Share News

రాగద్వేషాలున్న వ్యక్తి ఐఏఎస్‌గా కొనసాగడానికి వీల్లేదు

ABN , Publish Date - Apr 24 , 2026 | 05:35 AM

చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌(సీసీఎస్‌టీ) ఐఏఎస్‌ అధికారి అహ్మద్‌బాబుపై రాష్ట్ర హైకోర్టు నిప్పులు చెరిగింది. రాగద్వేషాలు ఉన్న వ్యక్తి ఐఏఎస్‌గా కొనసాగడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది.

రాగద్వేషాలున్న వ్యక్తి ఐఏఎస్‌గా కొనసాగడానికి వీల్లేదు

  • మాకు అధికారం ఉంటే ఈ క్షణానే అహ్మద్‌బాబును సస్పెండ్‌ చేసేవారం

సీసీఎస్‌టీపై నిప్పులు చెరిగిన హైకోర్టు

అమరావతి, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): చీఫ్‌ కమిషనర్‌ ఆఫ్‌ స్టేట్‌ ట్యాక్స్‌(సీసీఎస్‌టీ) ఐఏఎస్‌ అధికారి అహ్మద్‌బాబుపై రాష్ట్ర హైకోర్టు నిప్పులు చెరిగింది. రాగద్వేషాలు ఉన్న వ్యక్తి ఐఏఎస్‌గా కొనసాగడానికి వీల్లేదని వ్యాఖ్యానించింది. తమకే అధికారం ఉంటే ఈ క్షణానే అహ్మద్‌బాబును సస్పెండ్‌ చేసేవారమని పేర్కొంది. ‘సీసీఎస్‌టీ అహ్మద్‌బాబు పన్ను వసూళ్లలో అక్రమాలకు పాల్పడ్డారు. ఉద్యోగులకు పదోన్నతులు ఇవ్వకుండా వేధిస్తున్నారు. ఆయనపై చర్యలు తీసుకునేలా కేంద్ర విజిలెన్స్‌ కమిషనర్‌ను ఆదేశించండి’ అని కోరుతూ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.రమేశ్‌ కుమార్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా ఉద్యోగుల సంఘం ఆరోపణలు నిజమేనని తేలితే తీవ్రంగా పరిగణిస్తామని కోర్టు హెచ్చరించింది. అహ్మద్‌బాబుకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. వ్యాజ్యం గురువారం మరోసారి విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌... ‘అహ్మద్‌బాబు ట్యాక్స్‌ వసూళ్ల విషయంలో ప్రభుత్వ ఖజానాకు నష్టం చేయడంతో పాటు ఉద్యోగులను వేధిస్తున్నారు. గత ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో డీపీసీ(డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ) నిర్వహించారు. అప్పటి నుండి ఉద్యోగులకు పదోన్నతి ఇవ్వకుండా సంబంధిత ఫైళ్లను తొక్కిపెట్టారు. ఉద్యోగుల జీవితాలతో ఆడుకుంటారా? వాణిజ్య పన్నుల శాఖ ఏమీ ప్రైవేటు ఆస్తి కాదు. అది రాష్ట్ర ప్రభుత్వంలో భాగం. అధికారులు సంరక్షకులు మాత్రమే అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. అహ్మద్‌బాబు ఏమీ చారిటీ చేయడం లేదు. ప్రతి నెలా జీతం తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఐఏఎ్‌సలకు పదోన్నతి ఇవ్వకుంటే వాళ్లందరూ ఊరుకుంటారా? ఐఏఎస్‌లకు ఒక న్యాయం, చిరుద్యోగులకు ఒక న్యాయమా? సీఎస్‌ నుండి క్లర్క్‌ వరకు ఏదో సమయంలో పదోన్నతిని ఆశిస్తారు. ఉద్యోగి ఆశపడడంలో తప్పేమీ లేదు. డీపీసీ నిర్ణయం అమలు చేయకపోతే ఎలా? అర్హత ఉన్నవారికి పదోన్నతి ఎందుకు ఇవ్వరు? ఇలాంటి విషయాల్లో ఉదాసీనంగా ఉండలేం.


రాష్ట్ర విభజన తరువాత ఉద్యోగులు పడుతున్న బాధలన్నింటినీ ఇప్పటీకీ చూస్తూనే ఉన్నాం. కుటుంబం ఒకచోట, ఉద్యోగులు మరో చోట జీవితాలు గడుపుతున్నారని గుర్తు చేసింది. ఐఏఎస్‌ అధికారులు మాత్రం శుక్ర, శనివారాల్లో ప్రభుత్వ సొమ్ముతో విమానాల్లో హైదరాబాద్‌ వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించింది. పదోన్నతులు ఇవ్వాలని డిసెంబరులో కోర్టు ఆదేశాలు ఇస్తే వాటిని అమలు చేయకుండా ప్యానల్‌ ఇయర్‌ ముగిసిందనే కారణంతో మరోసారి తాజాగా డీపీసీ నిర్వహించాలని చెబుతారా? అహ్మద్‌బాబు ఉద్దేశపూర్వకంగా ఫైలు తొక్కిపెట్టినట్లు కనపడుతోంది. చట్టం అన్నా, కోర్టు ఉత్తర్వులు అన్నా ఆయనకు గౌరవం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి అధికారులకు పోస్టింగ్‌ ఎందుకు ఇస్తోంది? అహ్మద్‌బాబుపై తీవ్ర ఆరోపణలు వస్తున్నా ఇప్పటికీ అదే పోస్టులో ఎందుకు కొనసాగిస్తున్నారు? ఇలాంటివారిని లూప్‌లైన్‌లో వేయాలి. అహ్మద్‌బాబుపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఐఏఎస్‌ అధికారిగా ఆయన కొనసాగడానికి అర్హుడా? కాదా? అనే వ్యవహారంపై విచారణ జరపాలని కేంద్రాన్ని కోరతాం. ఆధారాలు ఉంటే సర్వీసు నుండి డిస్మిస్‌ చేయమని ఆదేశాలిస్తాం’ అని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జనవరి 12న పిటిషనర్‌ సమర్పించిన వినతిపత్రంపై సీఎస్‌ తీసుకున్న చర్యలపై వివరాలు తమ ముందు ఉంచాలని ఏజీని కోర్టు ఆదేశించింది. వాణిజ్య పన్నుల శాఖలో జరుగుతున్న విషయాలను సీఎస్‌ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. అన్ని విషయాలను ఆయన చక్కదిద్దగలరని పేర్కొంది. పిటిషన్‌పై విచారణను నేటికి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. అహ్మద్‌బాబు తరఫున న్యాయవాది వీవీ సతీశ్‌ వాదనలు వినిపిస్తూ... ఐఏఎస్‌ అధికారిని వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చి, తీవ్ర ఆరోపణలు చేశారన్నారు. పిటిషన్‌లో చేసిన ప్రతి ఆరోపణకూ సమాధానం ఇస్తూ కౌంటర్‌ వేస్తున్నామన్నారు. ఈ దశలో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ... డీపీసీ నిర్ణయాన్ని అమలు చేసి ఉద్యోగులకు పదోన్నతి ఎందుకు కల్పించలేదని ప్రశ్నించారు.


గతంలో ఓ కోర్టు ధిక్కరణ కేసులో ఇదే హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ అహ్మద్‌బాబుకు... ‘భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండాలి’ అంటూ వార్నింగ్‌ ఇచ్చిందని గుర్తు చేశారు. అయినప్పటికీ అధికారి తీరు మారలేదన్నారు. పిటిషన్‌ దాఖలుచేసి మూడు వారాలు గడుస్తునప్పటికీ ఈ వ్యవహారంపై రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. వాణిజ్య పన్నులు శాఖలో అహ్మద్‌బాబు వివాదాస్పద తీరుపై పిటిషనర్లు వినతి సమర్పించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం, సీఎస్‌ ఏమి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. ఖజానాకు నష్టం జరుగుతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందన్నారు. ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని తేలిగ్గా తీసుకుంటున్నట్లు కనబడుతోందన్నారు. సీఎస్‌ను ఓసారి కోర్టుకు పిలిపిస్తే తప్ప పరిస్థితిలో మార్పులు వచ్చేలా లేదని వ్యాఖ్యానించారు. సీఎస్‌ హాజరుకు ఆదేశిస్తామని హెచ్చరించారు. ఆ సమయంలో ఏజీ కార్యాలయం తరఫు న్యాయవాది బాలాజీ స్పందిస్తూ... కేసు విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలని, ఏజీ హాజరవుతారన్నారు. భోజన విరామం తరువాత జరిగిన విచారణలో ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనల వినిపిస్తూ... అహ్మద్‌బాబుపై పిటిషనర్‌ కేంద్రానికి వినతి సమర్పించారని, ఆ వినతిపై తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశిస్తూ పిటిషన్‌ను పరిష్కరిస్తే అభ్యంతరం లేదన్నారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి వాదనలు వినిపిస్తూ... ‘అహ్మద్‌బాబు అక్రమాలపై మొదట సీఎస్‌కు వినతి సమర్పించాం. సీఎస్‌ స్పందించకపోవడంతోనే కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించాం’ అని పేర్కొన్నారు. ఈ వివరాలను పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... ఈ ఏడాది జనవరి 12న ఇచ్చిన వినతిపై ఏమి చర్యలు తీసుకున్నారో సీఎస్‌ను అడిగి వివరాలు చెప్పాలని ఏజీకి సూచించారు. అహ్మద్‌బాబు తరఫు న్యాయవాది సతీశ్‌ స్పందిస్తూ.. అహ్మద్‌బాబు హయాంలో 356 మందికి పదోన్నతి కల్పించారన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 05:35 AM