ప్రత్యక్షంగా హాజరు కావాల్సిందే..
ABN , Publish Date - May 16 , 2026 | 04:36 AM
ఫ్యామిలీ కోర్టులో విచారణకు వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ ఉద్యోగరీత్యా టెక్సాస్‌లో(అమెరికా) ఉంటున్న ఓ వ్యక్తి చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది.
రాజీదశలో వీసీ ద్వారా హాజరుకు అనుమతించలేం.. భార్యాభర్తల వివాదంలో హైకోర్టు స్పష్టీకరణ
అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): ఫ్యామిలీ కోర్టులో విచారణకు వీడియో కాన్ఫరెన్స్ (వీసీ) ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ ఉద్యోగరీత్యా టెక్సాస్‌లో(అమెరికా) ఉంటున్న ఓ వ్యక్తి చేసిన అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. కుటుంబ వివాదాల పరిష్కారానికి వ్యక్తిగత హాజరు కీలకమని ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది. భార్యాభర్తల మధ్య వైవాహిక వివాద పరిష్కారానికి ఫ్యామిలీ కోర్టులో రాజీ ప్రయత్నాలు జరుగుతున్న దశలో వీసీ విచారణకు అనుమతించలేమని తేల్చిచెప్పింది. రాజీ ప్రయత్నాలు, చర్చలు విఫలమైన తరువాత జరిగే విచారణకు వీసీ ద్వారా హాజరుకావచ్చని స్పష్టం చేసింది. వీడియోకాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు అనుమతి నిరాకరిస్తూ ఫ్యామిలీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ వేసిన సివిల్ రివిజన్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవినాథ్ తిల్హరి ఇటీవల తీర్పు ఇచ్చారు. భార్యాభర్తల మధ్య ఉన్న వైవాహిక వివాదాన్ని పరిష్కరించుకునేందుకు టెక్సా్‌సలో నివసిస్తున్న భీమిశెట్టి భాను శ్రీధర్ తన తండ్రి (పవర్ ఆఫ్ అటార్నీ హోల్డర్)ద్వారా ఫ్యామిలీ కోర్టులో 2023లో హెచ్.ఎం.ఓ.పీ పిటిషన్ దాఖలు చేశారు. సెలవు దొరకని కారణంగా వ్యక్తిగతంగా కోర్టు ముందు హాజరు కాలేకపోతున్నానని, దాంపత్య వివాదానికి సంబంధించి రాజీ ప్రక్రియలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యేందుకు అనుమతించాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశారు. అయితే ఈ అభ్యర్థనను యలమంచిలి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు (ఫ్యామిలీ కోర్టు) గత ఏడాది అక్టోబర్‌లో తిరస్కరించింది. దీంతో తండ్రి ద్వారా హైకోర్టులో భాను సివిల్ రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫు న్యాయవాది అభయ్ సిద్ధాంత్ మూత వాదనలు వినిపించారు. ‘‘సెలవు దొరక్కపోవడంతో పిటిషనర్ భారత్‌కు వచ్చి విచారణకు హాజరుకాలేకపోయారు.
సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగంలో ఉన్న ఈ కాలంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణలో పాల్గొనేందుకు ఆయనను అనుమతించకపోవడం సరికాదు. ఏపీ హైకోర్టు రూపొందించిన వీడియో కాన్ఫరెన్స్ రూల్స్-2023 ప్రకారం, కేసుల విచారణకు సంబంధించి అన్ని దశల్లోనూ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని వినియోగించుకోవచ్చు. రాజీ ప్రక్రియ దశలో సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరుకావచ్చన్న హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పులను దిగువ కోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.’’ అని తెలిపారు. అయితే, ఈ వాదనలను న్యాయమూర్తి తోసిపుచ్చారు. వైవాహిక వివాదాల్లో భార్య, భర్త మధ్య రాజీ ప్రయత్నాలు సమర్థవంతంగా జరగాలంటే ఇరువురూ ఒకేచోట ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. సివిల్ రివిజన్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నామని తెలిపారు.