ఈ నెలలో భగభగలే!
ABN , Publish Date - Apr 01 , 2026 | 04:49 AM
రాష్ట్రంలో ఈ వేసవి సీజన్ మొత్తం ఎండ మంట పుట్టించనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. ఈ మూడు నెలల్లో ఎక్కువ రోజులు వడగాడ్పులు వీయనున్నాయి.
జూన్ వరకూ మంట పుట్టించనున్న ఎండలు
రాత్రిళ్లూ కొనసాగనున్న వేడి వాతావరణం
వడగాడ్పులూ ఎక్కువే.. వర్షాలు కూడా..
నైరుతి సీజన్ ప్రారంభం నుంచే ఎల్‌నినో
రానున్న 3 నెలలకు ఐఎండీ బులెటిన్ విడుదల
విశాఖపట్నం, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఈ వేసవి సీజన్ మొత్తం ఎండ మంట పుట్టించనుంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు పగటి ఉష్ఱోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదుకానున్నాయి. ఈ మూడు నెలల్లో ఎక్కువ రోజులు వడగాడ్పులు వీయనున్నాయి. ఏప్రిల్‌లో సగటున మూడు, నాలుగు రోజులు, మే, జూన్ నెలల్లో పది, అంతకంటే ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తాయి. రాత్రి వాతావరణం కూడా వేడిగానే ఉండనుంది. రానున్న మూడు నెలలకు దేశంలో వాతావరణ పరిస్థితులు, ఎండలు, వడగాడ్పులు, వర్షాలపై మంగళవారం భారత వాతావరణ శాఖ(ఐఎండీ) బులెటిన్ విడుదల చేసింది. వచ్చే మూడు నెలలు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారే అవకాశం ఉంది. ఏపీతోపాటు ఒడిశా, తెలంగాణలో కొంత భాగం, పశ్చిమ బెంగాల్, బిహార్, యూపీ, ఈశాన్య రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదుకానున్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే తక్కువగా నమోదవుతాయి. దేశంలోని 95 శాతం ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఎక్కువ రోజులు వడగాడ్పులు వీస్తాయి. ఏప్రిల్‌లో రాష్ట్రంలోని గోదావరి జిల్లాలు తప్ప మిగిలిన ప్రాంతాల్లో పగటి, రాత్రి ఉష్ణోగ్రతలు సగటు కంటే ఎక్కువగా నమోదవుతాయి. ఇక ఏప్రిల్‌లో ఈశాన్య రాష్ట్రాలు తప్ప దేశంలోని అనేక ప్రాంతాల్లో సగటు కంటే ఎక్కువ వర్షపాతం నమోదుకానుంది. మార్చిలో సాధారణ వర్షపాతం 29.9 మిల్లీమీటర్లకుగాను 33.7 మిల్లీమీటర్లు నమోదైంది. 1901 నుంచి ఇప్పటి వరకు మార్చిలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోద వడం ఇది 32వ సారి.
చివరిదశకు లానినా..
పసిఫిక్ మహాసముద్రంలో లానినా చివరిదశకు చేరుకుంది. కొద్దిరోజుల్లో తటస్థ పరిస్థితులకు చేరుకునే అవకాశం ఉందని అంతర్జాతీయ మోడల్స్ వెల్లడిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఏప్రిల్ నుంచి జూన్ వరకు తటస్థ పరిస్థితులు కొనసాగుతాయని, జూన్(నైరుతి రుతుపవనాల ప్రారంభం) నుంచే ఎల్‌నినో మొదలవుతుందని ఐఎండీ అంచనా వేసింది. జూన్ నుంచి ఆగస్టు వరకు ఎల్‌నినో బలపడడానికి 62 శాతం అవకాశాలు ఉన్నాయని, ఈ ఏడాది చివరి వరకు ఎల్‌నినో కొనసాగుతుందని పేర్కొంది.