ఏపీ గ్రామీణ బ్యాంకు నికర లాభం రూ.1836 కోట్లు
ABN , Publish Date - May 03 , 2026 | 04:55 AM
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రూ.1836 కోట్ల నిఖరలాభంలో పయనిస్తున్నట్టు బ్యాంకు చైర్మన్ కె.ప్రమోద్‌కుమార్‌రెడ్డి తెలిపారు.
1.30 కోట్ల కస్టమర్లు, 1359 శాఖలతో రెండో అతి పెద్ద బ్యాంకు
త్వరలో అమరావతి నుంచి కార్యకలాపాలు: చైర్మన్ ప్రమోద్‌కుమార్‌రెడ్డి
గుంటూరు, మే 2 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు 2025-26 ఆర్ధిక సంవత్సరంలో రూ.1836 కోట్ల నిఖరలాభంలో పయనిస్తున్నట్టు బ్యాంకు చైర్మన్ కె.ప్రమోద్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఏపీ గ్రామీణ బ్యాంకుగా ఆవిర్భవించిన తర్వాత మొదటి వార్షికోత్సవం సందర్భంగా గుంటూరులోని బ్యాంకు ప్రధాన కార్యాలయంలో శనివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వ్యాపార లావాదేవీలు, బ్యాంకు ప్రాధాన్యత అంశాలను వివరించారు. నాలుగు గ్రామీణ బ్యాంకుల విలీనం తర్వాత ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద బ్యాంకుగా అవతరించిందన్నారు. అటు కేంద్ర ప్రభుత్వ పరిధిలో చూసినా దేశవ్యాప్తంగా 28 రీజనల్ రూరల్ బ్యాంక్స్‌లో ఉత్తరప్రదేశ్ గ్రామీణ బ్యాంకు తర్వాత ఏపీ గ్రామీణ బ్యాంకు రెండో అతి పెద్ద బ్యాంకుగా ఉందన్నారు. రాష్ట్రంలో 1359 శాఖలతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు.. బ్యాంక్ ఆఫ్ ఇండియా తర్వాత రెండో అతి పెద్ద నెట్ వర్క్ సంస్థగా అవతరించిందన్నారు. బ్యాంకుకు దాదాపు 1.30 కోట్ల కస్టమర్లు ఉన్నారని, అంటే ప్రతి నలుగురు వ్యక్తుల్లో ఒకరికి బ్యాంకు ద్వారా సేవలు అందిస్తున్నామన్నారు.
ప్రతి నెలలో, ప్రతి క్వార్టర్‌లో కూడా అభివృద్ధిని సాధిస్తూ మంచి ఫలితాలు సాధించినట్లు తెలిపారు. గత ఆర్ధిక సంవత్సరంలో సుమారు రూ.లక్షా 36 వేల కోట్ల వ్యాపారలావాదేవీలు జరిపినట్టు వెల్లడించారు. తద్వారా బ్యాంకు రూ.1836 కోట్ల నిఖర లాభం సాధించిందని వివరించారు. దేశవ్యాప్తంగా 28 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో అత్యధిక లాభం కలిగిన బ్యాంకుగా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు నిలిచిందని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో వివిధ వర్గాలకు సంబంధించి ప్రాధాన్య రంగాలకు 92 శాతం రుణాలను మంజూరు చేశామని చెప్పారు. రాజధాని అమరావతి నుంచి త్వరలోనే బ్యాంకు కార్యకలాపాలు ప్రారంభిస్తామని, ఇప్పటికే కార్యాలయ నిర్మాణానికి అమరావతిలో భూమి కేటాయించారని ప్రమోద్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రెండు, మూడు నెలల్లో నిర్మాణ పనులు చేపడతామని తెలిపారు. ఈ సమావేశంలో విజిలెన్స్ ఇన్‌ఛార్జ్ బి.హరీష్ బేతా, జనరల్ మేనేజర్ ఎస్‌ఆర్ రఘునాథరెడ్డి పాల్గొన్నారు.