Share News

మీ తీరు కోర్టు ధిక్కరణే!

ABN , Publish Date - Feb 25 , 2026 | 03:20 AM

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌పై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది.

మీ తీరు కోర్టు ధిక్కరణే!

  • 2018 గ్రూపు-1 అభ్యర్థులను అప్రాధాన్య పోస్టులకు మార్చడంపై నివేదిక ఎందుకు ఇవ్వలేదు?

  • సీఎస్‌ విజయానంద్‌పై హైకోర్టు ధర్మాసనం ఆగ్రహం

  • ఆయన వైఖరి కోర్టు ధిక్కరణ కిందకు వస్తుంది

  • సుమోటో ధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయకూడదో నేడు కోర్టుకు హాజరై వివరణ ఇవ్వండి

  • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి హైకోర్టు ఆదేశం

అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌పై హైకోర్టు మంగళవారం ఆగ్రహం వ్యక్తం చేసింది. మెయిన్స్‌ జవాబుపత్రాల మూ ల్యాంకనంలో అక్రమాల ఆరోపణల నేపథ్యంలో గ్రూప్‌-1 (2018 నోటిఫికేషన్‌) ద్వారా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులను కీలక పోస్టుల నుండి అప్రాధాన్యత పోస్టులకు మార్చాలని ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేసి, రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు నివేదిక సమర్పించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సీఎస్‌ వ్యవహారశైలి కోర్టు ధిక్కరణ కిందికి వస్తుందని వ్యాఖ్యానించింది. ఆయనపై సుమోటో కోర్టుధిక్కరణ కేసు ఎందుకు నమోదు చేయకూడదో బుధవారం కోర్టు ముందు వివరణ ఇవ్వాలని సీఎ్‌సను ఆదేశించింది. విచారణను బుధవారానికి వాయిదా వేసింది. ఈ మేరుకు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టుదేవానంద్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మ ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది.


గతంలో ఏం జరిగింది?

2018లో ఇచ్చిన నోటిఫికేషన్‌ ఆధారంగా 169 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్ష జవాబుపత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని హైకోర్టు సింగిల్‌ జడ్జి నిర్ధారించారు. 2022 మే26న ఏపీపీఎస్సీ ఇచ్చిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల జాబితాను రద్దు చేశారు. తాజాగా మళ్లీ మెయిన్స్‌ నిర్వహించాలని, ఎంపిక ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ 2024 మార్చి 13న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ, ఉద్యోగాలు పొందిన కొందరు అభ్యర్థులు హైకోర్టులో అప్పీల్‌ చేశారు. అప్పీళ్లపై ఇటీవల విచారణ జరిపిన ధర్మాసనం.. పలువురు అభ్యర్థుల అనుబంధ పిటిషన్లను పరిష్కరించింది. జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాల ఆరోపణల్లో వాస్తవాలను తేల్చేందుకు సిట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. అలాగే ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్ధులందరినీ తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు కీలక పోస్టుల నుండి అప్రాధాన్యత పోస్టులకు మార్చాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.


వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేం

ఈ వ్యవహారంపై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. సీఎస్‌ ఎలాంటి నివేదిక దాఖలు చేయలేదని రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌ ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ.. నివేదిక దాఖలుపై సమాచారం ఏమైనా ఉందా? అని ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను ప్రశ్నించింది. ఏజీ ఎలాంటి నివేదిక దాఖలు చేయలేదని బదులిచ్చారు. ఉత్తర్వులు అమలుపై న్యాయస్థానం నుండి స్పష్టత తీసుకోవాలని సీఎస్‌ భావించారని నివేదించారు. అయితే తనకు వ్యక్తిగత ఇబ్బంది ఉందని కోర్టు దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. కోర్టు విచారణల్లో వ్యక్తిగత ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోలేమని ఏజీకి తేల్చిచెప్పింది. కోర్టు ధిక్కరణ చర్యల ప్రారంభానికి సంబంధించి ఉత్తర్వులు జారీని ప్రారంభించింది. ఏజీ స్పందిస్తూ.. అప్పీళ్లపై విచారణను ఒకరోజు వాయిదా వేయాలని కోరారు. అందుకు ధర్మాసనం నిరాకరించింది. కేసును ఏవిధంగా హ్యాండిల్‌ చేయాలో తమకు తెలుసని పేర్కొంది.

Updated Date - Feb 25 , 2026 | 03:47 AM