మత్స్యకారులకు అండగా కూటమి ప్రభుత్వం
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:56 AM
రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం, మత్స్య సహకార సంఘాల పటిష్టతకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
మత్స్య సంఘాల బలోపేతానికి చర్యలు: అచ్చెన్న
అమరావతి/విజయవాడ అర్బన్, జనవరి 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమం, మత్స్య సహకార సంఘాల పటిష్టతకు కూటమి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర మత్స్య సహకార సంఘాల సమాఖ్య(ఆ్‌ఫకాఫ్) చైర్మన్‌గా యాటగిరి రాంప్రసాద్, వైస్‌చైర్మన్ బి.రంగారావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ఎస్.సవిత పాల్గొన్నారు. ‘మత్స్యకారులకు పెండింగ్‌లో ఉన్న నష్ట పరిహారాలను సీఎం చంద్రబాబు ఇప్పటికే విడుదల చేశారు. వచ్చే మూడేళ్లలో మత్స్యకారుల ఆదాయం గణనీయంగా పెరగాలి. ఆక్వా రంగంలో రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేయాలి’ అని అచ్చెన్నాయుడు అన్నారు. మంత్రి రవీంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతి మత్స్యకారుడిని పారిశ్రామికవేత్తగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. మంత్రి సవిత మాట్లాడుతూ చేపల పెంపకం, విక్రయాల్లో మహిళలకు 60ు సబ్సిడీ ఇస్తున్నామని చెప్పారు. మత్స్యకారులంతా కూటమి ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. ప్రభుత్వ విప్ మాధవీరెడ్డి, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాపారావు, బెస్త కార్పొరేషన్ చైర్మన్ శ్రీధర్, మత్స్యకార సంఘ రాష్ట్ర అధ్యక్షుడు అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆయిల్‌పామ్ రైతులకు నికరాదాయం: అచ్చెన్న
ఆయిల్‌పామ్ రైతులకు స్థిరమైన ఆదాయం వచ్చేలా కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని వ్యవసాయ, ఉద్యానశాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. భవిష్యత్ అవసరాలకుగాను 30 నర్సరీలు, 3సీడ్ గార్డెన్లు అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. గుంటూరు నుంచి వడ్డేశ్వరంలోని ప్రైమ్ హిల్ క్రస్ట్ భవనంలోకి మార్చిన రాష్ట్ర ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ డైరెక్టర్ కార్యాలయాన్ని గురువారం మంత్రి అచ్చెన్న ప్రారంభించి మాట్లాడారు.