పంపించేసి.. తిరిగి తీసుకుని!
ABN , Publish Date - May 20 , 2026 | 05:32 AM
ప్రభుత్వాలు మారినా కొందరు అధికారులు మాత్రం కీలక హోదాల్లోనే కొనసాగుతున్నారు. ఉన్నత విద్యాశాఖ(సాంకేతిక)లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
వివాదంగా ఓఎస్‌డీ రామయ్య నియామకం
అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వాలు మారినా కొందరు అధికారులు మాత్రం కీలక హోదాల్లోనే కొనసాగుతున్నారు. ఉన్నత విద్యాశాఖ(సాంకేతిక)లోనూ ఇప్పుడు ఇదే పరిస్థితి కనిపిస్తోంది. గతంలో పలు ఆరోపణలున్న అధికారిని తిరిగి ఓఎస్‌డీగా నియమించడంపై అధికార పార్టీలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆముదాలవలస ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్‌గా ఉన్న బి. జానకిరామయ్య తాజాగా రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డులో ఓఎస్‌డీగా నియమితులయ్యారు. గతంలో 2018 నుంచి అదే బోర్డులో సంయుక్త కార్యదర్శిగా, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్‌గా డెప్యుటేషన్‌పై ఆయన పనిచేశారు. సుదీర్ఘకాలంగా బోర్డులో పాతుకుపోయారనే కారణంతో ప్రస్తుత ప్రభుత్వం 2024, నవంబరులో ఆయనను బోర్డు నుంచి రిలీవ్ చేసింది. అయితే, ఇప్పుడు మళ్లీ బోర్డులో ఓఎస్‌డీగా నియమిస్తూ ఉన్నత విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. దీంతో జానకిరామయ్య నియామకంపై విమర్శలు వస్తున్నాయి. మంగళగిరి టీడీపీ యూత్ ఫోర్స్ పేరుతో ఆయన నియామకాన్ని రద్దుచేయాలంటూ మంత్రి లోకేశ్ కార్యాలయానికి ఫిర్యాదులు అందాయి. గత ప్రభుత్వంలో ఆయన బోర్డులో పనిచేసినప్పుడు అనేక ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయన నియామకాన్ని రద్దుచేయాలని విజ్ఞప్తి చేశారు.