Share News

రేపు చండ ప్రచండం

ABN , Publish Date - May 20 , 2026 | 04:51 AM

జనులారా జాగ్రత్త! గురువారం అత్యవసరమైతే తప్ప కాలు బయటపెట్టవద్దు! ఎక్కడి వాళ్లు అక్కడ... తమతమ ఇళ్లలో ఉండటమే మంచిది! ఎందుకంటారా...

రేపు చండ ప్రచండం

  • 50 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రత

  • పశ్చిమ, పోలవరం జిల్లాల్లో మంటలే

  • గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, ఇతర జిల్లాల్లోనూ

  • ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: విపత్తుల సంస్థ

అమరావతి/విశాఖపట్నం, మే 19(ఆంధ్రజ్యోతి): జనులారా జాగ్రత్త! గురువారం అత్యవసరమైతే తప్ప కాలు బయటపెట్టవద్దు! ఎక్కడి వాళ్లు అక్కడ... తమతమ ఇళ్లలో ఉండటమే మంచిది! ఎందుకంటారా... గురువారం రికార్డు స్థాయిలో ఎండలు మండిపోతాయని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. పశ్చిమ గోదావరి, పోలవరం జిల్లాల్లో పలుచోట్ల 50 డిగ్రీలు, అంతకంటే ఎక్కువ... గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, పల్నాడు, కోనసీమ, బాపట్ల, నంద్యాల తదితర జిల్లాల్లో 49 నుంచి 50 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. 310 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు, 147 మండలాల్లో వడగాడ్పులు వీస్తాయని వెల్లడించింది. దీనిపై మంగళవారం ‘హీట్‌ వేవ్‌’ బులెటిన్‌ జారీ చేసింది.

నేడు 45-47 డిగ్రీల ఉష్ణోగ్రతలు

కోస్తాంధ్రలో బుధవారం నుంచి తీవ్ర వడగాడ్పులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. శ్రీకాకుళం నుంచి ప్రకాశం జిల్లా వరకు 45-47 డిగ్రీలు... నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 43-44... అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో 41-43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, పోలవరం, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లోని 71 మండలాల్లో వడగాడ్పులు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు రాయలసీమ, దక్షిణకోస్తా మీదుగా ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాయలసీమలో చెదురుమదురుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ‘‘వడ గాడ్పుల తీవ్రత మరింత పెరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వచ్చే ఆదివారం వరకు వడగాడ్పులు కొనసాగుతాయి’’ అని ఇస్రో వాతావరణ నిపుణుడు పేర్కొన్నారు. ఉదయం పది గంటల తరువాత ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని సూచించారు.


పిడుగురాళ్లలో 45.6 డిగ్రీలు

మంగళవారంనాడు పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో అత్యధికంగా 45.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోని 23 జిల్లాల్లోని 233 మండలాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పల్నాడు, నెల్లూరు, ప్రకాశం, మార్కాపురం, కృష్ణా, తిరుపతి, నంద్యాల, బాపట్ల, ఎన్టీఆర్‌, విజయనగరం జిల్లాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. నెల్లూరు జిల్లా గూడూరులో 44.9, కృష్ణా జిల్లా కంకిపాడులో 44.5, మార్కాపురం జిల్లా పెద్ద చర్లోపల్లిలో 44.2, ప్రకాశం జిల్లా సంతనూతలపాడులో 44.1, బాపట్ల జిల్లా ఇంకొల్లులో 43.2, ఎన్టీఆర్‌ జిల్లా కంచికచర్లలో 43.1, గుంటూరు జిల్లా పాండ్రపాడులో 43 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాయువ్య భారతం నుంచి వేడి గాలులు కోస్తాంధ్ర, రాయలసీమ వరకు వీస్తుండడంతో వడగాడ్పులు వీచాయి.

అప్రమత్తంగా ఉండండి మున్సిపల్‌ శాఖ

రాష్ట్రంలోని తీరప్రాంత జిల్లాల్లో ఉష్ణోగ్రత లు మరింత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మే 20 నుంచి 26 వరకు పట్టణ ప్రాంతాల్లో వడగాడ్పుల ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశమున్నందున పట్టణ, స్థానిక సం స్థలు అత్యవసర చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ముఖ్యంగా మధ్య, ఉత్తర కోస్తా జిల్లాల మున్సిపల్‌ కమిషనర్లకు మున్సిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి ప్రత్యేక సూచనలు చేశారు. ప్రాణనష్టం జరగకుండా చూడటంతోపాటు తా గునీరు, పారిశుధ్య సేవలు కొనసాగించాలని స్పష్టం చేశారు. వడగాల్పులపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రచారం చేయాలన్నారు. బస్టాండ్లు, మార్కెట్లు, కూలీల కూడళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, అన్న క్యాంటీన్లు తదితర ప్రాంతాల్లో నీటి సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. పారిశుధ్య కార్మికులు, అసంఘటిత కార్మికులు, వీధి వ్యాపారులు, నిరాశ్రయు లు, వృద్ధుల రక్షణకు చర్యలు చేపట్టాలన్నారు.

Updated Date - May 20 , 2026 | 07:06 AM