Share News

51,603 ఎకరాలకు విముక్తి

ABN , Publish Date - Mar 23 , 2026 | 03:32 AM

రాష్ట్రంలో పరిశ్రమలకు భూములు, రాయితీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, సహకారం కోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) పనిచేస్తోంది.

51,603 ఎకరాలకు విముక్తి

  • 22ఏ నుంచి తొలగింపు.. ప్రభుత్వ సంచలన నిర్ణయం

  • వాటిని ఏపీఐఐసీ పేరిట పట్టా భూములుగా మ్యుటేషన్‌ చేయాలని నిర్దేశం

  • 15 రోజుల్లో ప్రక్రియ పూర్తిచేయాలి కలెక్టర్లు, ఆర్‌డీవోలు, తహశీల్దార్లు, సబ్‌రిజిస్ట్రార్లకు పరిశ్రమల శాఖ ఆదేశం

  • ఏపీఐఐసీకి ఇచ్చిన భూముల్లో 1,21,603 ఎకరాలు ఇప్పటికీ నిషేధ జాబితాలోనే

  • 70 వేల ఎకరాలు ప్రభుత్వ, డీకేటీ భూములు

  • మిగతా 51,603 ఎకరాలను సేకరించి మరీ ఇచ్చిన సర్కారు

  • మార్కెట్‌ ధరకు కొన్నా పరిశ్రమలకు అక్కరకు రాని భూములు

  • దీంతో ఇరకాటంలో పరిశ్రమలు

  • చక్కదిద్దాలని దీర్ఘకాలంగా వినతులు

నిషేధ జాబితాలో ఉన్న పారిశ్రామిక భూములపై ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీఐఐసీ అధీనంలో ఉన్న 51,603 ఎకరాల భూములను నిషేధ జాబితా 22ఏ నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. అలాగే పక్షం రోజుల్లోగా.. రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగా ఉన్నవాటిని పట్టా భూములుగా మార్చి ఆ సంస్థ పేరిట మ్యుటేషన్‌ చేయాలని స్పష్టంచేసింది.

అమరావతి, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పరిశ్రమలకు భూములు, రాయితీలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల పర్యవేక్షణ, సహకారం కోసం ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్‌ (ఏపీఐఐసీ) పనిచేస్తోంది. 1973 సెప్టెంబరు 26న ఇది ఏర్పాటైంది. ప్రభుత్వం గతంలో పరిశ్రమలకే నేరుగా భూములు కేటాయించేది. ఏపీఐఐసీ ఆవిర్భావం తర్వాత భూములను తొలుత ఆ సంస్థకు కేటాయిస్తున్నారు. తర్వాత దాని ద్వారా పరిశ్రమలకు భూకేటాయింపులు చేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం.. ఇప్పటి వరకు 1.56 లక్షల ఎకరాలను ఏపీఐఐసీకి కేటాయించగా.. వాటిలో 1,21,603 ఎకరాలు ఇప్పటికీ నిషేధ జాబితాలో ఉండడం గమనార్హం. ఇందులో 70 వేల ఎకరాల ప్రభుత్వ, డీకేటీ (అసైన్డ్‌) భూములు కూడా ఉన్నాయి. ప్రభుత్వ భూములు అందుబాటులో లేనిచోట భూ సేకరణ చట్టం కింద 51,603 ఎకరాల పట్టా భూములను సేకరించి ఇచ్చారు.


అనేక ప్రాంతాల్లో అసైన్డ్‌ భూములకు కూడా పరిహారం ప్రకటించి సేకరించారు. వీటిని ఏపీఐఐసీ అనేక పరిశ్రమలకు మార్కెట్‌ ధరకు కేటాయించింది. అంటే ఆయా పరిశ్రమలు ప్రభుత్వం నిర్ణయించిన ధరను ఏపీఐఐసీకి చెల్లించి భూములు తీసుకున్నాయి. అయినా ఇప్పటికీ అవి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూములుగానే నమోదైన్నాయి. వాటి వర్గీకరణ, స్వభావం మార్చలేదు. ఫలితంగా ఆయా పరిశ్రమలు ఆ భూములను తనఖాపెట్టి రుణాలు తీసుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితిని చక్కదిద్దాలని పరిశ్రమలు, కంపెనీలు, ఏపీఐఐసీ ప్రభుత్వాన్ని దీర్ఘకాలంగా కోరుతున్నాయి. ఇప్పటికే పారిశ్రామిక రాయితీలను నేరుగా కంపెనీలకే చెల్లించేందుకు ఎస్ర్కో ఖాతా తెరచిన కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు అనూహ్యంగా, వాటికిచ్చిన భూముల స్వభావం, క్లాసిఫికేషన్‌ మార్చడంతో పాటు నిషేధం నుంచి విముక్తి కల్పించాలని కీలక నిర్ణయం తీసుకుంది. తొలుత 51,603 ఎకరాలను 22ఏ నుంచి తొలగించాలని పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్‌ ఆదివారం ఉత్తర్వులు (జీవో 61) జారీ చేశారు. తర్వాత వాటిని ఏపీఐఐసీ పేరిట పట్టా భూమిగా మ్యుటేషన్‌ చేయాలని.. ఇదంతా యుద్ధప్రాతిపదికన చేపట్టాలని.. మొత్తం ప్రక్రియను 15 రోజుల్లోగా పూర్తిచేయాలని కలెక్టర్లు, ఆర్‌డీవోలు, తహశీల్దార్లు, సబ్‌రిజిస్ట్రార్లను ఆదేశించారు. దీంతోపాటు భూముల మ్యుటేషన్‌, భూ కేటాయింపు ప్రతిపాదనలు, ఇంకా నిషేధ జాబితా నుంచి విముక్తి కల్పించడానికి అనుసరించాల్సిన విధివిధానాలనూ ఉత్వర్వుల్లో తెలియజేశారు.


వేగంగా ఏపీఎల్‌ఎమ్‌ఏకు ప్రతిపాదనలు..

వాస్తవానికి ఇప్పుడు ఏపీఐఐసీ అధీనంలో ఉన్న భూములన్నిటినీ ఆ సంస్థ పేరిట కేటాయించలేదు. ప్రభుత్వం పారిశ్రామిక అవసరాల కోసం సేకరించి.. వాటిపై దానికి కేవలం ముందస్తు పొజిషన్‌ ఉత్తర్వులే ఇచ్చింది. ఈ నేపథ్యంలో కేటాయింపు ఉత్తర్వులు లేని భూములను గుర్తించి.. వెంటనే బదలాయింపు కోరుతూ సీసీఎల్‌ఏ నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్‌ భూ నిర్వహణ సంస్థకు పంపించాలని పరిశ్రమల శాఖ కలెక్టర్లను నిర్దేశించింది. ఈ అంశంపై ప్రతి నెలా సమీక్ష చేసి నివేదికలు పంపించాలని ఏపీఐఐసీని ఆ శాఖ కార్యదర్శి యువరాజ్‌ ఆదేశించారు. భూముల మ్యుటేషన్‌, నిషేధ విముక్తి, భూముల బదలాయింపు ప్రతిపాదనలపై ఎప్పటికప్పుడు కలెక్టర్లు, ఏపీఐఐసీ రిపోర్టులు సమర్పించాలని స్పష్టం చేశారు.

Updated Date - Mar 23 , 2026 | 03:33 AM