Share News

‘షరతు’ పట్టా భూములకూ విముక్తి

ABN , Publish Date - Apr 29 , 2026 | 04:51 AM

కీలక భూముల నిషేధ విముక్తికి ప్రభుత్వ చర్యలు ఊపందుకున్నాయి. ఇటీవల గ్రామ సర్వీసు ఇనాం భూములను ఫ్రీహోల్డ్‌ చేస్తూ ఆదేశాలిచ్చిన రెవెన్యూ శాఖ..

‘షరతు’ పట్టా భూములకూ విముక్తి

  • 15 జిల్లాల్లో 33,012 ఎకరాల ఫ్రీహోల్డ్‌కు అనుమతి

  • వాటిపై నిషేధం తొలగించాలి

  • రైతులకు శాశ్వత హక్కులు కల్పించాలి

  • క్రయవిక్రయాలపై ఆంక్షలు తీసేయాలి

  • సీసీఎల్‌ఏకు సీఎస్‌ సాయిప్రసాద్‌ ఆదేశాలు

అమరావతి, ఏప్రిల్‌ 28 (ఆంధ్రజ్యోతి): కీలక భూముల నిషేధ విముక్తికి ప్రభుత్వ చర్యలు ఊపందుకున్నాయి. ఇటీవల గ్రామ సర్వీసు ఇనాం భూములను ఫ్రీహోల్డ్‌ చేస్తూ ఆదేశాలిచ్చిన రెవెన్యూ శాఖ.. తాజాగా షరతుగల పట్టా (కండిషనల్‌ పట్టా) భూములను కూడా ఫ్రీహోల్డ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలోని 15 జిల్లాల పరిధిలో 33,440.62 ఎకరాల షరతుగల పట్టా భూములున్నాయి. వాటిలో 33,012.35 ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేయాలని రెవెన్యూ శాఖ బాధ్యతలు కూడా చూస్తున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు (మిగతా 428.27 ఎకరాలు ఫ్రీహోల్డ్‌ పరిధిలోకి రావు). ఈ మేరకు చర్యలు తీసుకోవాలని.. ఆ భూములపై ఉన్న నిషేధం తొలగించేలా, వాటిపై రైతులకు శాశ్వత యాజమాన్య హక్కులు వచ్చేలా రికార్డుల్లో మార్పులు చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్‌ (సీసీఎల్‌ఏ)ను నిర్దేశిస్తూ సర్క్యులర్‌ జారీ చేశారు. నిజానికి ఈ భూములను 2024 ఆగస్టు నుంచి నిషేధ జాబితా 22ఏలో చేర్చారు. వాటి క్రయవిక్రయాలను నిషేధించారు. అసైన్డ్‌ భూములతోపాటు వీటిపై ఉన్న ఫ్రీహోల్డ్‌ ఉత్తర్వులను నిలిపివేశారు. తాజాగా నిషేధం తొలగించి తిరిగి ఫ్రీహోల్డ్‌ చేయాలని, క్రయ, విక్రయాలకు ఆస్కారం కల్పించాలని పేర్కొన్నారు.


నిజానికి 2022లోనే షరతుగల పట్టా భూములపై రైతులకు శాశ్వత హక్కులు కల్పిస్తూ ఉత్తర్వులు(జీవో 667) విడుదలయ్యాయి. అసైన్డ్‌ భూములతోపాటు వీటిని కూడా ఫ్రీహోల్డ్‌ చేస్తూ 2023 డి సెంబరులో ప్రభుత్వం జీవో 596 జారీచేసింది. అయితే భూముల ఫ్రీహోల్డ్‌లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయి. కూటమి ప్రభుత్వం రాగానే.. ఆ భూముల రిజిస్ట్రేషన్‌ను నిలిపివేసింది. అక్రమాలపై విచారణ జరిపింది. అక్రమాల జాబితాలో షరతుగల పట్టా భూములు లేవని అధికారులు గుర్తించారు. ఈ భూములకు విముక్తి కల్పించాలని ఈనెల 8న ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో నిర్ణయించారు. 33,012.35 ఎకరాలను ఫ్రీహోల్డ్‌ చేయాలని సీఎస్‌ ఆదేశాలిచ్చారు. ఈ నేపథ్యంలో ఈ భూములను ఇకపై నిషేధ జాబితాలో కొనసాగించరు. పట్టాలున్న రైతులకే శాశ్వత హక్కులు ఉంటాయి. ఇందుకు నిబంధనల్లో మార్పులు చేయాలి. ఈ భూముల లావాదేవీలు, రిజిస్ట్రేషన్లపై ఎలాంటి ఆంక్షలు, అడ్డంకులూ సృష్టించవద్దని సాయిప్రసాద్‌ ఆదేశించారు.

Updated Date - Apr 29 , 2026 | 04:54 AM