Share News

‘పంపకాలు’ కప్పిపుచ్చుదాం

ABN , Publish Date - Apr 22 , 2026 | 04:23 AM

గత ప్రభుత్వం అమలు చేసిన ‘జగనన్న ఇళ్ల పథకం’లో కాంట్రాక్టర్లుగా మారిన వైసీపీ నేతలతో అంటకాగిన అధికారులు నాటి అక్రమాలను కప్పిపుచ్చేందుకు మరిన్ని దారుణాలకు తెగబడ్డారు.

‘పంపకాలు’ కప్పిపుచ్చుదాం

  • కాగితాలపైనే ఇళ్లు కట్టేద్దాం.. రిపోర్టులూ అలాగే ఇవ్వండి

  • అక్రమాల ఆనవాళ్లు కనిపించొద్దు

  • జగన్‌ ప్రభుత్వంలో చేపట్టిన ఆప్షన్‌-3 ఇళ్లను మూసేయండి

  • గోడౌన్లలోని స్టీలు, సిమెంట్‌, మెటీరియల్స్‌ను ఖాళీచేయండి

  • హౌసింగ్‌ ఉన్నతాధికారి ఆదేశాలు

  • గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వేల కోట్ల అక్రమాలు దాచేయత్నం

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

గత ప్రభుత్వం అమలు చేసిన ‘జగనన్న ఇళ్ల పథకం’లో కాంట్రాక్టర్లుగా మారిన వైసీపీ నేతలతో అంటకాగిన అధికారులు నాటి అక్రమాలను కప్పిపుచ్చేందుకు మరిన్ని దారుణాలకు తెగబడ్డారు. పేదల ఇంటి కలలను ధ్వంసం చేసి వేలకోట్ల ప్రజాధనం దోచేసిన వైసీపీ నేతల పాపంలో కొందరు అత్యున్నతస్థాయి నుంచి దిగువస్థాయి అధికారుల పాత్ర ఉంది. దీంతో ఇప్పుడు ఒకరినొకరు కాపాడుకునేందుకు సరికొత్త పన్నాగాలు పన్నారు. పునాదుల స్థాయిలోనే నిలిచిపోయిన లక్షలాది ఇళ్లు(ఆప్షన్‌-3) ఇక ముందుకు సాగవని, వాటిని పూర్తిచేయలేమని నిర్ణయించేసి కాగితాల్లోనే ఇంటి నిర్మాణాలు పూర్తిచేసినట్లుగా నకిలీ నివేదికలు సిద్ధం చేయాలని నిర్ణయుంచారు. ఈ దిశగా జిల్లాల హౌసింగ్‌ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా సరిగ్గా విన్నారో లేదో అని భావించి వీడియో, టెలీ కాన్ఫరెన్స్‌లు పెట్టి మరీ నూరిపోస్తున్నారు. గత ప్రభుత్వంలో ప్రారంభించిన 3.51 లక్షల ఆప్షన్‌-3 ఇళ్లను పూర్తిచేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చేలా లేరని, ఇక వాటిని నిర్మించినట్లుగానే రికార్డులు తయారు చేసి నివేదించాలని ఆదేశించారు. ఆయా ఇళ్ల నిర్మాణం కోసం గోడౌన్లలో నిల్వ చేసిన సిమెంట్‌, స్టీల్‌, ఇతర మెటీరియల్స్‌ను ఖాళీ చేయాలని ఆదేశించారు. అసంపూర్తిగా వదిలేసిన ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించినట్లుగా వారి నుంచి స్వాధీనపత్రాలు తీసుకుని ఆన్‌లైన్‌లో రికార్డులను నవీకరించాలని స్పష్టం చేశారు. అంటే, గత ప్రభుత్వంలో జరిగిన తప్పులపై విచారణ జరిగేలా చేసి, వాటిని సరిదిద్ది, పేదింటి కలలను సాకారం చేసి, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపాల్సిన ఉన్నతాధికారులే ఇలాంటి ఆదేశాలు ఇస్తుండటం విస్మయానికి గురిచేస్తోంది.


తక్కువ ఖర్చు పేరుతో..

వైసీపీ ప్రభుత్వంలో పేదలకు తక్కువ ఖర్చుతో ఇంటి నిర్మాణం చేపడుతామని నాటి సీఎం జగన్‌ ప్రకటించారు. ఈ దిశగా గృహనిర్మాణశాఖ, హౌసింగ్‌ కార్పొరేషన్‌లు ప్రణాళికలు రూపొందించాయి. ఈ క్రమంలో మూడు ఆప్షన్లను ప్రకటించాయి. ఆప్షన్‌ -1 కింద లబ్ధిదారులే పూర్తి వ్యయం భరించి ఇళ్లు నిర్మించుకుంటే సబ్సిడీని ప్రభుత్వం వారి ఖాతాలో వేస్తుంది. ఆప్షన్‌-2 కింద లబ్ధిదారులే కొంత పెట్టుబడితో ముందుకొచ్చి ఇంటి నిర్మాణం చేపడితే ప్రభుత్వం సిమెంట్‌, స్టీల్‌, ఇతర మెటీరియల్‌ అందించనుంది. ఇక, ఆప్షన్‌-3 కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి లబ్ధిదారులకు అందిస్తుంది. అయితే, రాష్ట్రంలో 3.51 లక్షల మంది పేదలు ఆప్షన్‌-3ని ఎంచుకున్నారు. దీని ప్రకారం ఒక్కొక్క ఇంటి నిర్మాణం(యూనిట్‌) వ్యయాన్ని రూ.1.80 లక్షలుగా నిర్ణయించారు. దీనిలో రూ.1.50 లక్షలు కేంద్రం సబ్సిడీగా ఇస్తుంది. మిగిలిన రూ.30 వేలను ఉపాధి హామీ పథకం కింద పేదల పని వేతనాలను జమచేస్తారు. ఇలా ఒక్కొక్క ఇంటికి ఉపాధి హామీ పథకం కింద రూ.30 వేలు వచ్చేలా ప్రణాళిక రూపొందించారు. ఈ మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.63 వేల కోట్లపైనే.


సొంత నేతలకు పందేరం

సాధారణంగా ప్రభుత్వంలో రూ.లక్ష విలువైన పని చేపడితేనే కచ్చితంగా టెండర్‌ పిలిచి అర్హత ఉన్న కంపెనీలకు పని అప్పగిస్తారు. కానీ, జగన్‌ హయాంలో ఎంపిక చేసిన కంపెనీలను ఏరికోరి పిలిచి కాంట్రాక్టులు ఇచ్చారు. టెండర్లు లేవు. పోటీలు లేవు. ఆ కంపెనీలు కూడా వైసీపీ నేతలవే కావడం గమనార్హం. దీంతో సొంత పార్టీ నేతలకే రూ.63 వేల కోట్ల విలువైన హౌసింగ్‌ ప్రాజెక్టును కట్టబెట్టారు. ఈ పనులు సజావుగా సాగేలా గృహనిర్మాణశాఖ, హౌసింగ్‌ కార్పొరేషన్‌ అధికారులు పర్యవేక్షించాలి. కానీ, కొందరు అధికారులు.. కాంట్రాక్టులు దక్కించుకున్న కంపెనీలు, వైసీపీ నేతలతో అంటకాగి ముందుగానే వాటాలు వేసుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. 65 శాతం కాంట్రాక్టర్లు, నేతలకు, మిగిలిన 35 శాతం అధికారులకు ఇచ్చేలా అనధికార లావాదేవీలు, ఒప్పందాలు సాగాయన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఇలా ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి రూ.70 వేల చొప్పున రూ.24.57 వేల కోట్లమేర చెల్లింపులు చేసినట్లు తెలిసింది. నిర్మాణాల విషయంలో కొందరు అధికారులతో ముందస్తుగా చేసుకున్న ఒప్పందాల ప్రకారం 30 శాతం మేరకు వాటాలు చెల్లించినట్లు తెలిసింది. మిగతా సొమ్మును వైసీపీ నేతలు, కాంట్రాక్టర్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. నిజానికి కాంట్రాక్టర్లు తీసుకున్న అడ్వాన్స్‌ సొమ్ముతో ఇంటి నిర్మాణ పనులు చకచకా ముందుకు సాగాలి. కానీ, పునాదుల వరకు పనులు చేసి వదిలేశారు. ఆ తర్వాత ఎలాంటి పురోగతీ లేదు.

విజిలెన్స్‌ నివేదిక ఇచ్చినా..

వైసీపీ హయాం నాటి హౌసింగ్‌ పథకంలో భారీ అక్రమాలు జరిగాయని విజిలెన్స్‌ నివేదిక ఇచ్చింది. రూ.వేల కోట్ల అక్రమాలు జరిగాయని కూడా తేల్చింది. అయినప్పటికీ.. వాటితో తమకేం పనిలేదన్నట్టు క్షేత్రస్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు వ్యవహరిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వంలోని కొందరు పెద్దల అండతోనే ఉన్నతాధికారులు ఈ తరహాదందాలు, దారుణాలకు తెగిస్తున్నారా?.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


ఉన్నతాధికారి మాస్టర్‌ప్లాన్‌

జగన్‌పాలనలో ప్రారంభించిన ఇళ్లు ఇప్పటికీ పునాదుల దశలోనే ఉన్నాయి. కాంట్రాక్టర్లకు ప్రస్తుత ప్రభుత్వం అనేక అవకాశాలు ఇచ్చినా వారు ముందుకు రావడం లేదు. దీనిని బాగా అర్థం చేసుకున్న ఓ ఉన్నతాధికారి మాస్టర్‌ప్లాన్‌ సిద్ధ చేసుకున్నారు. కాంట్రాక్టర్లు పనులు చేసే అవకాశాలు కనిపించకపోవడం, మరోవైపు విజిలెన్స్‌ నివేదిక, ఇంకోపక్క.. రూ.వేల కోట్ల అక్రమాలు జరిగాయన్న నిర్ధారణ కావడంతో నాడు వైసీపీ నేతలతో మిలాఖత్‌ అయిన అధికారుల్లో అలజడి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఉన్నతాధికారి ఒకరు మాస్టర్‌ప్లాన్‌ వేశారు. అదే..కాగితాలపైనే ఇంటి నిర్మాణం పూర్తిచేయడం!. ఆప్షన్‌-3 కింద ఇళ్ల నిర్మాణం పూర్తయినట్లుగా నివేదికలు సిద్ధం చేయాలన్నారు.

అంతా.. మేం చూసుకుంటాం!

‘‘నోటీసులు ఇచ్చినా కాంట్రాక్టర్లు ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసేలా లేరు. కాబట్టి ఆ ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లుగా రికార్డులు తయారు చేయండి. వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయండి. ఆ ఇళ్లను లబ్ధిదారులకు అందించినట్లుగా మీరే స్వాధీనపత్రాలు తీసుకోండి. వాటిని కూడా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయండి. ఆ తర్వాత ఏం చేయాలో మేం చూసుకుంటాం. ఇక అక్రమాలు, ఇతర అంశాలకు సంబంధించిన ఆనవాళ్లేవి బయటకు కనిపించకుండా జాగ్రత్తలు తీసుకోండి.’’ అని ఓ ముఖ్య అధికారి వీడియో కాన్ఫరెన్స్‌ సాక్షిగా ఆదేశించారు. ఈ దిశగానే జిల్లాల్లో ఆప్షన్‌-3 ఇళ్ల నిర్మాణం పూర్తయినట్టు చూపించే ప్రక్రియను చేపట్టారు.

Updated Date - Apr 22 , 2026 | 04:24 AM