భార్య అంటే అర్ధాంగి
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:03 AM
కోమాలో ఉన్న భర్త బ్యాంక్ ఖాతా నిర్వహణకు భార్యను చట్టబద్ధమైన సంరక్షకురాలిగా గుర్తిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భారతీయ సంప్రదాయంలో భార్యను అర్ధాంగిగా (భర్తలో సగభాగంగా) పరిగణిస్తారని...
కోమాలో ఉన్న భర్తకు ఆమె చట్టబద్ధమైన సంరక్షకురాలు
చికిత్సకు ఖాతాలోని నగదు వినియోగానికి అభ్యంతరం తెలిపిన బ్యాంకు
చికిత్సకు ఖాతాలోని నగదు వాడకానికి బ్యాంకు అభ్యంతరం
హైకోర్టును ఆశ్రయించిన బాధితుడి భార్య, పిల్లలు
భవిష్యత్‌లో ఇలాంటి కేసుల్లో చర్యలకు వీలుగా న్యాయ కార్యదర్శికి తీర్పు ప్రతి
అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): కోమాలో ఉన్న భర్త బ్యాంక్ ఖాతా నిర్వహణకు భార్యను చట్టబద్ధమైన సంరక్షకురాలిగా గుర్తిస్తూ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. భారతీయ సంప్రదాయంలో భార్యను అర్ధాంగిగా (భర్తలో సగభాగంగా) పరిగణిస్తారని, కోమాలో ఉన్న భర్తకు భార్య కంటే సహజ సంరక్షకులు మరెవరూ ఉండరని స్పష్టం చేసింది. వైయ్‌సఆర్ కడప జిల్లా, మైదుకూరుకు చెందిన సింగవరం సుభాన్ సింగ్ ఇటీవల మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ తర్వాత పరిస్థితి విషమించి కోమాలోకి వెళ్లారు. శ్వాస, ఆహారం తీసుకోవడానికి ట్యూబులపై ఆధారపడి ఉన్నారు. వైద్య ఖర్చుల నిమిత్తం సుభాన్ సింగ్ బ్యాంక్ ఖాతాలో ఉన్న రూ.14.38 లక్షలను వినియోగించేందుకు సంబంధిత బ్యాంకు అభ్యంతరం తెలపడంతో ఆయన భార్య నాగమ్మ, ఇద్దరు పిల్లలు హైకోర్టును ఆశ్రయించారు. తమలో ఒకరిని సంరక్షకులిగా నియమించాలని కోరారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు.. సుభాన్ సింగ్ బ్యాంక్ ఖాతాల నిర్వహణకు ఆయన భార్య నాగమ్మను సంరక్షకురాలిగా నియమించడం సమంజసమని భావిస్తున్నామని పేర్కొన్నారు. నాగమ్మను సంరక్షకురాలిగా నియమిస్తూ బ్యాంక్ ఖాతాలోని నిధులను కేవలం బాధితుడి వైద్య అవసరాలకే ఉపయోగించాలని స్పష్టం చేశారు. ఖర్చుల వివరాలతో పాటు అప్‌డేట్ చేసిన బ్యాంక్ పాస్‌బుక్‌ను ప్రతీ మూడు నెలలకోసారి కోర్టు రిజిస్ట్రార్‌కు సమర్పించాలని ఆదేశించారు.
భవిష్యత్తులో ఇలాంటి కేసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకొనేందుకు వీలుగా తీర్పు ప్రతిని రాష్ట్ర ప్రభుత్వ న్యాయశాఖ కార్యదర్శికి పంపించాలని రిజిస్ట్రీకి స్పష్టం చేశారు. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ... సంరక్షకుల నియామకం విషయంలో హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయడానికి వీల్లేదన్నారు. వ్యాజ్యం పూర్తిగా సివిల్ స్వభావం కలిగి ఉందని, సివిల్ కోర్టును ఆశ్రయించేలా పిటిషనర్లను ఆదేశించాలని కోరగా.. ఈ వాదనను న్యాయమూర్తి తోసిపుచ్చారు. కోమాలో ఉన్న ఉన్న వ్యక్తుల సంరక్షణ విషయంలో ప్రస్తుత చట్టాల్లో స్పష్టమైన నిబంధనలు ఏవీ లేవని గుర్తుచేశారు. అసాధారణ పరిస్థితుల్లో అధికరణ 226 ప్రకారం కోర్టు తన ‘పేరెన్స్ పాట్రియే’ అధికారపరిధిని ఉపయోగించి బాధితులకు న్యాయం చేయవచ్చని పేర్కొన్నారు. సుభాన్ సింగ్ ఆస్తులు, బ్యాంకు ఖాతాల నిర్వహణకు సంరక్షకురాలిగా ఆయన భార్య సింగవరం నాగమ్మను నియమిస్తూ తీర్పు వెలువరించారు.