Share News

చిన్న కారణంతో అనర్హుడిని చేయొద్దు!

ABN , Publish Date - May 20 , 2026 | 05:08 AM

తనపై నమోదైన చిన్న కేసు వివరాలు వెల్లడించలేదనే సాంకేతిక కారణంతో గిరిజన యువకుడికి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని నిరాకరించడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది.

చిన్న కారణంతో అనర్హుడిని చేయొద్దు!

  • తీవ్ర నేరారోపణలున్నవారే చట్టసభలకు పోటీ చేస్తున్నారు.. గిరిజనుడికి అడ్డంకా?

  • కానిస్టేబుల్‌ పోస్టుపై హైకోర్టు వ్యాఖ్యలు

  • పెంచలయ్యను నియమించాలని ఆదేశం

అమరావతి, మే 19(ఆంధ్రజ్యోతి): తనపై నమోదైన చిన్న కేసు వివరాలు వెల్లడించలేదనే సాంకేతిక కారణంతో గిరిజన యువకుడికి పోలీస్‌ కానిస్టేబుల్‌ ఉద్యోగాన్ని నిరాకరించడాన్ని హైకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. అభ్యర్థి నేరచరిత్ర పరిశీలించేటప్పుడు అధికారులు యాంత్రికంగా వ్యవహరించకూడదని, నేర తీవ్రత, అభ్యర్థి నేపథ్యాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. పలు కేసుల్లో సుప్రీంకోర్టు ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పిందని గుర్తు చేసింది. సమాజంలో ఉన్నతవర్గాలకు చెందినవారు, తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటున్నవారు చట్టసభలకు పోటీ చేస్తున్నారని తెలిపింది. ప్రస్తుత కేసులో పిటిషనర్‌ పెంచలయ్య ఉద్యోగాన్ని కోల్పోతాననే భయంతో సమాచారాన్ని దాచిపెట్టి ఉండవచ్చని అభిప్రాయపడింది. పెంచలయ్య ఉద్యోగ అవకాశాన్ని దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు కేసులో ఇరికించి ఉండవచ్చని పేర్కొంది. అయినా.. పెంచలయ్యను సంబంధిత కోర్టు నిర్దోషిగా ప్రకటించిందని గుర్తుచేసింది. చిన్న కారణంతో ఉద్యోగ అవకాశాన్ని నిరాకరిస్తే అణగారిన వర్గాలకు చెందిన యువత నేర ముఠాల వైపు మళ్లే ప్రమాదముందని అభిప్రాయపడింది. పిటిషనర్‌ ప్రయోజనాలు, వెయిటింగ్‌ పీరియడ్‌లో పెంచలయ్య ప్రవర్తను పరిగణనలోకి తీసుకుని కానిస్టేబుల్‌ పోస్టుకు అతని ఎంపికను రద్దు చేయడాన్ని చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించింది. గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసింది. పెంచలయ్యను 4 వారాల్లో పోలీస్‌ కానిస్టేబుల్‌ (సివిల్‌)గా నియమించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ సుభేందు సామంతతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన దొడ్ల పెంచలయ్య 2008 పోలీస్‌ కానిస్టేబుల్‌ నోటిఫికేషన్‌ ద్వారా ఎంపికయ్యారు. 2010లో గ్రామంలో జరిగిన చిన్న వివాదంలో పెంచలయ్యను నిందితుడిగా చేర్చారు. అదే ఏడాది డిసెంబరులో అటెస్టేషన్‌ ఫారమ్‌ నింపేటప్పుడు కేసు వివరాలు వెల్లడించలేదనే కారణంతో అధికారులు పెంచలయ్య ఎంపికను రద్దు చేశారు.

Updated Date - May 20 , 2026 | 05:09 AM