ట్రెండింగ్‌లో సర్కారు బడి!
ABN , Publish Date - May 02 , 2026 | 04:01 AM
టెన్త్ ఫలితాల్లో బెస్ట్...పనితీరులో ఫస్ట్... వీరే మా టాపర్లు!... ఇది కార్పొరేట్ విద్యా సంస్థల ప్రకటన అనుకుంటున్నారా? కానే కాదు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల మార్కులు...
టెన్త్ ఫలితాల్లో సత్తా.. ప్రశంసిస్తూ పత్రికల్లో ప్రభుత్వం ప్రకటన.. కొత్త ఒరవడి సూపర్ హిట్
కార్పొరేట్ తరహాలో.. మా టాపర్లంటూ ఫొటోలు
అధికారిక ప్రకటనపై సర్వత్రా సానుకూల స్పందన
ప్రభుత్వ స్కూళ్లకు ఊతమిచ్చేలా చర్యలు
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘టెన్త్ ఫలితాల్లో బెస్ట్...పనితీరులో ఫస్ట్... వీరే మా టాపర్లు!... ఇది కార్పొరేట్ విద్యా సంస్థల ప్రకటన అనుకుంటున్నారా? కానే కాదు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థుల మార్కులు, వారి ఫొటోలతో ప్రభుత్వం అధికారికంగా పత్రికలకు ఇచ్చిన ప్రకటన ఇది. శుక్రవారం ఉదయం లేచి దినపత్రికలు చూసినవారిలో చాలా మంది ఈ యాడ్ చూసి ఆశ్చర్యపోయారు. దశాబ్దాలుగా పదోతరగతి ఫలితాల మరుసటి రోజున కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు వారి విద్యార్థుల ఫలితాలతో ఊదరగొట్టడమే చూసినవారికి, ఇది కొత్త ట్రెండ్‌లా అనిపించింది. శుక్రవారం సోషల్ మీడియాలో ఇది ఒక ప్రధాన చర్చగా సాగింది. కార్పొరేట్ తరహాలో, ప్రభు త్వం ‘వీరే మా టాపర్లు’ అని ప్రకటించుకోవడం గత ంలో జరగలేదు. కూటమి ప్రభుత్వం తొలిసారి అధికారికంగా ప్రకటనలు ఇచ్చింది. 596 మార్కులు సాధించిన నలుగురు విద్యార్థులు, 595 మార్కులు సాధించిన తొమ్మిది మంది విద్యార్థులతో ‘సగర్వంగా నిల‘బడి’ పేరుతో ఇచ్చిన ప్రకటన సర్వత్రా చర్చనీయాం శం అయ్యింది. ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం కనిపించకుండా ముఖ్యమంత్రి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి ఫొటోలు కూడా వేయకుండా కేవలం విద్యార్థులతో మాత్రమే ప్రకటన ఇవ్వడంపై సానుకూలత వ్యక్తమౌతోంది. విద్యార్థుల్లోనూ ఈ ట్రెండ్ ఫుల్ జోష్ నింపింది. తమ పిల్లలను ప్రభు త్వం ప్రమోట్ చేయడం పట్ల తల్లిదండ్రులూ ఆనందం వ్యక్తంచేస్తున్నారు.
కార్పొరేట్‌తో పోటాపోటీ
పదోతరగతి ఫలితాల్లో ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివిన విద్యార్థులు... కార్పొరేట్ విద్యార్థులతో పోటాపోటీగా మార్కులు సాధించారు. స్టేట్ టాపర్‌కు 599 మార్కులు రాగా, ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థులు 596 మార్కులు సాధించారు. కార్పొరేట్ కంటే కేవలం మూడు మార్కులే వ్యత్యాసం. ప్రభుత్వ బడుల్లో 570, 580 మార్కులు వస్తేనే గొప్ప అనే స్థాయిని దాటి దాదాపుగా స్టేట్ టాప్ మార్కుల వరకూ చేరుకున్నారు. పేద విద్యార్థుల ప్రతిభ చూస్తుంటే భవిష్యత్తులో వీరే స్టేట్ టాపర్ అయినా ఆశ్చర్యం లేదన్న స్థాయిలో రాణిస్తున్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలల్లోనూ ప్రభుత్వ స్కూళ్లు వందల సంఖ్యలో ఉండటం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా 604 ప్రభుత్వ మేనేజ్‌మెంట్ పాఠశాలలు వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.
అంతటా సానుకూల స్పందన
అధికారికంగా ప్రభుత్వం ప్రకటనలు ఇవ్వడంపై అంతటా సానుకూల స్పందన వస్తోంది. ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థుల ఫొటోలతో ప్రకటనలు ఇవ్వడం తొలుత ఆశ్చర్యానికి గురిచేసినా...ఇది ఒక మంచి పరిణామం అనే ప్రశంసలు వస్తున్నాయి. ప్రభుత్వ బడులపై తల్లిదండ్రులకు నమ్మకం పెరిగేందుకు ఊతమిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ స్కూల్ విద్యార్థినికి సీఎం అభినందనలు
పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 600కు 597 మార్కులు సాధించిన కృష్ణా జిల్లా చల్లపల్లి ఎన్టీఆర్ హైస్కూల్ విద్యార్థిని దుత్త నిత్యశ్రీకి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ఎన్టీఆర్ హైస్కూల్ పదో తరగతి ఫలితాల్లో 98ు ఉత్తీర్ణత సాధించడానికి కారణమైన ఉపాధ్యాయులు, సిబ్బందికి, ఎన్టీఆర్ స్కూల్ ద్వారా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరికి సీఎం అభినందనలు తెలిపారు.
ప్రభుత్వ సంస్కరణలతో అద్భుత ఫలితాలు: పవన్
పదో తరగతిలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులందరికీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం ఉత్తీర్ణత 4 శాతానికిపైగా పెరగడం.. కూటమి ప్రభుత్వం విద్యా శాఖలో తీసుకొచ్చిన సంస్కరణలకు నిదర్శనమని కొనియాడారు. విద్యాశాఖ మంత్రి లోకేశ్ అమలు చేస్తున్న ప్రణాళికలు ప్రశంసనీయమని అన్నారు. ఈ అద్భుత విజయం వెనుక ఉన్న ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులకు అభినందనలు తెలిపారు.
పవన్‌కు లోకేశ్ ధన్యవాదాలు
పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల అభినందనలు తెలిపిన ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు మంత్రి లోకేశ్ ఎక్స్ ద్వారా ధన్యవాదాలు తెలిపారు. ‘పవన్ అన్నా... ఇది మన ఉమ్మడి విజయం. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యా శాఖ, ప్రభుత్వ ఉమ్మడి కృషి ఉంది. మీ అందరి ప్రోత్సాహంతో రాష్ట్ర విద్యారంగాన్ని నేను దేశంలో రోల్ మోడల్‌గా నిలుపుతాను’ అని లోకేశ్ పేర్కొన్నారు.
వీరే టాపర్లు
దుల్ల చిన్నారి- 596 మార్కులు, సిరిగినీడి రిషిత లక్ష్మీ నిహారిక- 596, బవిరెడ్డి దివ్య తేజశ్రీ- 596, తనకంటి సాయిశ్రీ- 596, ఎస్. దిషిత సాయి- 595, నంద్యాల కార్తీక- 595, పత్రి హర్షిణి- 595, ఆర్‌డి వైష్ణవి- 595, కోల లక్ష్మీ వెంకటేశ్వర్- 595, గాలిదేవర హర్షిణి సత్యదుర్గ- 595, కొర్రకూటి యశ్విత- 595, వేగిరాజు కావ్య హాసిని- 595, మహమ్మద్ ఏ ఫర్హీన్- 595, పల్లా వెంకటసాయి అపర్ణ- 594, సీరపు దేవిప్రియ- 594, గొర్లె సాద్విక- 594, ఉమ్మడిశెట్టి పవన్‌సాయి- 594, దాడి భాను క్రాంతి- 594, ఈలిశెట్టి ఉమాపార్వతి- 594, గణితాల సాయి పూజిత- 594, సైపిరెడ్డి స్వాతి- 594, చెరుకూరి కరీన- 594.
‘మీ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించండి’
ప్రభుత్వ పాఠశాలలకు ఊతమిచ్చేలా తాజా ప్రకటనలో ప్రభుత్వం తల్లిదండ్రులకు పిలుపునిచ్చారు. ‘మీ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించాల’ని కోరింది. పాఠశాల స్థాయిల్లో పిల్లల్ని ప్రభుత్వ బడులకు పంపండి అంటూ గత కొంతకాలంగా ప్రభుత్వ టీచర్లు ప్రచారం చేస్తున్నారు. కానీ ప్రభుత్వమే స్వయంగా అధికారికంగా ప్రకటన రూపంలో ఇలా పిలుపునివ్వడం ఇదే తొలిసారి. కాగా గత రెండేళ్లుగా పాఠశాల విద్యాశాఖ అమలుచేస్తున్న వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక ఇలా ఉత్తమ ఫలితాలు సాధించడానికి దోహదం చేసింది. పరీక్షల ప్రారంభానికి వంద రోజుల ముందు నుంచి ఈ ప్రణాళిక అమలుచేశారు. ప్రతిరోజూ విద్యార్థులకు స్లిప్ టెస్ట్‌లు, పరీక్షలకు ముందు గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నారు. విద్యార్థుల్లో చదివే వారిని, వెనకబడిన విద్యార్థులను గుర్తించి వారి సామర్థ్యాలకు అనుగుణంగా బోధించడం మంచి ఫలితాలను ఇస్తోంది.