వోల్ట్‌సన్ ల్యాబ్స్‌కు అదనంగా 4.82 ఎకరాలు
ABN , Publish Date - Jun 27 , 2026 | 04:47 AM
నాయుడుపేట ఎంపీసెజ్‌లో వోల్ట్‌సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అదనంగా 4.82 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
అమరావతి, జూన్ 26(ఆంధ్రజ్యోతి): నాయుడుపేట ఎంపీసెజ్‌లో వోల్ట్‌సన్ ల్యాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు అదనంగా 4.82 ఎకరాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ సంస్థ రెండు దశల్లో ఏర్పాటు చేయనున్న గ్రీన్‌ఫీల్డ్ సోలార్ సెల్, మాడ్యూల్ ఉత్పాదక కేంద్రం కోసం ఇంతకు ముందు కేటాయించిన 37 ఎకరాల భూమిని ఆనుకుని అదనంగా ఈ భూమిని కేటాయించింది. ఆ పారిశ్రామిక సంస్థ ప్రాజెక్టు స్థిర మూలధన పెట్టుబడిని సవరించిన దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి విధానం (4.0) ప్రకారం వోల్ట్‌సన్ ల్యాబ్స్‌కు సవరించిన ప్రత్యేక ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర పరిశ్రమలశాఖ కార్యదర్శి డాక్టర్ ఎన్.యువరాజ్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. వోల్ట్‌సన్ సంస్థ రూ. 1,743 కోట్ల పెట్టుబడితో నాయుడుపేట ఎంపీసెజ్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ సోలార్ మాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ సెంటర్‌ను స్థాపించి 415 మందికి ఉపాధి కల్పిస్తామని ప్రతిపాదనలు సమర్పించింది. దీంతో ఎస్‌ఐపీసీ, ఎస్‌ఐపీబీ సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఆ సెజ్‌లో ఎకరా రూ. 60 లక్షల చొప్పున 37 ఎకరాల భూమిని కేటాయించింది. తర్వాత అదే ధరకు మరో 5 ఎకరాల భూమిని కేటాయించాలంటూ సంస్థ కోరింది. ప్రాజెక్టును 2028 మార్చి నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం 4.82 ఎకరాల భూమిని గతంలో నిర్ణయించిన ధరకే కేటాయించింది.