కాదని, కానీ, ఆ పేరిట తీసుకున్న సమాచారం దుర్వినియోగం చేయడం, అధికారులను, వ్యవస్థలను బెదిరించడం నేరమని ఈ సందర్భంగా కమిషన్‌ అభిప్రాయపడింది.


వి.ఉత్తన్నపై నిషేధం

ఉమ్మడి చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన విద్యార్థి సంఘం నేత వి.ఉత్తన్న, ఆయన అనుచరులను కూడా ఆర్టీఐ చట్టం కింద ఏ సమాచారం కోరకుండా నిషేధిస్తూ, సమాచార కమిషన్‌ మరో ఉత్తర్వు జారీ చేసింది. విద్యార్థి సంఘం నేత హోదాలో ఉత్తన్న ఆర్టీఐ కింద 2015 లో మదనపల్లె కాలేజీకి సంబంధించిన కీలక సమాచారం కోరారు. కమిషన్‌ జోక్యంతో కాలేజీ నుంచి 800 పేజీల సమాచారం ఉచితంగానే ఆయనకు అందించారు. అయితే, తాను కోరిన సమాచారం ఇవ్వలేదంటూ ఆయన పలుమార్లు అప్పీలేట్‌ అధికారి వద్ద అప్పీళ్లు దాఖలు చేశారు. మరోవైపు తన అనుచరులతోనూ ఆర్టీఐ కింద సమాచారం కోరేలా ఒత్తిడి తీసుకొచ్చారన్న ఆరోపణలు వచ్చాయి. వీటికి సంబంధించిన (సీఎన్‌ నెం. 5131 ఆఫ్‌ 2017) అప్పీళ్లను చీఫ్‌ కమిషనర్‌ పరిశీలించారు. సుదీర్ఘ కాలంగా అప్పీలేట్‌ అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించారు. ఉత్తన్న ఆర్టీఐ చట్టాన్ని దుర్వినియోగపరిచేలా వ్యవహరించారని కమిషన్‌ నిర్థారణకు వచ్చింది. ఈ నేపఽథ్యంలో ఉత్తన్న, ఆయన అనుచరులు ఈ చట్టం పరిధిలో ఇక ఏ సమాచారం కోరకుండా నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

Updated Date - Jun 21 , 2026 | 05:50 AM