Share News

ఆవుల అక్రమ రవాణా... మళ్లీ మొదలైంది!

ABN , Publish Date - Jul 03 , 2026 | 05:47 AM

ఆవుల అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది. చీకటి మాటున వేలాది గోవులు కబేళాలకు తరలిపోతున్నాయి. ప్రతి పశువుకు రూ.1,500 చొప్పున కమీషన్‌ వసూలు చేస్తూ పశు మాఫియాకు..

ఆవుల అక్రమ రవాణా... మళ్లీ మొదలైంది!

  • రాష్ట్రం నుంచి నెలకు 20వేలకు పైగా గోవులు కబేళాకు

  • ఒక్కోదానికి 1,500 చొప్పున నెలకు 3 కోట్ల మామూళ్లు

  • పశు మాఫియాకు ఇద్దరు నాయకుల అనుచరుల అండ

  • వాహనాలు ఆపగానే ఎంవీఐలు, పోలీసులకు ఫోన్లు

  • వ్యాపారులతో పశుసంవర్థక శాఖ అధికారులు కుమ్మక్కు

  • పది ఆవులను తరలించాల్సిన వాహనంలో 30కి పైగా..

  • ఊపిరాడకుండా, తాగునీరు ఇవ్వకుండా నరకయాతన

  • ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లనున్న హిందూ సంఘాలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఆవుల అక్రమ రవాణా మళ్లీ జోరందుకుంది. చీకటి మాటున వేలాది గోవులు కబేళాలకు తరలిపోతున్నాయి. ప్రతి పశువుకు రూ.1,500 చొప్పున కమీషన్‌ వసూలు చేస్తూ పశు మాఫియాకు ఇద్దరు నేతల అనుచరులు పూర్తి సహకారం అందిస్తున్నారు. వారి వాహనాలను బ్రేక్‌ ఇన్‌స్పెక్టర్లు, పోలీసులు ఆపకుండా మేనేజ్‌ చేస్తున్నారు. మరోవైపు పశువుకు రూ.150 ఇస్తే ఆరోగ్యంగా ఉందని పశుసంవర్థక శాఖ అధికారులు అడ్డగోలుగా సర్టిపికెట్లు ఇచ్చేస్తుండటంతో ఆవుల అక్రమ రవాణా ఇప్పుడు మరింత విచ్చలవిడిగా సాగుతోంది. ఈ బాగోతంపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో రవాణా శాఖ కమిషనర్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా, ఉత్తరాంధ్ర ఐజీ గోపీనాథ్‌ జెట్టి గతనెలలో చర్యలు చేపట్టారు. అనుమతిలేని వాహనాలు ఆపాలంటూ ఎంవీఐలకు కమిషనర్‌ ఆదేశాలిచ్చారు. పశు మాఫియాపై ఉక్కుపాదం మోపాలని ఐదు జిల్లాల ఎస్పీలకు ఐజీ స్పష్టం చేశారు. దీంతో అక్రమ రవాణాకు కొన్నాళ్లు అడ్డుకట్ట పడింది.


హడావుడి కొన్నాళ్లే..

పది రోజుల తర్వాత మునసబుగా పిలిపించుకునే ఓ వ్యక్తి విజయవాడలో పశువుల అక్రమ రవాణాదారులతో సమావేశమయ్యాడు. ‘హిందూ సంఘాల వ్యక్తులెవరో ఫిర్యాదు చేయడంతో కొన్నాళ్లు హడావుడి చేశారు. ఇక మొదలుపెట్టండి. ప్రతి పశువుకు రూ.1,500 ఇస్తే ఏ ఇబ్బందులు ఉండవు. అందుకు నాది భరోసా’ అంటూ హామీ ఇవ్వడంతో మళ్లీ దందా మొదలైంది. తుని నుంచి తడ వరకూ రాత్రి వేళల్లో ఆవుల్ని అక్రమంగా తరలించి అక్కడి నుంచి తమిళనాడు, కేరళలోని కబేళాలకు పంపుతున్నారు. గతనెలలో ఈ వాహనాలను ఆపి, జరిమానాలు రాసిన ఎంవీఐలు ఇప్పుడు వాటివైపు కన్నెత్తి చూడటం లేదు. ‘మనుషులే ఆటోల్లో ఓవర్‌ లోడ్‌తో వెళ్లి ప్రాణాలు పోగొట్టుకొంటున్నారు. ఇక పశువుల గురించి ఏమి చూస్తాం’ అంటున్నారు. ‘బండి ఆపగానే ఫోన్లు వస్తున్నాయి.. ఏమీ చేయలేక పోతున్నాం’ అంటూ పోలీసులు సైతం నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఇదే అవకాశంగా ఆవుల్ని అక్రమంగా తరలిస్తూ కొన్ని ముఠాలు రూ.వందల కోట్ల ఆర్జిస్తున్నాయి. ఉత్తరాంధ్రలో పదుల కేసుల్లో అరెస్టయి జైలుకు వెళ్లొచ్చిన వ్యక్తితో పాటు రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన మరో వ్యక్తి ఈ తతంగాన్ని నడిపిస్తున్నారు.


పెరిగిన పశువుల రవాణా

రాష్ట్రంలో పశువుల రవాణా నెల క్రితం వరకూ నెలకు 15వేల నుంచి 16వేల మధ్యలో ఉండేది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్ నుంచి పార్వతీపురం వరకూ తీసుకొచ్చి అక్కడినుంచి కేరళ, తమిళనాడుకు తరలించేవారు. పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్‌కు ఆవుల ఆక్రమ రవాణా ఆగిపోయింది. దీంతో బిహార్‌, మధ్యప్రదేశ్‌ నుంచి పశువుల్ని ఏపీవైపు తీసుకొస్తున్నారు. కేరళలో పశుమాంస విక్రయాలు అధికంగా ఉంటున్నాయి. ఇదే అవకాశంగా ఇప్పుడు ఏపీలో ప్రతినెలా 20వేలకు తగ్గకుండా పశువుల్ని అక్రమ రవాణా మాఫియా తరలిస్తోంది. ఈ లెక్కన నెలకు రూ.3 కోట్లకు తగ్గకుండా ఆదాయం పొందుతున్నట్లు సమాచారం. ఇందులో ఇద్దరు రాష్ట్ర స్థాయి ప్రజా ప్రతినిధులకు సింహభాగం చేరుతున్నట్లు తెలుస్తోంది. ఈ బాగోతాన్ని ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకెళ్లేందుకు హిందూ సంఘాలు సిద్ధమయ్యాయి.


విజిలెన్స్‌ ఆరాలో విస్తుపోయే వాస్తవాలు

పశువుల రవాణా అనుమతులు పొందిన వ్యాపారులతో పశుసంవర్థక శాఖ అధికారులు కుమ్మక్కై అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై ఆరా తీసిన విజిలెన్స్‌ అధికారులు విస్తుపోయే విషయాలు గుర్తించారు. పశువుల సరఫరాదారులకు అనకాపల్లి, తుని ప్రాంతంలో అధికారులు అడ్డగోలుగా అనుమతులు ఇస్తున్నట్లు తేలింది. ‘పశువు ఆరోగ్యంగా ఉంది.. విక్రయించింది యజమానే.. తీసుకెళుతున్నది పాడి కోసమే..’ అంటూ అన్నీ సక్రమంగా ఉన్నట్లు ఆన్‌లైన్‌ ద్వారా అనుమతులు ఇచ్చేస్తున్నారు. ఆవును విక్రయించిన యజమాని, కొనుగోలు చేసిన రైతు ఆధార్‌ నంబర్లు తీసుకోవాలన్న నిబంధనను పట్టించుకోవడం లేదు. దీంతో పశు మాఫియా పేట్రేగిపోతోం ది. పది పశువులను తరలించాల్సిన వాహనంలో నిర్దాక్షిణ్యంగా 30కి పైగా కుక్కేసి, వాటికి ఊపిరాడకుండా నరకయాతన చూపి స్తూ, తాగడానికి నీరు సైతం ఇవ్వకుండా చీకటి మాటున సరిహద్దులు దాటిస్తోంది.

Updated Date - Jul 03 , 2026 | 05:48 AM