భానుడు భగభగ
ABN , Publish Date - Apr 24 , 2026 | 05:31 AM
రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. ఓ వైపు వడగాలి, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలులతో ఉత్తర కోస్తా...
నిప్పుల కొలిమిలా రాష్ట్రం
విశాఖపట్నం, అమరావతి, ఏప్రిల్ 23(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. ఓ వైపు వడగాలి, మరోవైపు ఉక్కపోతతో ప్రజలు సతమతమవుతున్నారు. వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలులతో ఉత్తర కోస్తా, రాయలసీమల్లోని అనేక ప్రాంతాలు గురువారం నిప్పుల కొలిమిలా మారాయి. దక్షిణ కోస్తాలోనూ పలుచోట్ల వడగాడ్పులు కొనసాగాయి. సముద్రం నుంచి తేమగాలుల రాక తగ్గడం, ఆకాశం నిర్మలంగా ఉండడంతో ఎండ తీవ్రంగా ఉంది. అనేకచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఐదు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో అత్యధికంగా 45.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కడపలో 45.2, మన్యం జిల్లా సాలూరులో 45.1, నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో 44.9, విజయనగరం జిల్లా రాజాంలో 44.5, కాకినాడ జిల్లా కరపలో 44.4, మార్కాపురం జిల్లా కంభంలో 44, అనకాపల్లి జిల్లా దేవరపల్లె, కృష్ణా జిల్లా పెదపారుపూడి, నెల్లూరు జిల్లా సైదాపురంలో 43.5, అనంతపురం జిల్లా రాయదుర్గంలో 43.3, కర్నూలు జిల్లా నగరడోనలో 43.2, అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె, ఏలూరు జిల్లా కుక్కునూరు, పల్నాడు జిల్లా వెల్దుర్తిలో 43.1, పోలవరం జిల్లా కూనవరం, ప్రకాశం జిల్లా కొప్పెరపాడులో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోని 382 మండలాల్లో 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అయితే, విదర్భ నుంచి తెలంగాణ, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు కొనసాగుతున్న ఉపరితలద్రోణి ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ పిడుగులతో వర్షం కురిసింది. శుక్రవారం ఉత్తరకోస్తాలో అనేకచోట్ల వడగాడ్పులు వీస్తాయని, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో వేడి వాతావరణం కొనసాగుతుందని వాతావరణ నిపుణుడొకరు తెలిపారు. రుతుపవన ముందస్తు వర్షాలు పెరిగేంత వరకు ఎండలు, వడగాడ్పులు కొనసాగుతాయన్నారు. నెలాఖరు నాటికి వాతావరణ అనిశ్చితి నెలకొని వర్షాలు కురిసే అవకాశం ఉందని, అప్పటివరకు వేడి వాతావరణం ఉంటుందని తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లోని 62 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, మరో 89 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.