ఏపీ హైకోర్టుకు ముగ్గురు న్యాయమూర్తులు
ABN , Publish Date - May 06 , 2026 | 04:04 AM
ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. న్యాయమూర్తుల కోటా నుంచి ముగ్గురు న్యాయాధికారులు...
సునీత, గిరిధర్, పురుషోత్తం కుమార్ పేర్లను సిఫారసు చేసిన సుప్రీం కోర్టు కొలీజియం
నియామకం పూర్తయితే 35కు చేరనున్న జడ్జీలు
అమరావతి, న్యూఢిల్లీ, మే 5(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు రానున్నారు. న్యాయమూర్తుల కోటా నుంచి ముగ్గురు న్యాయాధికారులు... గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్‌లను పదోన్నతిపై న్యాయమూర్తులుగా నియమించేందుకు సుప్రీం కోర్టు కొలీజియం సిఫారసు చేసింది. 37 న్యాయమూర్తుల పోస్టులు మంజూరైన ఏపీ హైకోర్టులో ప్రస్తుతం 32 మంది సేవలందిస్తున్నారు. ఈ ముగ్గురు న్యాయమూర్తులు ఏపీ హైకోర్టుకు వస్తే ఆ సంఖ్య 35కు చేరుతుంది. హైకోర్టులో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీలో భాగంగా, ఆయా అధికారుల పనితీరు, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని కొలీజియం ఈ సిఫార్సు చేసింది. తాజా నిర్ణయంతో కొలీజియం ఆమోదించిన ఈ పేర్లను కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. అక్కడ పరిశీలన అనంతరం రాష్ట్రపతి కార్యాలయానికి వెళ్తాయి. రాష్ట్రపతి ఆమోదముద్ర పడి, అధికారికంగా నోటిఫికేషన్ విడుదలైన తర్వాత వీరు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు.
ఆలపాటి గిరిధర్
ఆలపాటి గిరిధర్ స్వగ్రామం ప్రకాశం జిల్లా, కొండేపి మండలం, గోగినేనివారిపాలెం. తండ్రి బాపయ్య చౌదరి స్వాతంత్య్ర సమర యోధుడు, విశ్రాంత ప్రధాన ఉపాధ్యాయుడు. గిరిధర్ ఒంగోలులోని ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాల నుండి న్యాయ శాస్త్రం పూర్తి చేశారు. న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని ఒంగోలు జిల్లా కోర్టులో తొమిదేళ్లు ప్రాక్టీస్ చేశారు. ఉమ్మడి హైకోర్టులో మూడేళ్లు ప్రాక్టీస్ చేశారు. సివిల్, క్రిమినల్, వినియోగదారులు, సర్వీసు, రాజ్యాంగ సంబంధ కేసులలో మంచి అనుభవం గడించారు. మచిలీపట్నం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక న్యాయాధికారిగా పనిచేశారు. విజయనగరం, కర్నూలు జిల్లాల ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. హైకోర్టులో రిజిస్ట్రార్‌గా పనిచేశారు. ప్రస్తుతం విశాఖపట్నం వ్యాట్ అప్పిలేట్ ట్రైబ్యునల్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు.
గంధం సునీత
గంధం వీరయ్య, శివ నాగేంద్రమ్మ దంపతులకు కృష్ణా జిల్లా, పెదకళ్లేపల్లి గ్రామంలో 1977 జూన్ 14న జన్మించారు. వీరిది మధ్యతరగతి వ్యవసాయ కుటుంబం. 10వ తరగతి వరకు పెదకళ్లేపల్లిలోని ఎస్‌డీఎన్‌ఎ్‌సడీఎస్ హైస్కూల్‌లో పాఠశాల విద్యను అభ్యసించారు. మచిలీపట్నం లేడీ యాంప్తిల్ కళాశాలలో ఇంటర్మీడియట్, అవనిగడ్డ వివేకానంద డిగ్రీ కళాశాల, విజయవాడ గాంధీజీ మహిళ కళాశాలల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ముత్యాల నాగ మల్లేశ్వరరావును వివాహం చేసుకున్నారు. అనంతరం మాంటిస్సోరి కళాశాల నుండి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశారు. టాపర్‌గా నిలిచి బంగారు పతకం సాధించారు. 1999లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. ఆ తరువాత నాగార్జున యునివర్సిటీలో లేబర్ లాలో ఎల్‌ఎల్‌ఎమ్ పూర్తి చేశారు. 2000-2008 వరకు బెజవాడ బార్ అసోసియేషన్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2023 నుండి తూర్పుగోదావరి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా రాజమహేంద్రవరంలో సేవలు అందిస్తున్నారు.
చింతలపూడి పురుషోత్తం కుమార్
విశ్రాంత జిల్లా జడ్జి సి.రాంబాబు, రమారత్నం దంపతులకు విశాఖపట్నంలో జన్మించారు. వీరి కుటుంబం మూడు తరాలుగా న్యాయవాదులు, న్యాయమూర్తులుగా సేవలు అందిస్తోంది. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి మెరైన్ బయాలజీలో ఎంఎస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ఎల్‌ఎల్‌బీలో పట్టా పొందారు. ఇంటీరియర్ డెకరేషన్, డిజైనింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్, మీడియా లాస్‌లో డిప్లమో చేశారు. 2002లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకొని సీనియర్ న్యాయవాది ఎస్.రవి కార్యాలయంలో చేరి ప్రాక్టీస్ ప్రారంభించారు. 2010లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. 2012లో రాజమహేంద్రవరం ఫ్యామిలీ కోర్టులో న్యాయాధికారిగా నాలుగున్నరేళ్లు పనిచేశారు. తిరుపతి అదనపు జిల్లా జడ్జిగా, 2019లో ప్రకాశం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించారు. హైకోర్టు రిజిస్ట్రార్‌గా రెండేళ్లు వివిధ హోదాల్లో సేవలు అందించారు. 2025 జనవరి 25 నుండి ఆంధ్రప్రదేశ్ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.