Share News

డ్రగ్స్‌ వద్దు బ్రో..!

ABN , Publish Date - Jun 27 , 2026 | 04:37 AM

మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అటు డ్రగ్స్‌ రవాణాను కట్టడి చేయడంతో పాటు..

డ్రగ్స్‌ వద్దు బ్రో..!

  • ఆరోగ్యం నాశనం, కుటుంబాలూ విచ్ఛిన్నం

  • మాదకద్రవ్యాలపై సమష్టిగా పోరాడుదాం

  • విస్తృతమైన ప్రచారంతో మహమ్మారి

  • నుంచి యువతను కాపాడుకుందాం

  • దీనికి ప్రజలంతా సహకరించాలి

  • సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ పిలుపు

అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. అటు డ్రగ్స్‌ రవాణాను కట్టడి చేయడంతో పాటు.. ఇటు మత్తు పదార్థాల వినియోగం వలన కలిగే దుష్పరిణామాలపై విస్తృత ప్రచారం చేస్తోంది. ‘డ్రగ్స్‌ వద్దు బ్రో..’ అంటూ యువత, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ‘ఎక్స్‌’ వేదికగా స్పందించారు. డ్రగ్స్‌ అక్రమ రవాణాపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ‘డ్రగ్స్‌ వద్దు బ్రో’ ప్రచారానికి ప్రజలంతా సహకరించాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు. నిశ్శబ్దంగా ఆరోగ్యాన్ని నాశనం చేయడంతో పాటు కుటుంబాలనూ విచ్ఛిన్నం చేసే డ్రగ్స్‌పై సమష్టిగా పోరాడుదామని, మన యువతను కాపాడుకుందామని డిప్యూటీ సీఎం ప్రజలకు పిలుపునిచ్చారు. డ్రగ్స్‌పై పోరాటం అంటే యువత భవిష్యత్తును కాపాడడమేనని సీఎం చంద్రబాబు తన ఎక్స్‌ పోస్టులో అన్నారు. డ్రగ్స్‌ అక్రమ రవాణాదారులను చట్టం ముందు నిలబెడతామని స్పష్టం చేశారు. అదే సమయంలో డ్రగ్స్‌ మహమ్మారి బారిన పడ్డ వారికి అన్నివిధాలా సహాయం అందించి సాధారణ జీవితంలోకి తీసుకువస్తామని, వారికి గౌరవప్రదమైన పునరావాసం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్‌కు చోటు లేదన్నారు.


డ్రగ్స్‌ రహిత సమాజమే లక్ష్యం: పవన్‌

మాదకద్రవ్యాలు వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని, మన సమాజ పునాదులను బలహీనపరచగల ఒక తీవ్రమైన సామాజిక సవాల్‌ అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. యువత క్రమశిక్షణ, గౌరవం, అర్థవంతమైన జీవితం వైపు నడిచేలా మార్గనిర్దేశం చేసే మాదకద్రవ్యాల రహిత సమాజాన్ని నిర్మించే ప్రయత్నాలకు తన మద్దతును పునరుద్ఘాటిస్తున్నట్లు తెలిపారు. విద్య, క్రీడలు, సాంస్కృతిక విలువలు, నైపుణ్యాభివృద్ధి అవకాశాల ద్వారా వారిని సరైన దిశలో నడిపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. డ్రగ్స్‌ మహమ్మారిపై అవగాహన, నివారణ, పునరావాసం, కఠినమైన చర్యలను బలోపేతం చేయడానికి ఎన్డీయే ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సంస్థలు అందరూ డ్రగ్స్‌ వలన కలిగే దుష్ప్రభావాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ డ్రగ్స్‌ ముప్పు నుంచి యువతను కాపాడేందుకు సమష్టిగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

Updated Date - Jun 27 , 2026 | 04:38 AM