Andhra Pradesh Excise Policy: మద్యం ‘సీసా’కు రూ.10 పెంపు..
ABN , Publish Date - Jan 13 , 2026 | 05:16 AM
రాష్ట్రంలో మద్యం ధరలు స్వల్పంగా పెరిగాయి. పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి మద్యం సీసా ధర రూ.10 పెరిగింది.
బార్లపై అదనపు ఏఆర్‌ఈటీ రద్దు
అమరావతి, జనవరి 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మద్యం ధరలు స్వల్పంగా పెరిగాయి. పరిమాణంతో సంబంధం లేకుండా ప్రతి మద్యం సీసా ధర రూ.10 పెరిగింది. ఈ మేరకు ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ఐఎంఎఫ్‌ఎల్, ఫారిన్ లిక్కర్‌కు ధరల పెంపు వర్తిస్తుందని తెలిపారు. క్వార్టర్ రూ.99 బ్రాండ్లు, బీరు, వైన్, రెడీ టూ డ్రింక్స్‌పై ధరలు పెంచలేదన్నారు. బార్లపై అదనంగా ఉన్న అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్(ఏఆర్‌ఈటీ)ను రద్దుచేసినట్లు తెలిపారు. వైన్స్ షాపుల లైసెన్సీలకు ఇచ్చే లాభాన్ని 1శాతం పెంచినట్లు పేర్కొన్నారు. బార్లపై అదనపు ఏఆర్‌ఈటీ రద్దు చేయడంతో ప్రభుత్వం నుంచి వైన్ షాపులు, బార్లకు వెళ్లే మద్యం ధరలు ఒకేలా ఉంటాయి. గత వైసీపీ ప్రభుత్వం బార్ల లైసెన్సీలపై కక్షగట్టి 10శాతం అదనపు ఏఆర్‌ఈటీ విధించింది. దీంతో షాపుల కంటే బార్లు 10శాతం అదనంగా ధరలు చెల్లిస్తున్నాయి. ఈ ధరల వ్యత్యాసాన్ని సవరించాలని బార్ల యజమానులు ప్రభుత్వాన్ని కోరారు. కాగా, అదనపు ఏఆర్‌ఈటీ రద్దు వల్ల రూ.340 కోట్ల మేరకు ప్రభుత్వానికి ఆదాయం తగ్గనుంది. ఈ లోటు భర్తీ కోసం మద్యం సీసాపై రూ.10 ధర పెంచారు.
కార్పొరేషన్ వెలుపలా మైక్రో బ్రూవరీలు
అప్పటికప్పుడు బీరు తయారుచేసి విక్రయించే మైక్రో బ్రూవరీ పాలసీ నిబంధనలు సవరిస్తూ ఎక్సైజ్ శాఖ మరో ఉత్తర్వు జారీచేసింది. సవరణల ప్రకారం ఇకపై మున్సిపల్ కార్పొరేషన్ల వెలుపల 5 కిలోమీటర్ల పరిధి వరకు త్రీస్టార్, అంతకంటే పెద్ద హోటళ్లలో మైక్రోబ్రూవరీలు ఏర్పాటు చేసుకోవచ్చు.