బోరు బావికి, ఆర్వో ప్లాంట్‌కూ అనుమతి తప్పనిసరి
ABN , Publish Date - May 19 , 2026 | 04:45 AM
బోరు బావి తవ్వకాలకు, ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి అధికారుల అనుమతి తప్పనిసరని హైకోర్టు తేల్చిచెప్పింది.
ప్రజలకు సురక్షితమైన నీరు అందుబాటులో ఉంచడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత: హైకోర్టు
ఆర్వో ప్లాంట్‌పై పిటిషనర్ దరఖాస్తుపై చట్టప్రకారం నిర్ణయం తీసుకోండి
అధికారులకు హైకోర్టు ఆదేశం
అమరావతి, మే 18(ఆంధ్రజ్యోతి): బోరు బావి తవ్వకాలకు, ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి అధికారుల అనుమతి తప్పనిసరని హైకోర్టు తేల్చిచెప్పింది. వాల్టా చట్ట ప్రకారం బోరుబావి తవ్వకానికి సంబంధిత అధికారుల నుండి అనుమతి అవసరమంది. అలాగే గ్రామ పంచాయితీ చట్టంలోని సెక్షన్ 120 ప్రకారం ఆర్వో వాటర్ ప్లాంట్ నిర్మాణానికి గ్రామ పంచాయితీ నుండి అనుమతులు తీసుకోవాలంది. బోరుబావి తవ్వకానికి, వాటర్ ప్లాంట్ నిర్మాణానికి అనుమతులు అవసరం లేదన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చింది. పౌరులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలకు శుద్ధి చేసిన త్రాగునీరు అందుబాటులో ఉండేలా చూడటం రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం బాధ్యతని హైకోర్టు స్పష్టం చేసింది. సురక్షితమైన త్రాగునీరు పొందడం విలాసవంతమైన వ్యవహారం కాదని, రాజ్యాంగంలోని అధికరణ 21 ప్రకారం అది జీవించే హక్కులో భాగమని పేర్కొంది. ప్రస్తుత కేసులో పిటిషనర్ చట్ట నిబంధనల అనుసరించి బోరుబావి తవ్వకానికి, వాటర్ ప్లాంట్ నిర్మాణానికి అధికారుల నుండి ఎలాంటి అనుమతులు తీసుకోలేదని గుర్తు చేసింది. క్లీన్ హ్యాండ్స్‌తో కోర్టు ముందుకు రాలేదనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొంది. మరో వైపు ప్రజల అవసరమైన శుద్ధి నీటిని అందించేందుకు పిటిషనర్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారనే విషయాన్ని విస్మరించలేమంది. గ్రామస్థుల నీటి అవసరం, రాజ్యాంగం ప్రసాదించిన జీవించే హక్కును పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాన్ని పరిష్కరిస్తున్నామని తెలిపింది. ప్లాంట్ మూసివేతకు అధికారులు ఇచ్చిన సీజర్ నోటీసును షోకాజ్ నోటీసుగా పరిగణించాలని ఆదేశించింది.
తీర్పు ప్రతి అందిన 15 రోజుల్లో తన వివరణను అధికారులకు సమర్పించాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. ఆ తరువాత వివరణను పరిశీలించి 15 రోజుల్లో సహేతుకమైన ఉత్తర్వులు జారీ చేయాలని తహశీల్దార్‌ను ఆదేశించింది. అనుమతులు కోసం పిటిషనర్ తాజాగా దరఖాస్తు చేసుకుంటే చట్టనిబంధనల ప్రకారం దానిని పరిశీలించాలని అధికారులను స్పష్టం చేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు. ప్రకాశం జిల్లా, పొన్నలూరు మండలం, ఇప్పగుంట గ్రామంలోని సర్వేనెం.336లో అదే గ్రామానికి చెందిన కొంక శ్రీను తన సొంత స్థలంలో ఆర్‌వో ప్లాంట్ ఏర్పాటు చేశారు. అయితే ప్లాంట్ ఏర్పాటుకు అనుమతులు లేవనే కారణంతో తహశీల్దార్ ప్లాంట్‌ను సీజ్ చేశారు. తనకు ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ప్లాంట్‌ను సీజ్ చేశారంటూ శ్రీను హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై కోర్టు ఇటీవల తుది విచారణ జరిపి, వ్యాజ్యాన్ని పరిష్కరించింది.