ప్రభుత్వ బడులకు జోష్
ABN , Publish Date - May 19 , 2026 | 04:32 AM
ప్రభుత్వ పాఠశాలలకు అడ్మిషన్లు పోటెత్తుతున్నాయి. సర్కారీ బడుల్లో సాధించిన పదో తరగతి ఫలితాలపై..
భారీగా పెరుగుతున్న విద్యార్థుల అడ్మిషన్లు
ప్రైవేటు పాఠశాలల నుంచి సర్కారీ బాట
నాలుగు రోజుల్లోనే 14,800 కొత్త చేరికలు
ఫలిస్తున్న కూటమి ప్రభుత్వం చర్యలు
‘పది’లో ప్రభుత్వ విద్యార్థుల సత్తాపై చర్చ
మెగా డీఎస్సీ, పలు సంస్కరణలతో ఊపు
కొత్త అడ్మిషన్లు 10 శాతం పెంచడం లక్ష్యం
వైవిధ్యంగా ‘బడి పిలుస్తోంది’ ప్రచారం
ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ల జోష్ కనిపిస్తోంది. సర్కారీ బడుల్లో ఏం చెబుతారులే..! అని పిల్లల తల్లిదండ్రుల్లో నాటుకుపోయిన భావనలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. ఇటీవల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టెన్త్ ఫలితాల్లో సత్తా చాటడం, కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీతో వేల సంఖ్యలో టీచర్ల భర్తీ, ఇతర సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. దీంతో ఇప్పటి వరకూ ప్రైవేటు బడుల వైపు వెళ్తున్న తల్లిదండ్రులు ఇప్పుడు మనసు మార్చుకుంటున్నారు. తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అమరావతి, మే 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలకు అడ్మిషన్లు పోటెత్తుతున్నాయి. సర్కారీ బడుల్లో సాధించిన పదో తరగతి ఫలితాలపై.. కూటమి ప్రభుత్వం జారీచేసిన వైవిధ్యమైన అధికారిక ప్రకటనలు సర్వత్రా చర్చనీయాంశం అయ్యాయి. ఇది విద్యార్థుల తల్లిదండ్రులను విపరీతంగా ఆకర్షిస్తోంది. అడ్మిషన్లలో ప్రతిబింబిస్తోంది. నాలుగు రోజుల కిందట ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల నమోదును ప్రారంభించగా.. 14,800 కొత్త అడ్మిషన్లు వచ్చాయి. కాకినాడ జిల్లాలో అత్యధికంగా 2600 మంది, తూర్పుగోదావరి జిల్లాలో 1100 మంది ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. వీరిలో ఎక్కువ మంది ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ బడుల్లోకి మారినట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన జిల్లాల్లోనూ వందల సంఖ్యలో విద్యార్థులు ‘ప్రైవేటు’ను వీడి ప్రభుత్వ బడుల్లో చేరుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో 3లక్షల మంది విద్యార్థులను (10 శాతం) ప్రభుత్వ బడుల్లో పెంచాలని పాఠశాల విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. సగటున జిల్లాకు 10వేల మందిని పెంచాలని, అంటే ప్రతి పాఠశాలకు పది మంది, ప్రతి తరగతికి ఒకరిని పెంచే ప్రణాళికను రూపొందించారు.
పాఠశాల స్థాయిలో కమిటీలు
అడ్మిషన్ల కోసం ప్రతి పాఠశాల స్థాయిలో ఒక కమిటీని నియమిస్తున్నారు. ప్రధానోపాధ్యాయుడు, సర్పంచ్, గ్రామ లేదా వార్డు కార్యదర్శి, స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ నుంచి ఒక సభ్యుడు, గ్రామ సమాఖ్యల ప్రతినిధులతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. వారంతా కలిసి ఆ గ్రామంలోని ప్రభుత్వ బడిలో కనీసం పది మంది పిల్లలను చేర్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలిక సదుపాయాలు, అర్హులైన ఉపాధ్యాయులు, ఇటీవల విద్యార్థులు సాధించిన ఫలితాలు, విద్యార్థులకు అందించే స్కూల్ కిట్, మధ్యాహ్న భోజన పథకం తదితర అంశాలను వివరించి, ప్రభుత్వ బడుల్లో పిల్లల్ని చేర్పించేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.
వైవిధ్యంగా ‘బడి పిలుస్తోంది’
దీనికోసం త్యేకంగా ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అధికారులు ప్రభుత్వ బడుల్లో చదివిన విద్యార్థుల మార్కులతో కరపత్రాలు పంచుతున్నారు. పాఠశాలల్లోని వసతులపై విద్యార్థులతోనే వీడియోలు రూపొందించి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ టీచర్లు కూడా ఇంటింటి ప్రచారం చేపడుతూ.. అడ్మిషన్లు పెంచడంపై దృష్టి సారించారు.
ఆ పాఠశాలలపై ప్రధానంగా దృష్టి
ప్రైవేటు పాఠశాలలను ఏ, బీ, సీ ఇలా 3 కేటగిరీలుగా వర్గీకరిస్తున్నారు. వాటిలో మొదటి రెండు కేటగిరీల పాఠశాలల్లో వసతులు మెరుగ్గానే ఉంటున్నాయి. టీచర్లను కూడా అర్హులైన వారినే కొనసాగిస్తున్నారు. కానీ చాలా చోట్ల సీ కేటగిరీ పాఠశాలల్లో మాత్రం వసతుల లేమితో పాటు నాణ్యమైన బోధన అందించే టీచర్లు కనిపించడం లేదు. అలాంటప్పుడు ఆ పాఠశాలలకు పిల్లల్ని పంపడం కంటే మెరుగైన సదుపాయాలున్న ప్రభుత్వ బడుల్లో చేర్పించడం ఉత్తమం అనే కోణంలో ప్రచారం చేస్తున్నారు.
50 శాతం విద్యార్థులే లక్ష్యం!
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేటులోనే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం 58,002 పాఠశాలలున్నాయి. వాటిల్లో 69.3 లక్షల మంది విద్యార్థులున్నారు. అయితే మొత్తం పాఠశాలల్లో 23.5 శాతం ప్రైవేటు కాగా.. వాటిలో అత్యధికంగా 51.4 శాతం మంది విద్యార్థులున్నారు. 76.5 శాతం ప్రభుత్వ పాఠశాలలున్నప్పటికీ, వాటిలో 48.6 శాతం మంది విద్యార్థులు మాత్రమే చదువుతున్నారు. దీంతో ప్రైవేటుతో సమానంగా అంటే కనీసం 50 శాతం విద్యార్థులు ప్రభుత్వ బడుల్లో ఉండాలనే లక్ష్యంతో పాఠశాల విద్యాశాఖ ‘బడి పిలుస్తోంది’ కార్యక్రమం అమలు చేస్తోంది. ప్రస్తుతం 32.01 లక్షల విద్యార్థులుండగా, వచ్చే ఏడాది ఆ సంఖ్యను 35.21 లక్షలకు చేర్చే విధంగా పనిచేస్తోంది.