ఆ రథం.. ఆరోగ్యానికి వరం!
ABN , Publish Date - May 18 , 2026 | 04:38 AM
ఆరోగ్య రథాలు ప్రజారోగ్యానికి వరంగా మారాయి..! మారుమూల గ్రామాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లి ప్రజలకు భరోసానిస్తున్నాయి.
ఏడాదిలో 1.04 కోట్ల మందికి వైద్య సేవలు
904 వాహనాలు.. 2.47 లక్షల క్యాంపులు
5.56 లక్షల మంది గర్భిణులకు ఉచిత వైద్యం
సంచార జాతుల చెంతకే నాణ్యమైన సేవలు
రోడ్డు సౌకర్యం లేకున్నా.. నడుచుకుంటూ తండాలకు
టెక్నాలజీ సాయంతో జీపీఎస్ ట్రాకింగ్, రోగుల వివరాలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఆరోగ్య రథాలు ప్రజారోగ్యానికి వరంగా మారాయి..! మారుమూల గ్రామాలతో పాటు గిరిజన ప్రాంతాల్లో కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్లి ప్రజలకు భరోసానిస్తున్నాయి. ఏడాది కాలంలోనే కోటి నాలుగు లక్షల మందికి ఉచిత వైద్య సేవలందించి ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య పరిరక్షణకు తోడ్పడుతున్నాయి. జ్వరం, దగ్గు, జలుబు, మలేరియా, డెంగీ వంటి సీజనల్ వ్యాధులతో పాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా బాసటగా నిలుస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం 104 వాహనాల పేరుతో గ్రామాల్లోకి వెళ్లి రావడం తప్ప చేసిందేమీ లేదు. నెలవారీగా కోట్ల రూపాయిల బిల్లులు తీసుకోవాలన్న ఆరాటమే తప్ప.. పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలన్న ఆలోచనే చేయలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 104 వాహనాలను ‘ఆరోగ్య రథాలు’గా మార్చింది. పీహెచ్‌సీ, సీహెచ్‌సీ స్థాయిలో వైద్య సేవలందించేలా వాటిని తీర్చిదిద్దింది. గతేడాది మేలో ప్రారంభమైన ఆరోగ్య రథాలు ఏడాది కాలంలోనే 1.04 కోట్ల మందికిపైగా ఉచిత వైద్య సేవలందించి రికార్డు నెలకొల్పాయి. గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో 2.47 లక్షల క్యాంపులు నిర్వహించాయి. వీటి పనితీరును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీలో ‘ఆరోగ్య రథాల సేవలు అద్భుతం’ అని కొనియాడింది. వాటి ద్వారా అందుతున్న సేవలను మిగతా రాష్ట్రాల్లోనూ పాటించాలని సూచించింది. దీంతో ఏపీ విధానాలను పరిశీలించేందుకు కొన్ని రాష్ట్రాలు మొగ్గు చూపుతున్నాయి.
సంచార జాతుల చెంతకు...
రాష్ట్రంలో సంచార జాతులను గుర్తించి, వారికి సంక్షేమ, ఇతర పథకాలు అమలు చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారుతోంది. అలాంటిది వారికి వైద్య సేవలు అందించడమంటే మరింత కష్టం. కానీ ఆరోగ్య రథాలు సంచార జాతులను గుర్తించి, వారి కోసం ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తున్నాయి. ఇప్పటి వరకూ సంచార జాతులకు చెందిన 2,18,081 లక్షల మందికి ఉచిత వైద్య సేవలందించాయి. ఆరోగ్యరథాల సిబ్బంది వాహనాలు వెళ్లలేని చోట.. కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్లి మరీ వైద్యం అందిస్తున్నారు. ముఖ్యంగా ఆరోగ్యరథాల వల్ల గర్భిణులకు ఉత్తమ సేవలందుతున్నాయి. ఇప్పటి వరకూ 5.56 లక్షల మంది వారు నివసిస్తున్న గ్రామాల్లోనే వైద్య సేవలు పొందారు.
చిన్నారి ప్రాణాలు కాపాడి...
విజయవాడ రూరల్ మండలం, రామవరప్పాడు గ్రామంలో ఆరోగ్య రథం సిబ్బంది ఒక చిన్నారి ప్రాణం కాపాడారు. గ్రామంలో ఓపీలు చూస్తున్న సమయంలో పక్కనే ప్రభుత్వ పాఠశాలలోని ఒక చిన్నారికి అకస్మాత్తుగా చాతీలో నొప్పి వచ్చి, శరీరం చల్లబడిపోయింది. టీచర్లు వెంటనే ఆ చిన్నారిని ఆరోగ్య రథం సిబ్బంది వద్దకు తీసుకువచ్చారు. వారు ఈసీజీ తీసి, ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం చిన్నారిని విజయవాడ బోధనాసుపత్రికి తరలించారు. ముందుగా ప్రాథమిక చికిత్స అందించడం వల్లే ఆ చిన్నారి ప్రాణాప్రాయం నుంచి బయటపడింది. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో ఫుడ్ పాయిజన్ కేసులకు కూడా ఆరోగ్య రథం సిబ్బంది ప్రాథమిక చికిత్స అందడం వల్లే అత్యవసర పరిస్థితుల్లోకి వెళ్లకుండా కాపాడారు. కాగా, ఆరోగ్య రథాల్లో వైద్య సేవలు బాగానే ఉన్నా.. కొంతమంది వైద్యులతో సమస్యలు తలెత్తుతున్నాయి. రాష్ట్రం లో 904 వాహనాలు నడుస్తున్నా.. 850 గ్రామాల్లోకే వైద్యులు వెళ్తున్నారు. ఆరోగ్య రథం ఉదయం 9 గంటలకల్లా గ్రామాల్లో ఉంటు న్నా వైద్యులు గంటన్నర ఆలస్యంగా వస్తున్నారు. ఈ సమస్య పరిష్కారం కావాలంటే నిర్వహణ సంస్థకే వైద్యుల బాధ్యత కూడా అప్పగించాలన్న డిమాండ్ వినిపిస్తోంది.
గ్రామీణ ఆరోగ్యానికి భరోసా మంత్రి సత్యకుమార్
ఆరోగ్యరథాలు గ్రామీణ ఆరోగ్యానికి భరోసాగా నిలుస్తున్నాయని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. వీటి ద్వారా ఇప్పటి వరకూ రికార్డు స్థాయిలో 1.04 కోట్ల మందికి నాణ్యమైన వైద్యం అందించామని, 5.56 లక్షల మంది గర్భిణులు వైద్య సేవలు పొందారని చెప్పారు. వైద్యం కోసం ప్రజలు చేసే ఖర్చు తగ్గించాలనే ఉద్దేశంతో వీటిని మెరుగుపరిచామన్నారు. త్వరలో ఆరోగ్యరథాల్లో 47రకాల వైద్య పరీక్షలను అందుబాటులోకి తెస్తామన్నారు.