Share News

రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్‌

ABN , Publish Date - Feb 25 , 2026 | 04:11 AM

‘చిన్నారులు, మహిళల జోలికి ఎవరొచ్చినా వారికి అదే ఆఖరి రోజు. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదు’ అని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు భేష్‌

  • రప్పా అంటే తాటతీస్తాం: హోంమంత్రి అనిత

  • శాసన మండలిలో శాంతిభద్రతలపై చర్చ రసాభాస

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ‘చిన్నారులు, మహిళల జోలికి ఎవరొచ్చినా వారికి అదే ఆఖరి రోజు. శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదు’ అని హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శాసనమండలిలో శాంతి భద్రతలపై మంగళవారం జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక నేరాలు 6శాతం తగ్గితే, మహిళలపై నేరాలు 4శాతం తగ్గాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చేనాటికి దీనావస్థలో ఉన్న పోలీసు శాఖను బలోపేతం చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షన్నర సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. డ్రోన్లతో పోలీసు పెట్రోలింగ్‌ చేస్తూ ర్యాగింగ్‌ నుంచి పేకాట వరకూ, ట్రాఫిక్‌ నుంచి జాతర్ల బందోబస్తు వరకూ పర్యవేక్షిస్తున్నామని వివరించారు. మహిళల రక్షణకు మొదటి ప్రాధాన్యం, గంజాయి నిర్మూలన రెండో అంశంగా తీసుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగు పూర్తిగా ఆపేశామని, మహిళల జోలికి వచ్చిన వారు ఏడాదిన్నరలో 500మందికి పైగా శిక్షలు పడి జైలు పాలయ్యారని అన్నారు. ఆర్థిక మోసాలు తప్ప ఇతర అన్ని రకాల నేరాలు తగ్గాయని వివరించారు. మహిళలు, బాలికలపై అఘాయిత్యాలపై శాసనమండలిలో వైసీపీ సభ్యులు కల్యాణి, మంగమ్మ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు. ‘వైసీపీ నేతలకు ఒక్కటే చెబుతున్నా.. రప్పా రప్పా అంటే తప్పేముంది అని వెనకేసుకొచ్చేందుకు ముఖ్యమంత్రిగా ఉన్నది జగన్‌ కాదు. హద్దులు మీరిన వారి తాటతీసే చంద్రబాబు సీఎం.. గుర్తుపెట్టుకోండి’ అంటూ హెచ్చరించారు. 7993485111 వాట్సాప్‌ నంబరు ద్వారా మహిళలకు ఏ ఆపద వచ్చినా పోలీసులకు తెలియజేస్తే సత్వర చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. శాంతిభద్రతల్లో ఏపీ చివరిలో ఉందని జగన్‌ పత్రికలో తప్పుగా రాశారని మండిపడ్డారు. జనసేన సభ్యుడు నాగేంద్రబాబు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇస్తూ రాష్ట్రంలో 125 మంది అక్రమ వలసదారులు ఉన్నారని వెల్లడించారు.


బీజేఎల్పీ నేత సోము వీర్రాజు మాట్లాడుతూ.. ‘‘అధికారంలోకి రాగానే ప్రజా వేదిక కూల్చిన వైసీపీ నేతలు స్థానిక సంస్థల నుంచి ఉప ఎన్నికల వరకూ అరాచకాలు సృష్టించి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారు. విజయనగరంలో రాములోరి విగ్రహ శిరచ్ఛేదం చేయడంతో పాటు తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్న మహిళలపై దాడులు చేయించిన వీళ్లకు మాట్లాడే అర్హత ఉందా? దేశ ప్రధాని చిలకలూరిపేటలో సభకు హాజరైతే కనీస రక్షణ కల్పించలేని మీరా శాంతి భద్రతల గురించి మాట్లాడేది’ అంటూ వైసీపీ సభ్యుల్ని నిలదీశారు. వైసీపీ సభ్యులు ఆయన మాట్లాడుతున్నంతసేపూ అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎవరి మెప్పు కోసం ఇలా మాట్లాడుతున్నారంటూ మండలి ప్రతపక్ష నేత బొత్స చేసిన వ్యాఖ్యలకు మంత్రి లోకేశ్‌ గట్టిగా బదులిచ్చారు. సీనియర్‌ సభ్యుడు వాస్తవాలు మాట్లాడుతుంటే రన్నింగ్‌ కామెంటరీతో ఎగతాళి చేయడమేంటని నిలదీశారు. వైసీపీ సభ్యులు మండలి నుంచి వాకౌట్‌ చేసి వెళ్లిపోవడంతో నిజాలు మాట్లాతామన్న భయంతో పారిపోయారని మంత్రి అనిత అన్నారు.

Updated Date - Feb 25 , 2026 | 04:12 AM