Share News

ఆరోగ్య రథాల్లో 47 రకాల వైద్య పరీక్షలు

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:35 AM

ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా రోగాల ముందస్తు నివారణకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు.

ఆరోగ్య రథాల్లో 47 రకాల వైద్య పరీక్షలు

  • ఏడాదికి 56.40 లక్షల మందికి పరీక్షలు: మంత్రి సత్యకుమార్‌

అమరావతి, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా రోగాల ముందస్తు నివారణకు ప్రాధాన్యతనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి గ్రామానికీ వెళ్తున్న 104 ఆరోగ్యరథాల్లో 47 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. సుమారు రూ.162.72 కోట్ల వ్యయంతో ప్రతి వ్యక్తికీ 47 రకాల వైద్య పరీక్షలు చేపట్టే పథకానికి బుధవారం ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు. ఏడాదికి 56.40 లక్షల మందికి ఈ వైద్య పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఇప్పటి వరకూ 104 ఆరోగ్యరథాల ద్వారా గ్రామస్థాయిలో 15 రోజులకొకసారి 6 రకాల పరీక్షలు మాత్రమే జరుగుతున్నాయని అన్నారు. ఇకపై 47 రకాల పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ సమగ్ర వైద్య పరీక్షల ఫలితాల ఆధారంగా పౌరుల ఆరోగ్య స్థితికి సంబంధించిన వ్యక్తిగత స్థాయిలో డీసీజ్‌ ప్రొఫైల్‌, ఎలకా్ట్రనిక్‌ హెల్త్‌ రికార్డులు రూపొందించి సంజీవని పథకం కింద ఆయా వ్యక్తులకు ప్రస్తుతం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మున్ముందు రోగాల నివారణకు చేపట్టాల్సిన విషయాలపై సూచనలు అందించవచ్చన్నారు.

38 మంది వైద్యుల నియామకం

జాతీయ ఆరోగ్య మిషన్‌ కింద 38 పీడియాట్రిక్స్‌, జనరల్‌ మెడిసిన్‌ వైద్యల పోస్టులను ఆరోగ్యశాఖ భర్తీ చేసింది. బోధన, జిల్లా ఆస్పత్రులు, డిస్ట్రిక్ట్‌ ఎర్లీ ఇంటర్వెన్షన్‌ కేర్‌ సెంటర్ల అవసరాల కోసం ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేసేందుకు ఆరోగ్యశాఖకు చెందిన నియామక సంస్థ నోటిఫికేషన్‌ జారీ చేసింది. వాక్‌-ఇన్‌ ఇంటర్వ్యూలకు 88 మంది హాజరయ్యారు. వీరిలో 38 మందిని అధికారులు ఎంపిక చేశారు. వీరికి త్వరలో ఆరోగ్యశాఖ అధికారులు పోస్టింగ్‌ ఇవ్వనన్నారు. ఎంపికైన వైద్యులకు నెలకు రూ.1.10 లక్షల వేతనం అందిస్తారు. గిరిజన ప్రాంతాల్లో పని చేసేవారికి నెలకు రూ.1.40 లక్షల వరకూ ఇవ్వనున్నారు.

Updated Date - Apr 30 , 2026 | 03:35 AM