‘ఉన్నత విద్య’లో ప్రక్షాళన
ABN , Publish Date - Feb 25 , 2026 | 03:18 AM
రాష్ట్ర ప్రభుత్వం ‘ఉన్నత విద్య’లో సమూల ప్రక్షాళన చేపట్టింది. మొత్తం స్వరూపాన్ని మార్చే కీలక నిర్ణయాలకు మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది.
కొత్తగా ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి కమిషనరేట్లు
ఉన్నత విద్య కమిషనరేట్ పరిధిలోకి అన్ని కాలేజీలు
‘సాంకేతిక విద్య’ రద్దు.. ఉన్నత విద్యలోకి పాలిటెక్నిక్‌లు
అకడమిక్ అంశాలకే ఉన్నత విద్యామండలి పరిమితం
అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ‘ఉన్నత విద్య’లో సమూల ప్రక్షాళన చేపట్టింది. మొత్తం స్వరూపాన్ని మార్చే కీలక నిర్ణయాలకు మంగళవారం జరిగిన క్యాబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. కొత్తగా ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి కమిషనరేట్లు ఏర్పాటు కానున్నాయి. సాంకేతిక విద్యా శాఖను రద్దు చేయనున్నారు. ఉన్నత విద్యాశాఖ పునర్‌వ్యవస్థీకరణపై 1-2 రోజుల్లో ఉత్తర్వులు వెలువడనున్నాయి. వేర్వేరుగా ఉన్న వ్యవస్థలను ఒక్కటి చేసేలా పలు శాఖల రద్దు, విలీన ప్రక్రియ చేసింది. ఒకే పనిని వేర్వేరు కార్యాలయాలు చేస్తుండటం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది.
ఉన్నత విద్య కమిషనరేట్
ఉన్నత విద్యాశాఖకు కొత్తగా ఒక కమిషనరేట్ ఏర్పాటు కానుంది. ప్రస్తుత కళాశాల విద్యా శాఖే ఉన్నత విద్య కమిషనరేట్‌గా మారుతుంది. ఇంజనీరింగ్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, ఇతర ఉన్నత విద్యా కోర్సులు అందించే అన్ని రకాల కాలేజీలు దీని పరిధిలోకి వస్తాయి. ప్రస్తుతం కళాశాల విద్యాశాఖ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను మాత్రమే పర్యవేక్షిస్తోంది. ప్రైవేటు డిగ్రీ కాలేజీలు, బీఈడీ కాలేజీలు, ఇతర విద్య కోర్సుల కాలేజీలు ఉన్నత విద్యామండలి పరిధిలో ఉన్నాయి. ఇకపై ఇవన్నీ ఉన్నత విద్య కమిషనరేట్‌లోకి రానుండగా.. ఉన్నత విద్యామండలి ప్రవేశ పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుంది. ఇకపై అడ్మిషన్లన్నీ ఉన్నత విద్య కమిషనరేట్ చేపడుతుంది. ఇప్పటివరకూ ఇంజనీరింగ్ అడ్మిషన్లు, వాటికి అనుమతులు సాంకేతిక విద్యాశాఖ పరిధిలో ఉన్నాయి. దీన్ని రద్దుచేసి, అందులోని ఐటీఐలను నైపుణ్యాభివృద్ధి శాఖకు, పాలిటెక్నిక్‌లను ఉన్నత విద్యకు బదిలీ చేస్తారు. ఆస్తులు, సిబ్బందిని కూడా పంపిణీ చేస్తారు.
నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ కమిషనరేట్
ప్రస్తుతం నైపుణ్యాభివృద్ధి శాఖలో ఉపాధి కల్పన, శిక్షణ డైరెక్టర్ కార్యాలయం ఉంది. దానిని నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, శిక్షణ కమిషనరేట్‌గా మారుస్తున్నారు. రాష్ట్రస్థాయితో పాటు జిల్లాల్లో జిల్లా ఉపాధి కల్పన అధికారి(డీఈవో) పోస్టును జిల్లా ఉపాధి కల్పన, స్కిల్ అధికారి(డీఈఎ్‌సవో)గా మారుస్తున్నారు. ప్రస్తుతం ఉన్నత విద్యకు కేంద్ర బిందువుగా ఉన్న ఉన్నత విద్యామండలి అకడమిక్ అంశాలకే పరిమితం కానుంది.
ఇకపై నిర్ణయాల్లో ఆలస్యం ఉండదు
ప్రస్తుత విధానంలో ఉన్నత విద్య నిర్ణయాల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఒకే పనిని వేర్వేరు కార్యాలయాలు చేస్తుండటం వల్ల గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయనే ఉద్దేశంతో ఈ మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇంజనీరింగ్ అడ్మిషన్ల అంశాన్ని తీసుకుంటే ప్రవేశ పరీక్షను ఉన్నత విద్యామండలి, అడ్మిషన్లను సాంకేతిక విద్యాశాఖ చేపడుతున్నాయి. కాలేజీలకు అనుమతుల మంజూరు మండలి పరిధిలో ఉంది. డిగ్రీ కాలేజీల పర్యవేక్షణ.. మండలి పరిధిలో ప్రైవేటు, కళాశాల విద్యాశాఖ పరిధిలో ప్రభుత్వ కాలేజీలకు వేర్వేరుగా ఉంది. ఉన్నత విద్యతో సంబంధం ఉండే పాలిటెక్నిక్ విద్య నైపుణ్యాభివృద్ధి శాఖ పరిధిలో ఉంది. ఈ క్రమంలో విధాన నిర్ణయాల్లో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సమూల మార్పులకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ఇకపై ఉన్నత విద్యలో వేగం పెరుగుతుందనేది ప్రభుత్వ భావన.
రైడెన్ డేటా సెంటర్‌కు భాగస్వామిగా అదానీ
అమరావతి, ఫిబ్రవరి 24(ఆంధ్రజ్యోతి): విశాఖపట్నంలో గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఏర్పాటు చేయనున్న ఒక గిగావాట్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణ, నిర్వహణ బాధ్యతలను అదానీకి అప్పగించడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదానీని తమ భాగస్వామ్య సంస్థగా పేర్కొంటూ ఇటీవల రైడెన్ లేఖ రాసింది. ఈ లేఖపై కార్యనిర్వాహక స్టీరింగ్ కమిటీ సమావేశమై.. రైడెన్‌కు అప్పగించిన భూములు, ప్రకటించిన రాయితీలను అదానీకి బదలాయించాలంటూ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఈ సిఫారసులను క్యాబినెట్ ఆమోదానికి ఐటీ శాఖ పంపింది. వాటిని క్యాబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది.