Share News

ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి

ABN , Publish Date - Jun 18 , 2026 | 04:42 AM

రొయ్యల దాణా ధరల విషయంలో వాస్తవ అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని, అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని మత్స్యశాఖ కమిషనర్‌ రాంశంకర్‌నాయక్‌ ఆక్వా రైతులను కోరారు.

ఆక్వా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి

  • దాణా ధరలపై అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దు: మత్స్యశాఖ

అమరావతి, జూన్‌ 17(ఆంధ్రజ్యోతి): రొయ్యల దాణా ధరల విషయంలో వాస్తవ అధికారిక సమాచారాన్నే విశ్వసించాలని, అవాస్తవ ప్రచారాన్ని నమ్మొద్దని మత్స్యశాఖ కమిషనర్‌ రాంశంకర్‌నాయక్‌ ఆక్వా రైతులను కోరారు. ఆక్వా రంగ స్ధిరాభివృద్ధికి, రొయ్యల రైతుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని స్పష్టం చేశారు. దాణా ధరలు పరిమిత స్థాయిలో పెంపును రైతు సంఘాలు అంగీకరించగా, దాణా ఉత్పత్తి వ్యయాలను దృష్టిలో పెట్టుకుని, అధిక ధరల సవరణను తయారీ సంస్థలు ప్రతిపాదించాయని, దీనిపై ప్రభుత్వం మధ్యవర్తి పాత్ర పోషిస్తూ, రైతుల ప్రయోజనాలను పరిరక్షించే చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. దాణా ధరలు, ఇతర ఆక్వా సంబంధిత అంశాలపై రైతులకు సందేహాలు ఉంటే మత్స్యశాఖ అధికారులను సంప్రదించాలన్నారు. ధరల నిర్ణయంలో పారదర్శకత, శాస్త్రీయ విశ్లేషణ, నిరంతర పర్యవేక్షణకు ప్రభుత్వం ఏపీ ష్రింప్‌ ఫీడ్‌ ఇన్‌గ్రిడియెంట్స్‌ ప్రైస్‌ మానిటరింగ్‌ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. దీనివల్ల త్వరలోనే ఈ రంగానికి అనుకూలమైన నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందన్నారు. ఆక్వా రంగానికి దేశంలోనే అత్యల్ప విద్యుత్‌ టారీ్‌ఫలతో యూనిట్‌ విద్యుత్‌కు రూపాయిన్నర రాయితీ అందిస్తూ, రొయ్యల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించి, రైతుల ఆదాయం పెంపుదలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని బుధవారం ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు.

Updated Date - Jun 18 , 2026 | 04:43 AM