Share News

ప్రతి ఇంటికీ హైస్పీడ్‌ నెట్‌

ABN , Publish Date - Feb 23 , 2026 | 03:45 AM

ఏడాదిన్నరలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

ప్రతి ఇంటికీ హైస్పీడ్‌ నెట్‌

  • ఏడాదిన్నరలో అందించేందుకు చర్యలు: సీఎం

  • గ్రామాల్లో డిజిటల్‌ కనెక్టివిటీని పెంచేలా భారత్‌ నెట్‌తో ఒప్పందం

  • 13,426 గ్రామాల్లో అమలు

  • రాష్ట్రంలో ‘వన్‌ ఫ్యామిలీ - వన్‌ ఏఐ ఎక్స్‌పర్ట్‌’ విధానం

  • ఏఐతో ఉద్యోగాల కల్పనకు యువతలో నైపుణ్యాలు

  • కేంద్ర సాయంతో ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు పెంచుతాం

  • సీఎం చంద్రబాబు వెల్లడి

అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఏడాదిన్నరలో రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సేవలు అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. టెలికాం రంగంలో వినూత్న ప్రయోగాలకు రాష్ట్రం కేంద్రంగా ఉంటుందని అన్నారు. గ్రామీణ ప్రాంతంలో డిజిటల్‌ కనెక్టివిటీని పెంచేలా భారత్‌ నెట్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం కీలక ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర కమ్యూనికేషన్‌ శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో భారత్‌ నెట్‌ ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎంవోయూపై సంతకాలు చేశారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌, రాష్ట్ర మౌలిక సదుపాయల శాఖ మంత్రి బీసీ జనార్దనరెడ్డి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని ఇళ్లకు ఫైబర్‌ నెట్‌ కనెక్షన్లు అందించే లక్ష్యంతో అమెండెడ్‌ భారత్‌ నెట్‌ ప్రాజెక్టు (ఏబీపీ)ను అమలు చేస్తున్నారు. కాగా, ఏపీలో ఏబీపీ అమలుకు రూ.2432 కోట్ల మేర నిధులు అందించేందుకు కేంద్రం సమ్మతించింది. దీనికోసం ఆంధ్రప్రదేశ్‌ భారత్‌నెట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ (ఏపీబీఐఎల్‌) పేరుతో రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్‌ పర్పస్‌ వెహికిల్‌ (ఎస్‌పీవీ)ని ఏర్పాటు చేసింది. డిజిటల్‌ భారత్‌ నిధి, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం జరిగింది. డిజిటల్‌ భారత్‌ నిధి అడ్మినిస్ట్రేటర్‌ శ్యామల్‌ మిశ్రా, రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఈ అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు.


వైసీపీ ప్రభుత్వంలో ఫైబర్‌ నెట్‌ వ్యవస్థ ధ్వంసం

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. భారత్‌లో డిజిటల్‌ విప్లవం, డిజిటల్‌ కనెక్టివిటీని పెంచడానికి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కృషి చేస్తున్నారని ప్రశంసించారు. 2014-19 కాలంలో ఫైబర్‌ నెట్‌ వ్యవస్థను ఏర్పాటు చేశామని, పోల్స్‌మీద కేబుల్స్‌ వేసి 9.79 లక్షల ఇళ్లకు కనెక్షన్లు ఇచ్చామని వెల్లడించారు. 2019లో వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఫైబర్‌ నెట్‌ వ్యవస్థను ధ్వంసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు 3.80 లక్షలకు పడిపోయాయన్నారు. కేంద్రం సహకారంతో ఫైబర్‌నెట్‌ కనెక్షన్లు పెంచుతామని చెప్పారు. ఏఐ-క్వాంటమ్‌ టెక్నాలజీలకు ప్రధాని మోదీ చాలా ప్రాధాన్యమిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. అందుకే ఏఐ ఇంపాక్ట్‌ సదస్సును ప్రధాని మోదీ నిర్వహించారని, ఈ సదస్సుకి ప్రపంచ ప్రఖ్యాత కంపెనీలు హాజరయ్యాయని చెప్పారు. గ్లోబల్‌ నాలెడ్జ్‌, రూరల్‌ అప్లికేషన్‌ విధానం విజయవంతం కావాలంటే బ్యాండ్‌ విడ్త్‌ పెరగాలన్నారు. ఇందుకు కేంద్రం సహకరిస్తోందని చెప్పారు. ఏఐతో ఉద్యోగాలు కల్పించేలా యువతలో నైపుణ్యాలు పెంచుతామని చెప్పారు.

13,426 గ్రామ పంచాయతీల్లో అమలు

రాష్ట్రవ్యాప్తంగా 13,426 గ్రామ పంచాయతీల్లో భారత్‌ నెట్‌ ప్రాజెక్టు అమలుకు కేంద్రం అంగీకరించింది. దీనిలో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తారు. ఫేజ్‌-1లో 1,692 పంచాయతీల్లోని నెట్‌వర్క్‌ను అప్‌గ్రేడ్‌ చేయడం, ఫేజ్‌-2లో 11,254 పంచాయతీలకు డిజిటల్‌ కనెక్టివిటీలు పూర్తిచేస్తారు. కొత్తగా ఏర్పడిన 480 పంచాయతీలకు హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఇచ్చేలా కార్యాచరణ రూపొందిస్తారు. 3,942 గ్రామాల్లో డిమాండ్‌ ఆధారిత కనెక్టివిటీని పెంచడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి పెడుతుంది.


2030 నాటికి 100 కోట్ల మందికి 5జీ: సింధియా

2030 నాటికి దేశంలో 100 కోట్ల మంది 5జీ వినియోగదారులు ఉంటారని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అన్నారు. ఒప్పందం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు 35 ఏళ్ల క్రితమే టెలికాం రంగంలో సంస్కరణలు, విప్లవం గురించి ఆలోచించారని ప్రశంసించారు. ప్రజలకు మొబైల్‌, ఫైబర్‌ ఆప్టిక్‌, బ్రాండ్‌బ్యాండ్‌, వీశాట్‌, శాటిలైట్‌ వంటి మార్గాల ద్వారా ఇంటర్నెట్‌ సదుపాయం చేరువైందన్నారు. దేశంలోని 99 శాతం గ్రామాలు 4జీ వినియోగిస్తున్నాయని, మిగిలిన గ్రామాలకూ ఈ ఏడాది జూన్‌ నాటికి 4జీ సదుపాయాలు వస్తాయని వెల్లడించారు. ప్రస్తుతం దేశంలో 40 కోట్ల మంది 5జీ వినియోగిస్తున్నారని, 2030 నాటికి ఈ సంఖ్య 100 కోట్లకు చేరుతుందని చెప్పారు. భారత్‌ నెట్‌ ప్రాజెక్టు కోసం రూ.1.30 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించారు. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ ఆప్టికల్‌ ఫైబర్‌ ద్వారా బ్రాడ్‌ బ్యాండ్‌ కనెక్షన్‌ అందిస్తామని చెప్పారు.

‘వన్‌ ఫ్యామిలీ - వన్‌ ఏఐ ఎక్స్‌పర్ట్‌’ విధానం

రాష్ట్రంలో ‘వన్‌ ఫ్యామిలీ - వన్‌ ఏఐ ఎక్స్‌పర్ట్‌’ విధానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. వాట్సప్‌ ద్వారా మన మిత్ర యాప్‌తో 900కిపైగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నామని, డిజిటల్‌ కెనెక్టివిటీ ఉంటే ప్రజలకు సేవలు సులువుగా అందుతాయని అన్నారు. టెక్నాలజీని అనుసంఽధానించి భూ రికార్డులకు భద్రత కల్పిస్తున్నామని, ట్యాంపరింగ్‌కు ఆస్కారం లేని పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తున్నామని వెల్లడించారు. ఐబీఎం- టీసీఎస్‌- ఎల్‌ అండ్‌ టీ కన్సార్షియంతో దేశంలో తొలిసారిగా క్వాంటమ్‌ కంప్యూటర్‌ తెస్తున్నామని అన్నారు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో భారత్‌ అన్ని దేశాల కంటే ముందుందన్నారు. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య నేతృత్వంలో బీఎస్ఎన్‌ఎల్‌ నంబర్‌ వన్‌గా నిలుస్తుందన్నారు.

Updated Date - Feb 23 , 2026 | 09:30 AM