సంస్కరణల బాటలో ఉన్నత విద్య
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:36 AM
రాష్ట్రంలో ఉన్నత విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం.. దీనిపై సమగ్ర అధ్యయనం చేస్తోంది.
జాతీయ లెక్కలతో సరిపోల్చి.. మార్పులకు శ్రీకారం
వచ్చే ఏడాది నుంచి విద్యార్థులు, ఫ్యాకల్టీకి ఎఫ్‌ఆర్‌ఎస్
మూడు నెలల్లో 1500 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయం
అమరావతి, మార్చి 21(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్నత విద్యలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన కూటమి ప్రభుత్వం.. దీనిపై సమగ్ర అధ్యయనం చేస్తోంది. రాష్ట్రంలోని కాలేజీలు, విద్యార్థుల సంఖ్యను దేశవ్యాప్త పరిస్థితితో బేరీజు వేసుకుని, అవసరమైన మార్పులు తీసుకువస్తోంది. జాతీయస్థాయి పరిస్థితితో పోలిస్తే.. మన రాష్ట్రంలో ఉన్నతవిద్యను అందించే కళాశాలల సంఖ్య ఎక్కువగానే ఉంది. దేశంలో సగటున ప్రతి లక్ష జనాభాకు 30 కాలేజీలు అందుబాటులో ఉంటే, మన రాష్ట్రంలో 49 కాలేజీలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు, యూనివర్సిటీ కాలేజీలు మొత్తంగా 2,655 ఉన్నాయి. వాటిలో 19.29 లక్షల మంది చదువుతున్నారు. 2025-26 విద్యా సంవత్సరంలో 6,86,434 సీట్లు అందుబాటులో ఉంటే 4,35,052 (63.38శాతం) భర్తీ అయ్యాయి. గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ రేషియో దేశంలో 28.4శాతం ఉంటే, రాష్ట్రంలో 36.5శాతం ఉంది. విద్యార్థులు, ఫ్యాకల్టీ(టీచర్) నిష్పత్తిని పరిశీలిస్తే.. రాష్ట్రంలో ప్రతి 16 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. అదే దేశంలో 23 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. కలెక్టర్ల సదస్సు సందర్భంగా రూపొందించిన నివేదికలో విద్యాశాఖ ఈ విషయాలను వెల్లడించింది. మొత్తం విద్యార్థుల్లో 17.27లక్షల మంది విద్యార్థులు రెగ్యులర్‌గా తరగతులకు హాజరవుతుంటే, 2.01లక్షల మంది డిస్టెన్స్ విధానంలో చదువుతున్నారు. సగటున ప్రతి కాలేజీలో 554 మంది విద్యార్థులు చేరుతున్నారు. కాగా జాతీయ సగటు 693గా ఉంది.
సంస్కరణలకు శ్రీకారం
ఉన్నత విద్యను గాడిలో పెట్టేందుకు చర్యలు చేపట్టిన కూటమి ప్రభుత్వం అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. సాంకేతిక విద్యాశాఖను రద్దుచేసి, ఉన్నత విద్యలో కమిషనరేట్ ఏర్పాటు చేసింది. యూనివర్సిటీల్లో న్యాయ వివాదాలను పరిష్కరించి 3నెలల్లో 1500 పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. బీటెక్‌లో క్వాంటమ్ టెక్నాలజీ కోర్సులు వచ్చాయి. కాలేజీలను పరిశ్రమలతో అనుసంధానం చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నత విద్య హాజరులో అనేక అక్రమాలు జరుగుతున్నాయి. బీఈడీ కోర్సులు చదివేవారిలో చాలామంది కాలేజీల ముఖం చూడట్లేదు. దీనికి చెక్ పెట్టాలని నిర్ణయించిన ఉన్నత విద్యాశాఖ వచ్చే విద్యా సంవత్సరం నుంచి అన్ని కోర్సుల్లో విద్యార్థులు, ఫ్యాకల్టీకి ముఖ ఆధారిత హాజరును తప్పనిసరి చేసింది.