ఎండలతో మండిన రాష్ట్రం
ABN , Publish Date - Apr 12 , 2026 | 05:06 AM
రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. 200 మండలాల్లో శనివారం 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా పొట్టిపాడులో...
200 మండలాల్లో 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రతలు
పొట్టిపాడులో అత్యధికంగా 44.7 డిగ్రీలు
అమరావతి, విశాఖపట్నం, ఏప్రిల్ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. 200 మండలాల్లో శనివారం 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడప జిల్లా పొట్టిపాడులో 44.7, నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 44.3 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో శనివారం పలుచోట్ల వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో అక్కడక్కడా ఉరుములు, పిడుగులతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, పోలవరం, ఏలూరు జిల్లాల్లోని 19 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 35 మండలాల్లో వడగాడ్పుల ప్రభావం ఉంటుందని తెలిపింది.