ఎస్‌ఈసీ నియామకం, బీసీ సర్వే వివరాలివ్వండి
ABN , Publish Date - Apr 17 , 2026 | 06:01 AM
రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నియామకం, బీసీల సామాజిక స్థితిగతులపై జరిపిన సర్వే వివరాలు, ఆ సర్వే నిర్వహించిన సంస్థ పూర్వపరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ధర్మాసనం ఆదేశం
అమరావతి, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఎన్నికల కమిషనర్(ఎస్ఈసీ) నియామకం, బీసీల సామాజిక స్థితిగతులపై జరిపిన సర్వే వివరాలు, ఆ సర్వే నిర్వహించిన సంస్థ పూర్వపరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. బీసీ జనగణన చేపట్టడంతో పాటు తదనుగుణంగా రిజర్వేషన్ ఖరారు చేసిన తరువాతే స్థానిక సంస్థలు, గ్రామ పంచాయితీలకు ఎన్నికలు నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఏపీ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు 2025లో హైకోర్టులో పిల్ వేశారు. అలాగే రాష్ట్రంలోని 13,325 గ్రామ పంచాయితీలు, 123 పట్టణ స్థానిక సంస్థలకు త్వరలో పదవీకాలం ముగియనుందని, ఎన్నికల నిర్వహణకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేశన్ మరో పిల్ వేశారు. ఈ వ్యాజ్యాలన్నింటిపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రణాళికా శాఖ చేపట్టిన బీసీ జనగణన 99.5శాతం పూర్తి అయ్యిందని కోర్టుకు నివేదించారు. బీసీల సామాజిక స్థితిగతుల వివరాలు కూడా అందులో ఉన్నాయన్నారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు శాఖ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించారన్నారు. ఇక, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించిన ఫైలు గురువారం గవర్నర్ వద్దకు వెళ్లిందన్నారు.
ఒకటి లేదా రెండు రోజుల్లో నియామకం జరుగుతుందని తెలిపారు. కేశన శంకరరావు తరఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ వాదనలు వినిపిస్తూ... బీసీ జనగణన, వారి స్థితిగతులపై ఏ సంస్థ సర్వే చేస్తుందో తమకు ఎలాంటి సమాచారమూ లేదన్నారు. ఇరువైపుల వాదనలు పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... బీసీ జనగణన, వారి స్థితిగతులపై జరిపిన సర్వే వివరాలు, ఎస్‌ఈసీ నియామకానికి సంబంధించిన సమాచారంతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను ఏప్రిల్ 23కి వాయిదా వేసింది.