Share News

పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు

ABN , Publish Date - Apr 05 , 2026 | 04:03 AM

గత జగన్‌ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి అంతులేని దోపిడీకి పాల్పడ్డారు. నాటి హౌసింగ్‌ అధికారులు క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అక్రమాలకు వంతపాడారు.

పేదల ఇళ్లపై వైసీపీ గద్దలు

  • జగన్‌ జమానాలో ఇళ్ల నిర్మాణంలో భారీ అవినీతి

  • అక్రమాలకు హౌసింగ్‌ అధికారుల అండ

  • ఆప్షన్‌-3 పథకంలో వేలకోట్ల దోపిడీ

  • కాంట్రాక్టర్ల అవతారమెత్తిన వైసీపీ నేతలు

  • నిర్మాణం ప్రారంభించకుండానే అడ్వాన్స్‌లు

  • ఇళ్లు నిర్మించకుండా మధ్యలో వదిలేసిన వైనం

  • క్షేత్రస్థాయి నుంచి యంత్రాంగం కుమ్మక్కు

  • అప్పటి హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ బాధ్యుడు

  • గృహ నిర్మాణ శాఖ ముఖ్య కార్యదర్శికీ తెలుసు

  • విజిలెన్స్‌ విచారణలో అక్రమాలు వెలుగులోకి

  • అయినా అక్రమార్కులకు పైఅధికారుల అండ

  • విజిలెన్స్‌ నివేదికనే తప్పు పట్టేలా కుట్రలు

జగన్‌ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట మెటీరియల్‌ మింగేసిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కుటుంబీకులకు చెందిన రాక్రీట్‌ సంస్థపై తాజాగా కేసు నమోదైంది. పేదలకు, ప్రభుత్వానికి ఆ సంస్థ చేసిన నష్టం రూ.4 కోట్లు. రాక్రీట్‌ అక్రమాల్లో ఇది కొసరంతే. విశాఖ, ఏలూరు, అనంతపురం, కడప తదితర జిల్లాల్లో భారీగా అవినీతికి పాల్పడింది. హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు రూ.80 కోట్లకు పైగా అదనంగా చెల్లించారని విజిలెన్స్‌ విచారణలో తేలింది. రాక్రీట్‌ నుంచి ఈ మొత్తాన్ని రికవరీ చేయాలని గతేడాదే ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసింది. అయినా అధికారులు చర్యలు తీసుకోలేదు.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత జగన్‌ ప్రభుత్వంలో పేదల ఇళ్ల నిర్మాణం పేరిట జరిగిన అక్రమాలు అన్నీ ఇన్నీ కావు. వైసీపీ నేతలే కాంట్రాక్టర్ల అవతారం ఎత్తి అంతులేని దోపిడీకి పాల్పడ్డారు. నాటి హౌసింగ్‌ అధికారులు క్షేత్ర స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు అక్రమాలకు వంతపాడారు. తమ వాటాలు దక్కించుకున్నారు. నేతలు, అధికారులు కలసి పేదలకు అన్యాయం చేశారు. నాడు చేసిన వేలకోట్ల దందా అంతా హౌసింగ్‌ ఉన్నతాధికారులకు తెలిసే జరిగిందని, అయినా వారు మిన్నకుండిపోయారని విజిలెన్స్‌ నిగ్గుతేల్చింది. వేలకోట్ల ప్రజాఽధనం దోచుకున్న ఉదంతంలో పాత్రధారులు, సూత్రధారులుగా ఉన్న అక్రమార్కులకు పెద్ద అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులను వెనకేసుకొస్తున్నారు. ఫలితంగా శాఖాపరమైన, చట్టపరమైన చర్యలేవీ ముందుకు సాగడం లేదు.


రాజకీయ కుట్ర.. బంధుప్రీతి

గత వైసీపీ ప్రభుత్వం పేదలకు ఆప్షన్‌-3 కింద తామే ఇళ్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 3.51 లక్షలమంది లబ్ధిదారులు దాన్ని ఎంపిక చేసుకున్నారు. ఒక్కో ఇంటికి కేంద్రం రూ.1.80 లక్షల సబ్సిడీ ఇచ్చింది. ఈ లెక్కన 3.51 లక్షల ఇళ్లకు వచ్చిన సబ్సిడీ సొమ్మే రూ.60 వేల కోట్లకు పైగా ఉంటుంది. ఇదిగాక రాష్ట్రప్రభుత్వం తన వాటాగా మరో 20 వేల కోట్ల వ్యయం చేసింది. 80 వేలకోట్ల విలువైన ప్రాజెక్టులో వైసీపీ నేతలు కొందరు కాంట్రాక్టర్ల పేరిట చొరబడ్డారు. వారికే కాంట్రాక్టులు దక్కేలా అధికారులు నియమనిబంధనలు సులభతరం చేశారు. నాటి గృహ నిర్మాణ శాఖ, హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు నాటి పాలక పెద్దలు, వైసీపీ నేతలకు కొమ్ముకాశారు. చాలా జిల్లాల్లో టెండర్లను ప్రభావితం చేశారు. బ్యాంకు గ్యారెంటీలు కూడా లేకుండానే కాంట్రాక్టర్ల ముసుగులో ఉన్న వైసీపీ నేతలకు వర్క్‌లు ఇచ్చారు. ఇళ్ల నిర్మాణం ప్రారంభించకుండానే 38 శాతంపైగా నిధులను అడ్వాన్స్‌ల రూపంలో చెల్లించారు. కాగితాలపైనే ఇళ్ల నిర్మాణం చేపట్టారు. దశలవారీగా ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లుగా నివేదికలు రూపొందించారు. ‘ఆంధ్రజ్యోతి’ అనేక పరిశోధనాత్మక కథనాల ద్వారా నాటి అక్రమాలను వెలుగులోకి తీసుకొచ్చింది. కూటమి సర్కారు వచ్చాక హౌసింగ్‌ అక్రమాలపై విజిలెన్స్‌ విచారణకు ఆదేశించింది. అంతూపొంతూ లేని అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని విజిలెన్స్‌ నిగ్గుతేల్చింది. వేలకోట్ల నిధులను దోచుకున్నారని చెబుతూ అక్రమాల్లో రాజకీయకుట్ర, బంధుప్రీతి ఉన్నాయని వెల్లడించింది.


పెద్దల పాత్ర ప్రస్తావన

హౌసింగ్‌ అక్రమాలపై విచారణ చేసిన విజిలెన్స్‌ ఉన్నత స్థాయి వైఫల్యాలను ఎత్తిచూపింది. పేదింటి నిర్మాణ పథకం పక్కదారి పట్టడానికి ఆ నాటి హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ బాధ్యుడని తేల్చి చెప్పింది. అప్పటి ముఖ్యమంత్రి జగన్‌కు సన్నిహితుడైన ఐఏఎస్‌ అధికారే కార్పొరేషన్‌ ఎండీగా ఉన్నారు. తర్వాత ఆయన్ను సీఎంవోలోకి తీసుకున్నారు. ఐదేళ్లూ హౌసింగ్‌లో జరిగిన అక్రమాలు నాటి గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శి నోటీసులోనే ఉన్నాయని మరో సంచలన అంశాన్ని విజిలెన్స్‌ వెలుగులోకి తెచ్చింది. ముఖ్య కార్యదర్శి అంటే.. ప్రభుత్వ స్థాయిలో కీలక వ్యక్తి. ప్రాజెక్టును పక్కాగా అమలు చేయించడంలో పర్యవేక్షణ చేయాల్సిన అధికారి. అక్రమాలు, అవినీతి జరుగుతుంటే అడ్డుకుని ప్రజాధనాన్ని కాపాడాల్సిన అధికారి. కానీ ఇవేవీ పట్టించుకోలేదు.

అక్రమార్కులకు కొండంత అండ

నాడు పేదల ఇళ్ల నిర్మాణంలో జరిగిన వేలకోట్ల దోపిడీలో ఎవరి పాత్ర ఏమిటి? ఎవరి వైఫల్యం ఎంత? ఎవ రెవరికి తెలిసి అక్రమాలు జరిగాయి? వంటి విషయాలను విజిలెన్స్‌ సవివరంగా బయటపెట్టింది. ఇందులో అనేక మంది అధికారుల ప్రస్తావన, వారి అధికార దుర్వినియోగాన్ని ప్రస్తావించింది. ప్రభుత్వం ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ఇది ఒకరిద్దరో, వందమందికో పరిమితమైన కుంభకోణం కాదు. క్షేత్రస్థాయి నుంచి ఉన్నతస్థాయి వరకు అధికారులు, కాంట్రాక్టర్ల ముసుగులో వైసీపీ నేతలు చేసిన దారుణమైన దోపిడీ. కానీ తమను తాము కాపాడుకునేందుకు కొందరు అధికారులు కొత్త ఎత్తుగడ వేశారు. తప్పు తమది కాదని, తప్పంతా విజిలెన్స్‌దేనని నిరూపించేందుకు సరికొత్త కుట్రలకు తెరతీశారు. ఇందుకు ఉన్నతస్థాయిలోని ఇద్దరు అధికారుల ఇతోధిక సహకారం కూడా ఉంది. దీంతో విజిలెన్స్‌ విచారణ కుట్రపూరితంగా జరిగిందని, అసలు హౌసింగ్‌లో అక్రమాలే లేవనే వాదనను తెరమీదకు తీసుకొస్తున్నారు. లబ్ధిదారులకే తెలియకుండా ఇంటి నిర్మాణ డేటాను ఆన్‌లైన్‌లో నుంచి తొలగించే కుట్రలు చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియకు ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కర్త, కర్మ, క్రియగా వ్యవహరిస్తున్నారు.


వీరి సంగతేంటి?

నెల్లూరు జిల్లాకు చెందిన జేఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అనే మరో సంస్థకు విశాఖపట్నం, కాకినాడ, తూర్పుగోదావరి, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల్లో 75 వేలకు పైగా ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును అప్పగించారు. ఈ కాంట్రాక్టు విలువ సుమారు రూ.2 వేల కోట్లు. అదేవిధంగా అజాయా వెంచర్స్‌ అనే మరో కాంట్రాక్టు సంస్థకు విశాఖపట్నం, కాకినాడ, డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్‌టీఆర్‌, నెల్లూరు జిల్లాల్లో దాదాపు 25 వేల ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టును దక్కించుకుంది. గత జగన్‌ ప్రభుత్వంలో లబ్ధిదారులు ఎంపిక చేసుకున్న 3.51 లక్షల ఆప్షన్‌-3 ఇళ్లలో సగానికిపైగా ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులను రాక్రీట్‌, జేఎన్‌ఆర్‌, అజాయా సంస్థలకే నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. మిగిలిన ఇళ్ల కాంట్రాక్టులను ఆయా జిల్లాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకుల బినామీలు, వారు సిఫారసు చేసిన వ్యక్తులకు ఇచ్చేశారు. ఊరూ పేరూ లేని కాంట్రాక్టు సంస్థలకూ అప్పగించారు. గత ప్రభుత్వ పెద్దల సిఫారసులతో కాంట్రాక్టులు పొందిన వీరంతా రూ.కోట్లలో అడ్వాన్సులు, మెటీరియల్‌ తీసేసుకుని ఇళ్లు నిర్మించకుండా చేతులెత్తేశారు.


రాక్రీట్‌ నుంచి రికవరీకి సిఫారసు

అనంతపురం జిల్లాకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి కుటుంబీకులకు చెందిన రాక్రీట్‌ సంస్థకు విజయనగరం, విశాఖపట్నం, ఏలూరు, ఎన్టీఆర్‌, గుంటూరు, అనంతపురం, కడప జిల్లాల్లో కాంట్రాక్టు ఇచ్చారు. ఏకంగా 51,633 పేదల ఇళ్ల నిర్మాణ (ఆప్షన్‌-3) కాంట్రాక్టును కట్టబెట్టారు. ఈ కాంట్రాక్టు విలువ దాదాపు రూ.930 కోట్లు. కానీ ఈ సంస్థ ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయకుండానే హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు రూ.80.53 కోట్లకు పైగా ప్రభుత్వ ధనాన్ని అదనంగా చెల్లించారని, ఈ మొత్తాన్ని సదరు కాంట్రాక్టు సంస్థ నుంచి రికవరీ చేయాలని విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తన నివేదికలో ప్రభుత్వానికి సిఫారసు చేసింది. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 178 మంది కాంట్రాక్టర్లకు రూ.63 కోట్లు ఎక్కువగా చెల్లించారు. ఆ సొమ్మును కూడా రికవరీ చేయాలని విజిలెన్స్‌ సిఫారసు చేసింది. ఇది కాక గతంలో ఎప్పుడో కట్టుకున్న పాత ఇళ్లకు కూడా హౌసింగ్‌ అధికారులు రూ.36 కోట్లకు పైగా బిల్లులు మంజూరు చేసినట్లు విజిలెన్స్‌ గుర్తించింది. ఈ మొత్తాన్ని కూడా రికవరీ చేయాలని సిఫారసు చేసింది.


చర్యలుండవని పెద్దసారు భరోసా

‘‘గతంలో జరిగిన అక్రమాల ఆనవాళ్లు ఎక్కడా రికార్డెడ్‌గా కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోండి. గత ఐదేళ్లుగా పునాదులు, మొండిగోడలతో మిగిలిపోయిన ఆప్షన్‌-3 ఇళ్ల డీవియేషన్లు, నాణ్యతా లోపాలను ఆన్‌లైన్‌లోనే సరిచేసి వాటిని లబ్ధిదారులకు అప్పగించినట్లుగా సర్టిఫికెట్లు అప్‌లోడ్‌ చేయండి. ఆన్‌లైన్‌లో ఆప్షన్‌-3ని కనిపించకుండా చేయండి’’ అని ఓ ఉన్నతాధికారి ఇటీవల హౌసింగ్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విజిలెన్స్‌ నివేదికల గురించి భయపడవద్దని, ఎవరికీ ఇబ్బంది రాకుండా చూసుకుంటామని, అన్ని విషయాలు తనకే వదిలేయాలని ఆ అధికారి బహిరంగంగా అభయం ఇచ్చారు. వీడియో కాన్ఫరెన్స్‌, టెలికాన్ఫరెన్స్‌ల సాక్షిగా అక్రమార్కులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వ స్థాయిలో విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాల్సిన అధికారే అక్రమార్కులకు అండగా నిలవడం చర్చనీయాంశంగా మారింది. ఆ అధికారి మరో అడుగు ముందుకేసి.. ‘మీపై ఏవో చర్యలు తీసుకుంటున్నామని పైకి చెప్పడానికే నోటీసులు ఇచ్చాం. ఎవరూ ఆందోళన చెందవద్దు’ అంటూ అభయహస్తం ఇవ్వడం గమనార్హం.


  • నాడు 3.51 లక్షల ఆప్షన్‌-3 ఇళ్లలో సగానికిపైగా ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టులను రాక్రీట్‌తో పాటు జేఎన్‌ఆర్‌, అజాయా సంస్థలు దక్కించుకున్నాయి. అధికారులు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. మిగిలిన ఇళ్ల కాంట్రాక్టులను వైసీపీ ఎమ్మెల్యేల బినామీలు, అస్మదీయులు, ఇతర నేతలకు ఇచ్చేశారు. గత ప్రభుత్వ పెద్దల సిఫారసులతో రూ.కోట్లలో అడ్వాన్సులు, మెటీరియల్‌ తీసేసుకుని ఇళ్లు నిర్మించకుండా మధ్యలోనే చేతులెత్తేశారు.

  • నాడు కాంట్రాక్టర్ల ముసుగులోని వైసీపీ నేతల అక్రమాలకు హౌసింగ్‌ అధికారులు వంతపాడారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీ సొమ్మును దోచుకుంటున్న విషయం నాటి హౌసింగ్‌ ఎండీ, ముఖ్యకార్యదర్శి నోటీసులో ఉన్నాయని విజిలెన్స్‌ నివేదికలో పేర్కొంది. క్షేత్రస్థాయిలో అధికారులూ, సిబ్బందీ అవినీతిలో భాగమయ్యారని పేర్కొంది. అయితే అక్రమార్కులను పెద్ద అధికారులు వెనకేసుకొస్తున్నారు.

Updated Date - Apr 05 , 2026 | 04:05 AM