లొంగిపోతే మంచిది
ABN , Publish Date - Jun 19 , 2026 | 03:45 AM
పార్లమెంటు సభ్యుడిపై దాడి చేయడమంటే పార్లమెంటు సార్వభౌమాధికారంపై దాడి చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది.
ఎంపీని టార్చర్ చేస్తారని సునీల్ నాయక్‌కు తెలుసు
రఘురామ కేసులో ఆయనదే కీలక పాత్ర
ఎంపీపై దాడి.. పార్లమెంటు సార్వభౌమాధికారంపై దాడే
పార్లమెంటుపై దాడి చేసిన వారికీ వీరికీ తేడా లేదు
ముందస్తు బెయిల్ రక్షణ రాకూడదు
ఐపీఎస్‌పై హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
అమరావతి, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): పార్లమెంటు సభ్యుడిపై దాడి చేయడమంటే పార్లమెంటు సార్వభౌమాధికారంపై దాడి చేయడమేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఎంపీని కస్టడీలో చిత్రహింసలకు గురిచేశారన్న తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ అధికారికి ముందస్తు బెయిల్ రక్షణ లభించకూడదని స్పష్టంచేసింది. పార్లమెంటుపై దాడి చేసినవారికీ, ఎంపీని కస్టోడియల్ టార్చర్ చేసిన వారికీ మధ్య తేడా లేదని తేల్చిచెప్పింది. నాటి ఎంపీ రఘురామకృష్ణరాజును కస్టడీలో టార్చర్‌కు గురిచేయబోతున్నారని అప్పటి సీఐడీ డీఐజీగా ఉన్న సునీల్‌కుమార్ నాయక్‌కు బాగా తెలుసని, ఈ వ్యవహారంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆయనది కీలక పాత్రని తెలిపింది. ఇలాంటి ఘటనల్లో పాలుపంచుకోకుండా ఆయన స్వీయ నియంత్రణ పాటించి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. ఆయన సరెండర్ కావాలని, అదే ఆయనకు మంచిదని పేర్కొంది. ఎప్పటిలోగా సరెండర్ అవుతారు.. లేదా ముందస్తు బెయిల్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తారా..? చెప్పాలని సునీల్ నాయక్ తరఫు న్యాయవాదిని కోరింది. పిటిషనర్‌తో మాట్లాడి వివరాలు కోర్టు ముందు ఉంచేందు కు న్యాయవాది సమయం కోరడంతో న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు విచారణను శుక్రవారానికివాయిదా వేశారు.
ఇదీ కేసు..
తనను సీఐడీ అధికారులు కస్టోడియల్ టార్చర్‌కు గురిచేశారని పేర్కొంటూ మాజీ ఎంపీ, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా 2024 జూలై 11న గుంటూరు నగరంపాలెం పోలీసులు నమోదు చేసిన కేసులో ముందుస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ బిహార్ కేడర్ ఐపీఎస్ అధికారి, అప్పటి ఏపీ సీఐడీ డీఐజీ సునీల్ నాయక్ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా.. ఆయన తరఫున సీనియర్ న్యాయవాది ఎన్.అశ్వనీ కుమార్ వాదనలు వినిపించారు. పిటిషనర్ పోలీసుల దర్యాప్తునకు సహకరించారని.. ఇప్పటికే నాలుగు సార్లు దర్యాప్తు అధికారి ముందు హాజరై తనకు తెలిసిన వివరాలు చెప్పారని తెలిపారు. దర్యాప్తునకు సహకరించలేదని దర్యాప్తు అధికారి నుండి ఎలాంటి ఫిర్యాదూ లేదన్నారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుని.. పిటిషనర్ తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ప్రస్తుత కేసులో సరెండర్ కావడం ఆయనకే మంచిదని చెప్పారు. లొంగుబాటు, ముందస్తు బెయిల్‌పై వాదనలు వినిపించడానికి న్యాయవాది సమయం కోరడంతో విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.