Share News

కక్షతోనే కేసు

ABN , Publish Date - Jul 17 , 2026 | 04:03 AM

రాజధాని అసైన్డ్‌ భూములకు సంబంధించి జీవో జారీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలపై 2021లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదని హైకోర్టు విస్పష్ట తీర్పును ఇచ్చింది.

కక్షతోనే కేసు

  • చంద్రబాబుపై రాజధాని అసైన్డ్‌ పిటిషన్లు కొట్టేస్తూ హైకోర్టు వ్యాఖ్య

  • కేసులో చంద్రబాబు, నారాయణలను యాంత్రికంగా, దౌర్జన్యపూరితంగా చేర్చారు

  • దురుద్దేశంతోనే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు

  • పాలనా నిర్ణయాలకు నేరం ఆపాదించలేం

  • అది ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం

  • నష్టపోయామని రైతులెవరూ కోర్టుకు రాలేదు

  • సీఆర్డీఏ నిర్ణయాలకు చట్టపరమైన రక్షణ

  • దాని ప్రకారం ప్రాసిక్యూట్‌ చేయడానికి వీల్లేదు

  • ఆరోపణలన్నీ నిరాధారమైనవే..

  • అందుకే పిటిషన్లన్నీ కొట్టివేస్తున్నాం: హైకోర్టు

నిపుణుల కమిటీ నివేదిక, ప్రజా తీర్పును అనుసరించి విజయవాడ పరిసర ప్రాంతాల్లో రాజధాని ఏర్పాటు చేయాలని క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. దానిని ఆమోదిస్తూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రభుత్వ నిర్ణయానికి లభించిన అత్యున్నత ప్రజాస్వామ్య ఆమోదం. శాసనసభ నిర్ణయానికి అనుగుణంగా పిటిషనర్లు తీసుకునే చర్యలను దురుద్దేశపూరితమైనవిగా, కుట్రపూరితమైనవిగా, నేరపూరితమైనవిగా పరిగణించలేం. అలా చేయడం అంటే శాసననభ ఉద్దేశాలకు నేరాన్ని ఆపాదించడమే. విధానపరమైన నిర్ణయాల రూపకల్పన, దానిపై జీవోల జారీని మంత్రులు, అధికారుల మధ్య జరిగిన నేరపూరిత కుట్రగా చిత్రీకరించడం ప్రమాదకర ధోరణి . దీనిని అనుమతిస్తే ప్రజాస్వామ్య పునాదులనే కదిలించేస్తుంది.

- హైకోర్టు

అమరావతి, జూలై 16 (ఆంధ్రజ్యోతి): రాజధాని అసైన్డ్‌ భూములకు సంబంధించి జీవో జారీ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలపై 2021లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం రాజకీయ కక్ష సాధింపే తప్ప మరొకటి కాదని హైకోర్టు విస్పష్ట తీర్పును ఇచ్చింది. రాజకీయ దురుద్దేశాలతోనే కేసు నమోదు చేశారని పేర్కొంది. పరిపాలనపరమైన నిర్ణయాలకు నేరపూరిత చర్యలను ఆపాదిస్తే ప్రజాస్వామ్య మనుగడే ప్రమాదంలో పడుతుందని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదించిన నిర్ణయాలకు నాయకులను శిక్షించడం అంటే, వారిని ఎన్నుకున్న ప్రజలను కూడా శిక్షించడమే అవుతుందని పేర్కొంది. అసైన్డ్‌ భూముల కేసులో చంద్రబాబు, నారాయణను యాంత్రికంగా, దౌర్జన్యపూరితంగా నిందితులుగా చేర్చారని తెలిపింది. వ్యక్తిగత హోదాలో చంద్రబాబు, నారాయణ కాగ్నిజబుల్‌ నేరాలకు పాల్పడినట్టు ఎఫ్‌ఐఆర్‌లో నిర్దిష్ట ఆరోపణలు లేవని స్పష్టం చేసింది. నేర బాధ్యత వ్యక్తిగతమైనదని, అధికారిక హోదా ఆధారంగా నేరాన్ని ఆపాదించలేరని తేల్చిచెప్పింది.


నేర దర్యాప్తునకు అవసరమైన నిర్ణయాలేవీ చంద్రబాబు, నారాయణ తీసుకున్నట్లు సీఐడీ ప్రాథమిక నివేదిక, దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో నిరూపణ కావట్లేదని పేర్కొంది. 2016 ఫిబ్రవరి 17న జీవో 41 తీసుకొచ్చినప్పుడు రైతులుగానీ, భూ యజమానులుగానీ దానిపై అభ్యంతరం చెప్పలేదని గుర్తు చేసింది. ప్రభుత్వ పాలసీతో నష్టపోయామని ఏ బాధితుడూ కోర్టులను ఆశ్రయించలేదని తెలిపింది. దీనికి బదులు రాజకీయ ప్రత్యర్థే... ప్రభుత్వ పాలనను అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నించారని పేర్కొంది. ప్రభుత్వం మారి చంద్రబాబు, నారాయణ ప్రత్యర్థులు అధికారంలోకి వచ్చిన వెంటనే, ఆ జీవో వల్ల అక్రమాలు జరిగినట్లు ఆరోపిస్తూ, ఐదేళ్ల తరువాత 2021 ఫిబ్రవరి 4న అప్పటి అధికారపార్టీలో క్రియాశీల నేత, మంగళగిరి ఎమ్మెల్యే, పిటిషనర్లకు రాజకీయ ప్రత్యర్థి అయిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారని గుర్తుచేసింది. ఫిర్యాదు చేయడంలో జాప్యానికి కారణాలు చెప్పలేదని పేర్కొంది. నిజమైన బాధితులు మాట్లాడాలని న్యాయం కోరుకుంటుందే తప్ప రాజకీయ ప్రాక్సీలు కాదని వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసులో ఫిర్యాదుదారు న్యాయం కోసం కాకుండా, చట్టాన్ని ఓ క్రీడలా దుర్వినియోగం చేశారని వ్యాఖ్యానించింది. పిటిషనర్లపై ఫిర్యాదు చేయడంలో ఆళ్ల చూపిన ఉత్సుకత వెనుక రాజకీయ వైరం, దురుద్దేశం తప్ప ఎలాంటి ప్రజా ప్రయోజనం లేదని తెల్చిచెప్పింది. సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణ వేసిన వ్యాజ్యాలను అనుమతించింది. ఈ మేరకు జస్టిస్‌ వై.లక్ష్మణరావు బుధవారం ఇచ్చిన తీర్పు ప్రతి గురువారం అందుబాటులోకి వచ్చింది.


తీర్పులో ఏముందంటే....

‘‘చట్ట నిబంధనలను అనుసరించే జీవో 41 జారీ చేసినట్లు రికార్డులను పరిశీలిస్తే స్పష్టమౌతోంది. బిజినెస్‌ రూల్స్‌కుఅనుగుణంగా సీఆర్డీఏ చట్టం మేరకు ఆ జీవో తెచ్చారు. చంద్రబాబు, నారాయణ తమకున్న అధికారాన్ని ఉపయోగించి ల్యాండ్‌ పూలింగ్‌ స్కీమ్‌ రూపకల్పన, అమలులో భాగంగా జీవో తీసుకొచ్చారు. దీన్ని నేరపూరిత చర్యగా భావించి, దాన్ని కోర్టుల్లో సవాల్‌ చేయడానికి వీల్లేదు. ప్రభుత్వ ఉత్తర్వులను ఐపీసీ కింద నేర పరిశీలన చేయడం కార్యనిర్వాహక నిర్ణయాల పవిత్రతను దెబ్బతీయడమే అవుతుంది. ప్రభుత్వాలు మారిన ప్రతిసారీ పాత ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలను నేరాలుగా పరిగణించి విచారణ జరపడం ఆమోద యోగ్యం కాదు. అది చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్య వినాశనానికి దారితీస్తుంది.’’


రిపీల్‌ యాక్ట్‌లోనూ కొనసాగిన రక్షణలు

‘‘చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రిపీల్‌ యాక్ట్‌ తీసుకొచ్చారు. సీఆర్‌డీఏ చట్టంలో కల్పించిన రక్షణలను రిపీల్‌ యాక్ట్‌లో కూడా కొనసాగించారు. ఒకవైపు రిపీల్‌ యాక్ట్‌లో సీఆర్డీఏ చట్టంలోని రక్షణలు కొనసాగిస్తూనే మరోవైపు ఆ రక్షణలను రూపొందించిన వ్యక్తులను నేరపూరితంగా ప్రాసిక్యూట్‌ చేయడానికి వీల్లేదు. జీవో 41ని చట్టవిరుద్ధమైందిగా ప్రకటించనంతవరకు దానికి అనుగుణంగా రూపొందించిన ఫైళ్లను చెల్లుబాటు కానివిగా ప్రకటించలేం. భవిష్యత్తులో అది చెల్లనిదిగా ప్రకటించినప్పటికీ, పీనల్‌ ప్రొవిజన్స్‌ కింద నేరం రుజువు కావాలంటే ప్రజలకు హాని కలిగించే దరుద్దేశంతో జీవో తీసుకొచ్చినట్లు నిరూపించాల్సి ఉంటుంది. ప్రజా సేవకుల హోదాలో చంద్రబాబు, నారాయణ ఒకరికి హాని చేయాలనే ఉద్దేశంతో ఏ చట్టాన్నీ ఉల్లంఘించలేదు. ఫైళ్లను తారుమారు చేయలేదు. ’’

ప్రాసిక్యూట్‌ చేయడానికి చట్టం అనుమతించదు

‘‘సీఆర్డీఏ చట్టం ప్రకారం నిర్ణయాలను తీసుకున్న వ్యక్తులు, అధికారులను ప్రాసిక్యూట్‌ చేయడాన్ని చట్టంలోని సెక్షన్‌ 146 నిషేధిస్తుంది. సీఆర్డీఏ చట్టం ప్రకారం తీసుకున్న నిర్ణయాలన్నింటికీ చట్టపరమైన రక్షణ ఉంది. ఈ నేపథ్యంలో వారిరువురినీ ప్రాసిక్యూట్‌ చేయడం చట్టవిరుద్ధం. ప్రస్తుత కేసును కొట్టివేయడానికి ఇదో ప్రధాన కారణం. అసైన్డ్‌ భూముల నిషేధిత చట్టంలోని సెక్షన్‌ 8ప్రకారం సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలకు సంబంధిత వ్యక్తులను, అధికారులను ప్రాసిక్యూట్‌ చేయడానికి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ప్రస్తుత కేసులో పిటిషనర్‌ చర్యలు సదుద్దేశంతో కూడుకున్నవే. పిటిషనర్లపై సీఐడీ నమోదు చేసిన సెక్షన్లు చెల్లుబాటు కావు. ప్రతి కాగ్నిజబుల్‌ నేరాన్నీ నేరుగా దర్యాప్తు చేసే అధికారం సీఐడీకి లేదు. పోలీసు మాన్యువల్‌ స్టాండింగ్‌ ఆర్డర్స్‌ ప్రకారం యూనిట్‌ ఆఫీసర్‌ నుండి అభ్యర్థన రావాలి. ప్రస్తుత కేసులో అప్పటి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అదనపు డీజీకి ఫిర్యాదు చేశారు. దాని ఆధారంగా ఆ పోలీసు అధికారి దర్యాప్తునకు ఇచ్చిన ఆదేశాలు చెల్లుబాటు కావు.’’


క్రిమినల్‌ చట్టాలను ఆయుధంగా చేసుకోరాదు

‘‘తరువాత వచ్చే ప్రభుత్వం క్రిమినల్‌ విచారణ చేపడుతుందనే భయం లేకుండా విధానపరమైన నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వాలకు ఉండాలి. వాటిలో వివాదాస్పదమైనవీ, సరిగా లేనివీ ఉండవచ్చు. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయడం,వారు అధికారంలోకి వచ్చాక వైరిపక్షాల పై కేసులు పెట్టడం దేశ రాజకీయాల్లో ఆందోళన కలిగించే అంశం. రాజకీయ ప్రయోజనాల కోసం క్రిమినల్‌ చట్టాలను ఆయుధంగా మార్చడంపై సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత కేసు పరిశీలిస్తే ఫిర్యాదు చేసింది అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యే. పూర్వ సీఎం, నాటి మంత్రిని లక్ష్యంగా చేసుకొన్నారు. ప్రభుత్వం మారిన రెండేళ్ల తరువాత కేసు పెట్టారు. ప్రస్తుత కేసులో నేరారోపణలు నిలకడ లేకుండా ఊహాజనితంగా ఉన్నాయి. పిటిషనర్లపై మోపిన ఆరోపణలు అన్నీ నిరాధారమైనవే. అందువల్లే ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేస్తున్నాం.’’ అని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు.


దురుద్దేశాలను ఆపాదించలేం..

‘‘చంద్రబాబు, నారాయణ ఎలాంటి దాపరికాలకు తావు లేకుండా విధానపరమైన నిర్ణయ ప్రక్రియలో పాల్గొన్నారు. శాసనసభలో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరిపారు. ఇలాంటి వాటిపై ప్రాసిక్యూషన్‌కు అనుమతిస్తే ప్రాతినిఽధ్య ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పాలన పునాదులు కదులుతాయి. పిటిషనర్లు వ్యక్తిగత లబ్ధి శించకుండా నిర్వర్తించిన విధులకు దురుద్దేశాలు ఆపాదించడం ఆమోదయోగ్యం కాదు. అన్ని లోటుపాట్లను బేరీజు వేసుకొని సరిదిద్దుకొనే సామర్థం ప్రభుత్వానికే ఉంటుంది. ఈ నేపఽథ్యంలో విధానపరమైన నిర్ణయాలను ప్రభుత్వాలకే వదిలేయాలి. న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఎలాంటి దాపరికం లేకుండా ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకున్న నిర్ణయాలను నేరమయం చేసే ప్రయత్నం చేశారు. నేర విచారణ ప్రక్రియ రాజకీయ ప్రయోజనాలకు, వ్యక్తిగత ప్రతీకారాలకు ఆయుధంగా మారకుండా కాపాడాల్సిన బాధ్యత హైకోర్టుపై ఉంది.’’

Updated Date - Jul 17 , 2026 | 04:08 AM