జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ పదవీ విరమణ
ABN , Publish Date - Apr 25 , 2026 | 05:07 AM
పదవీ విరమణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. శుక్రవారంతో జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ పదవీకాలం ముగియడంతో...
సీజేకు ఘనంగా వీడ్కోలు పలికిన హైకోర్టు
తీవ్ర భావోద్వేగానికి గురైన జస్టిస్ ఠాకూర్
న్యాయసేవలను కొనియాడిన జస్టిస్ లీసాగిల్
అమరావతి, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): పదవీ విరమణ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్‌కు హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికింది. శుక్రవారంతో జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ పదవీకాలం ముగియడంతో హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాబోయే సీజే జస్టిస్ లీసాగిల్ మాట్లాడుతూ.. జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ న్యాయవ్యవస్థ బలోపేతానికి విశేష కృషి చేశారని కొనియాడారు. ‘సీజేగా ఆయన హయాంలో న్యాయ వ్యవస్థలో మౌలికసదుపాయాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 38 కోర్టు భవనాలు ప్రారంభోత్సవాలు, మరో 47 కొత్త భవనాలకు శంకుస్థాపనులు జరిగాయి. జడ్జిల నివాస సముదాయాలు, జ్యుడీషియల్ అకాడమీ, అమరావతి, విశాఖల్లో అతిథిగృహాలు వంటి నిర్మాణాలు ఆయన చొరవతోనే ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కోర్టు హాలుల్లో ఏసీ సదుపాయం కల్పించడం ద్వారా న్యాయసేవల నిర్వహణకు అనుకూల వాతావరణం కల్పించారు. భారీస్థాయిలో నియామకాలు చేపట్టారు. 13మంది జిల్లా న్యాయమూర్తులు, 73మంది సివిల్ జడ్జీలు, జిల్లా న్యాయవ్యవస్థలో 3,432మంది ఉద్యోగుల నియామకం జరిగింది. జస్టిస్ ఠాకూర్ అందించిన న్యాయసేవలు ఏపీ న్యాయ చరిత్రలో చిరస్మరణీయంగా నిలుస్తాయి. భవిష్యత్తులో కూడా ఆయన సమాజానికి, దేశానికి మరిన్ని ఉన్నతసేవలు అందించాలని ఆకాంక్షిస్తున్నాను. శేషజీవితం ఆయురారోగ్యాలతో ప్రశాంతంగా సాగాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. అదనపు సొలిసిటర్ జనరల్ చల్లా ధనంజయ, అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, బార్ కౌన్సిల్ చైర్మన్ ద్వారకానాథ్‌రెడ్డి మాట్లాడారు. న్యాయవ్యవస్థలో సమస్యల పరిష్కారానికి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ కృషి మరువలేమన్నారు.
జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ మాట్లాడుతూ... తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. కొన్ని నిమిషాలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. అనంతరం ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. ‘ప్రజలకు న్యాయం ఆలస్యం కాకుండా చూడటంలో న్యాయమూర్తులతోపాటు న్యాయవాదులకు సమాన బాధ్యత ఉంది. ప్రతి తీర్పూ ప్రజల జీవితాన్ని, భవిష్యత్తును ప్రభావితం చేస్తుందనే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేయాలి. జమ్మూ కశ్మీర్, బాంబే హైకోర్టు, ఏపీహైకోర్టులో సేవలందించే అవకాశం తనకు లభించడం గౌరవంగా భావిస్తున్నా. అమరావతిలో జస్టిస్ సిటీ ప్రతిపాదనలో భాగంగా కేవలం హైకోర్టు భవనమే కాకుండా అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం, జ్యుడీషియల్ అకాడమీ, న్యాయవాదుల చంబర్లు, న్యాయమూర్తులకు నివాస సముదాయాలు, ఇతర మౌలిక సదుపాయాలు ఏర్పాటుకాబోవడం గొప్ప ముందడుగు. న్యాయవ్యవస్థ మౌలికసదుపాయాల అభివృద్ధికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషిని అభినందిస్తున్నాను. ఇంతకాలం సహకారం అందించిన వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు’ అని ముగించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, సీజే ధీరజ్‌సింగ్ ఠాకూర్ కుటుంబ సభ్యులు, రిజిస్ట్రార్‌లు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ సాంబశివ ప్రతాప్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండ లక్ష్మీనారాయణ, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్ దంపతులను ఘనంగా సన్మానించారు. పూలమాలతో సత్కరించి జ్ఞాపికను బహూకరించారు. కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు వాసిరెడ్డి ప్రభునాథ్, ఉపాధ్యక్షుడు పీటారామన్, ప్రధాన కార్యదర్శి తిరుమలశెట్టి కిరణ్, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.