నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు: అచ్చెన్న
ABN , Publish Date - Mar 21 , 2026 | 04:38 AM
‘సీఎం చంద్రబాబు పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. గత వైసీపీ పాలనలో జగన్ తీరుతో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయింది’ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు.
అమరావతి, విశాఖపట్నం, మార్చి 20(ఆంధ్రజ్యోతి): ‘సీఎం చంద్రబాబు పాలనలో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి. గత వైసీపీ పాలనలో జగన్ తీరుతో నిరుద్యోగ యువత తీవ్రంగా నష్టపోయింది’ అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. రెండేళ్లలో సుమారు 30వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనమని శుక్రవారం పేర్కొన్నారు. ఉగాది కానుకగా కూటమి ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయడం నిరుద్యోగ యువతలో కొత్త ఆశలు నింపిందని అన్నారు. వైసీపీ హయాంలో జాబ్ క్యాలెండర్ పేరుతో అప్పటి సీఎం జగన్ యువతను మోసం చేశారని ఆరోపించారు.
జాబ్ క్యాలెండర్‌పై నిరుద్యోగ జేఏసీ హర్షం
ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదలపై నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్ధిక్ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ పేరుతో నిరుద్యోగులను నయవంచన చేసిందని ఓ ప్రకటనలో ఆరోపించారు.
థాంక్యూ... లోకేశ్ సార్
ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్‌ను విడుదల చేయడం హర్షం వ్యక్తం చేస్తూ విశాఖ, ఎంవీపీ కాలనీలో నిరుద్యోగ యువతీ యువకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. గ్రూప్ 1, 2తో పాటు ఉపాధ్యాయులు, అధ్యాపకులు, కానిస్టేబుళ్లు, లైబ్రేరియన్ పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించడంపై వారంతా హర్షం వ్యక్తం చేశారు. మంత్రి ఫొటో, ‘థాంక్యూ లోకేశ్ సార్’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించి తమ కృతజ్ఞతలు తెలిపారు.