Share News

కారుణ్య నియామకాలను మానవీయ కోణంలో పరిశీలించాలి

ABN , Publish Date - Jan 28 , 2026 | 04:49 AM

ఓ ఉద్యోగి మరణం ఆ కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరణించిన ఉద్యోగి అతని కుటుంబానికి ఎల్లప్పుడూ విలువైన ఆస్తులు వదిలి వెళ్లకపోవచ్చునని...

కారుణ్య నియామకాలను మానవీయ కోణంలో పరిశీలించాలి

  • ఉద్యోగి మరణం.. ఆ కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదు

  • వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే

  • సాంకేతిక కారణాలతో ఉద్యోగాన్ని నిరాకరించడానికి వీల్లేదు

  • హైకోర్టు ధర్మాసనం స్పష్టీకరణ

అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): ఓ ఉద్యోగి మరణం ఆ కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. మరణించిన ఉద్యోగి అతని కుటుంబానికి ఎల్లప్పుడూ విలువైన ఆస్తులు వదిలి వెళ్లకపోవచ్చునని, కొన్నిసార్లు పేదరికాన్ని కూడా వదిలి వెళ్లవచ్చని పేర్కొంది. ఉద్యోగి మరణించినా, అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేసినా ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోకుండా ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. బాధిత కుటుంబానికి తక్షణం సహాయం అందించేందుకు, అర్హత కలిగిన కుటుంబ సభ్యుడికి ఉద్యోగం ఇచ్చేందుకు వీలుగా కారణ్య నియామక పథకం తీసుకొచ్చారని గుర్తుచేసింది. సాంకేతిక కారణాలతో కారుణ్య నియామక అభ్యర్ధనను ఏకపక్షంగా నిరాకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తండ్రి రాములు అనారోగ్య కారణాలతో పదవీ విరమణ చేయడంతో పిటిషనర్‌ నారాయణమ్మ కారుణ్య నియామకం కింద ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారని గుర్తు చేసింది. నారాయణమ్మ కుటుంబ ఆర్థిక పరిస్థితిపై విచారణ జరిపిన సీనియర్‌ డివిజనల్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ సానుకూలంగా సిఫార్సు చేసినప్పటికీ అవేమీ పట్టించుకోకుండా నిర్ధిష్ఠ గడువులోగా (ఐదేళ్లలోపు) దరఖాస్తు చేయలేదనే కారణంతో కారుణ్య నియామక వినతిని జనరల్‌ మేనేజర్‌ తిరస్కరించారని పేర్కొంది. రైల్వే బోర్డు ఆదేశాల ప్రకారం జనరల్‌ మేనేజర్‌ ప్రతీ కేసును మెరిట్‌ ఆధారంగా, మానవీయ కోణంలో పరిశీలించాల్సి ఉంటుందని, ప్రస్తుత కేసులో అలా జరగలేదని తెలిపింది. అలాగే అసాధారణ జాప్యం తర్వాత కారుణ్య నియామకం కోసం దరఖాస్తు చేశారని క్యాట్‌ పేర్కొనడాన్ని తప్పుపట్టింది. స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన ఐదేళ్ల తర్వాత ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవడాన్ని అసాధారణ జాప్యంగా చెప్పలేమని పేర్కొంది.


2018 డిసెంబరు 27న కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. తీర్పు ప్రతి అందిన మూడు నెలల్లోపు పిటిషనర్‌ను కారుణ్య నియామకం ప్రాతిపదికన ఉద్యోగంలోకి తీసుకొనే అంశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ జి.తుహిన్‌కుమార్‌తో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. విజయనగరం జిల్లా కొత్తవలసకు చెందిన బి.రాములు రైల్వేలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేసేవారు. అనారోగ్య కారణాలతో 1999లో ఆయన మెడికల్‌ డీ కేటగరైజ్‌ అయ్యారు. రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఉద్యోగం ప్రతిపాదించినప్పటికీ రాములు దానిని నిరాకరిస్తూ 2000 సంవత్సరంలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. రాములు కుమార్తె బి.నారాయణమ్మ 2006 సెప్టెంబరులో కారుణ్య నియామకం కింద దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఐదేళ్ల్ల గడువులోపు దరఖాస్తు చేసుకోలేదనే కారణంతో రైల్వే అధికారులు ఆమె వినతిని తిరస్కరించారు. దీనిపై కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ను ఆశ్రయించినా నారాయణమ్మకు ఊరట లభించలేదు. దీంతో ఆమె 2019లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇటీవల తుది విచారణ జరిపి ధర్మాసనం నిర్ణయం వెల్లడించింది. ప్రస్తుతం పిటిషనర్‌ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, ఇళ్లలో పనిమనిషిగా చేస్తూ నారాయణమ్మ జీవనం సాగిస్తోందని గుర్తు చేసింది. ఐదేళ్లలోపు దరఖాస్తు చేసుకోలేదనే సాంకేతిక కారణంతో ఆ కుటుంబానికి సహాయన్ని నిరాకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. రైల్వే నిబంధనలపై అవగాహన లేకపోవడంతోనే ఆలస్యంగా దరఖాస్తు చేశామన్న పిటిషనర్‌ వాదనతో ఏకీభవిస్తున్నట్లు ప్రకటించింది. కారుణ్య నియామకాలు.. నిబంధనల ప్రకారం కాకుండా రాజ్యాంగంలోని అధికరణ 39లోని ఆదేశిక సూత్రాల స్పూర్తితో జరగాలని పేర్కొంది.

Updated Date - Jan 28 , 2026 | 04:50 AM