ఏరియా ఆస్పత్రుల్లో.. 13 ప్రజారోగ్య లేబొరేటరీలు
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:43 AM
రాష్ట్రంలో కొత్తగా రూ.16.25 కోట్లతో 13 ప్రజారోగ్య లేబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మంగళవారం తెలిపారు.
రూ.16.25 కోట్లతో ఏర్పాటు
ప్రతి ల్యాబ్‌లో 134 రకాల పరీక్షలు: మంత్రి సత్యకుమార్
అమరావతి, జనవరి 27(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా రూ.16.25 కోట్లతో 13 ప్రజారోగ్య లేబొరేటరీలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ మంగళవారం తెలిపారు. వైద్య సేవలను గ్రామీణ ప్రాంతాలకు మరింత చేరువ చేసేందుకు ఏర్పాటవుతున్న ఈ లేబొరేటరీలు ఏప్రిల్ నాటికి వినియోగంలోకి వస్తాయన్నారు. సంక్రమిత, అసంక్రమిత కేటగిరీలకు సంబంధించిన మొత్తం 134 రకాల పరీక్షలు ఈ లేబొరేటరీల్లో జరుగుతాయన్నారు. స్థానిక ఆస్పత్రులకు వచ్చే రోగులకే కాకుండా ఇతర పీహెచ్‌సీలు, ఆస్పత్రుల నుంచి వచ్చే రోగులను ఇక్కడికి రిఫర్ చేస్తారన్నారు. వైద్య ఆరోగ్యశాఖతోపాటు పశు సంవర్థక శాఖ, నీటి పారుదల, పర్యావరణ, ఆటవీ, ఇతర శాఖలతో సమన్వయానికి ఈ లేబొరేటరీలు ఉపయోగపడతాయని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట, అనంతపురం జిల్లా గుంతకల్లు, చిత్తూరు జిల్లా పలమనేరు, అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు, పల్నాడు జిల్లా నరసరావుపేట, విశాఖ జిల్లా అగనంపూడి, నంద్యాల జిల్లా బనగానపల్లి, బాపట్ల జిల్లా చీరాల, ఎన్టీఆర్ జిల్లా నందిగామ, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రుల్లో ఈ లేబొరేటరీల నిర్మాణాలు దాదాపు పూర్తయ్యాయని చెప్పారు. కాకినాడ జిల్లా తుని, నెల్లూరు జిల్లా గూడూరు, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఆస్పత్రుల్లో ల్యాబ్స్ నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. పీఎం అభిమ్ కింద ఒక లేబొరేటరీ నిర్మాణం, పరికరాల ఏర్పాటుకు కలిపి రూ.1.2 కోట్ల చొప్పున 13 లేబొరేటరీలకు మొత్తం రూ.16.25 కోట్లను కూటమి ప్రభుత్వం ఖర్చు పెడుతోందని తెలిపారు.