బాధితురాలినే బెదిరిస్తారా?
ABN , Publish Date - Apr 25 , 2026 | 04:52 AM
దళిత బాలికపై లైంగిక దాడి కేసును నీరుగార్చేందుకు పోలీసులే ప్రయత్నించడం ఏమిటని హైకోర్టు మండిపడింది. బాధితురాలికి అండగా నిలవాల్సిన పోలీసులు నిందితులతో చేతులు కలిపి కేసు ఉపసంహరించుకోవాలని...
పోలీసులే ఇలా చేస్తే ఎలా?
ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలా?
అది మీకెలా తెలుసు? దివ్య దృష్టి ఉందా?
అలా అనడానికి సిగ్గు అనిపించడం లేదా?
నిందితులను ఎందుకు అరెస్టు చేయరు?
ఒత్తిడి అనుకుంటే రాజీనామా చేసేయండి
భీమవరం డీఎస్పీపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
రికార్డులతో రావాలని ఎస్పీకి ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): దళిత బాలికపై లైంగిక దాడి కేసును నీరుగార్చేందుకు పోలీసులే ప్రయత్నించడం ఏమిటని హైకోర్టు మండిపడింది. బాధితురాలికి అండగా నిలవాల్సిన పోలీసులు నిందితులతో చేతులు కలిపి కేసు ఉపసంహరించుకోవాలని బాలిక కుటుంబ సభ్యులను బెదిరిస్తారా అంటూ ఆగ్రహించింది. కేసు నమోదు వెనుక రాజకీయ ప్రమేయం ఉందని కోర్టుకు హాజరైన భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు చెప్పడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని మీరెలా చెబుతారు..దేవుడు మీకేమైనా దివ్య దృష్టి ఇచ్చారా.. అంటూ డీఎస్పీని నిలదీసింది. ‘బాధితురాలు తన ఫిర్యాదులో స్పష్టమైన ఆరోపణలు చేశారు. తనపై జరిగిన అఘాయిత్యం గురించి స్పష్టంగా వివరించారు. అందుకు సంబంధించి 164 స్టేట్‌మెంట్, ఇతర ఆధారాలు ఉన్నాయి. ఆ అంశాలపై దృష్టి పెట్టి దర్యాప్తు సాగించాలి. రాజకీయ కారణాలున్నాయా? ఇతర కారణాలు ఉన్నాయా? అనేది సంబంధిత కోర్టు తేలుస్తుంది. ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలు ఉన్నాయని ఎలా చెబుతారు? మీకు సిగ్గుగా అనిపించడం లేదా?’’ అని ప్రశ్నించింది. రాజకీయ ఒత్తిడి తట్టుకోలేకపోతే రాజీనామా చేసి వెళ్లిపోవాలని డీఎస్పీకి సూచించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఘటన జరిగితే ఇప్పటివరకు నిందితులను ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీసింది. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. డీఎస్పీ వివరణ సంతృప్తికరంగా లేదని, ఆయన నిందితులను సమర్థించేలా మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించింది.
తదుపరి విచారణ రోజు కేసుకి సంబంధించిన రికార్డులతో స్వయంగా తమ ముందు హాజరుకావాలని పశ్చిమగోదావరిజిల్లా ఎస్పీని ఆదేశించింది. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వై.లక్ష్మణరావు శుక్రవారం ఉత్తర్వులు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన చెన్ను చంటి, ఆయన కుమారుడు తనపై లైంగిక దాడికి పాల్పడ్డారని, కులం పేరుతో దూషించారని 13 ఏళ్ల బాలిక ఈ ఏడాది ఫిబ్రవరి 18న భీమవరం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చంటితోపాటు ఆయన కుమారుడిపై పోక్సో చట్టంతో పాటు ఇతర చట్టాల కింద కేసు నమోదు చేశారు. అయితే కేసును వెనక్కి తీసుకోవాలని భీమవరం డీఎస్పీ, సీఐ కాళీ చరణ్, ఎస్‌ఐ తమను బెదిరిస్తున్నారంటూ బాలిక తల్లి హైకోర్టులో పిటిషన్ వేశారు. నిష్పాక్షిక దర్యాప్తు చేసి ఛార్జిషీట్ దాఖలు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. ఈ వ్యాజ్యం ఇటీవల విచారణకు రాగా కోర్టు భీమవరం డీఎస్పీ రఘువీర్ విష్ణు హాజరుకు ఆదేశించింది. పిటిషన్ శుక్రవారం మరోసారి విచారణకు రాగా, డీఎస్పీ కోర్టు ముందు హాజరయ్యారు. న్యాయమూర్తి స్పందిస్తూ... కేసు ఉపసంహరించుకోవాలని బాధితురాలి తల్లిని ఎందుకు బెదిరిస్తున్నారని డీఎస్పీని ప్రశ్నించారు. దర్యాప్తు పురోగతిపై ఆరా తీశారు.
డీఎస్పీ బదులిస్తూ... కేసు దర్యాప్తు కొనసాగుతోందని, ఫిర్యాదు వెనుక రాజకీయ కారణాలున్నాయని చెప్పారు. ఈ వాదనపై న్యాయమూర్తి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దర్యాప్తు నిష్పాక్షికంగా జరగని కారణంగానే బాలిక తల్లి కోర్టును ఆశ్రయించారన్నారు. న్యాయం కోసం బాధితురాలు మీ వద్దకు వస్తే ఆమెకు న్యాయం చేయాల్సింది పోయి, నిందితులతో చేతులు కలుపుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘మీ బాధ్యత మీకు కొంతైనా తెలియాలంటే బాలిక ఇచ్చిన ఫిర్యాదు ఒకసారి చదండి. అప్పుడైనా మీరు ఏమి చేస్తున్నారనేది మీ మనఃసాక్షికి తెలుస్తుంది’’ అని వ్యాఖ్యానించారు. బాలిక ఇచ్చిన ఫిర్యాదును ఆయనతో చదివించారు. కొంత చదివిన తర్వాత.. ఇక వద్దు అని ఆపించారు. బాలికపై నిందితులు ఎంత దుర్మార్గంగా ప్రవర్తించారో అందులో స్పష్టంగా ఉందని, ఫిర్యాదులోని వివరాలు సభ్యసమాజం తలదించుకొనేలా ఉన్నాయని తెలిపారు.