Driver Demise Case: అనంతబాబు భార్య ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ
ABN , Publish Date - Jan 17 , 2026 | 03:53 AM
వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయని...
అమరావతి, జనవరి 16(ఆంధ్రజ్యోతి): వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు దర్యాప్తులో కొత్త అంశాలు వెలుగులోకి వచ్చాయని, నిందితులపై ఎస్సీ, ఎస్టీ చట్టంలోని సెక్షన్లు చేర్చారని అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మర్రి వెంకటరమణ శుక్రవారం హైకోర్టుకు నివేదించారు. ఎస్సీ, ఎస్టీ కేసులో బాధిత కుటుంబసభ్యులకు నోటీసులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు సుబ్రహ్మణ్యం తల్లి నూకరత్నంకు నోటీసు ఇచ్చి ఆమె వాదన కూడా వినాలని వివరించారు. పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎ.హరిహరనాథశర్మ ఫిర్యాదుదారు నూకరత్నంకు నోటీసులు జారీచేశారు. విచారణను ఈనెల 20కి వాయిదా వేశారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఎమ్మెల్సీ అనంతబాబు సతీమణి అనంతలక్ష్మి చేసిన అభ్యర్థనను హైకోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది సి.నాగేశ్వరరావు వాదనలు వినిపించారు.