వెంకట్రామిరెడ్డిపై వేటు!
ABN , Publish Date - Apr 21 , 2026 | 03:58 AM
ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024లో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ తన విధుల పట్ల చిత్తశుద్ధి...
నాడు వైసీపీ కోసం ఎన్నికల ప్రచారం
‘ప్రజారవాణా మిత్రులారా ప్రభుత్వ రుణం
తీర్చుకోండి’ అంటూ డిపోల్లో కరపత్రాలు
రుజువైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన
వైసీపీ హయాంలోనే సస్పెన్షన్
పూర్తిస్థాయి విచారణ తర్వాత నేడు డిస్మిస్
ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన ఏపీపీఎస్సీ
అమరావతి, ఏప్రిల్ 20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కాకర్ల వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2024లో ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ తన విధుల పట్ల చిత్తశుద్ధి, అంకితభావం పాటించడంలో విఫలమైనందుకుగాను సీసీఏ రూల్స్ 1991 ప్రకారం వెంకట్రామిరెడ్డిపై డిస్మిస్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ప్రభుత్వం సోమవారం జీవో ఇచ్చింది. 2024 ఎన్నికల సమయంలో వెంకట్రామిరెడ్డి వైసీపీకి అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు నిర్ధారణ అయిందని ఆ జీవోలో ప్రభుత్వం స్పష్టంగా వెల్లడించింది. ఆ ఏడాది మార్చి 31వ తేదీన బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప ఆర్టీసీ డిపోల్లో కార్మికులతో ఆయన సమావేశాలు నిర్వహించి, రాజకీయ ప్రచారం చేసినట్టు ఆ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నివేదికలు ఇచ్చారని తెలిపారు. ఈ అంశంపై జరిగిన పూర్తిస్థాయి విచారణలో వెంకట్రామిరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిజమని నిరూపితమయ్యాయని జీవోలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ ప్రవర్తనా నియమావళి- 1964ను వెంకట్రామిరెడ్డి ఉల్లంఘించారని ప్రభుత్వం పరిగణించింది. ఇందులోని రూల్ 19(1) (5) ద్వారా ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ నిబంధనలు-1991లోని రూల్ -8(1) ప్రకారం సంక్రమించిన అధికారాలను ఉపయోగించి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో ఇన్‌చార్జ్ ప్రాతిపదికన అసిస్టెంట్ సెక్రటరీగా పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ వెంకట్రామిరెడ్డిని ఎన్నికల సంఘం సిఫారసు మేరకు 2024లో వైసీపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. తదుపరి ఈ ఉల్లంఘనలపై పూర్తిస్థాయి విచారణ నివేదిక, ఏపీపీఎస్సీ సూచనలను అనుసరించి, అత్యంత కఠినమైన శిక్ష అయిన ’సర్వీసు నుంచి తొలగింపు’ను విధిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దానికి ముందు ఏపీపీఎస్సీని ప్రభుత్వం లిఖితపూర్వకంగా అభిప్రాయం కోరింది. ఏపీపీఎస్సీ సెక్రటరీ అందుబాటులో ఉన్న రికార్డుల ఆధారంగా, ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించారు.
‘ప్రజారవాణా మిత్రులారా ప్రభుత్వ రుణం తీర్చుకోండి’
2024లో వెంకట్రామిరెడ్డి సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి హోదాలో ఆర్టీసీ యూనియన్ నాయకుడు సి. చంద్రయ్యతో కలిసి ప్రచారం చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగులను వైసీపీకి అనుకూలంగా ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు. ’ప్రజా రవాణా శాఖ మిత్రులారా.. ప్రభుత్వ రుణం తీర్చుకోండి’ అనే పేరిట తయారుచేసిన కరపత్రాలను పంపిణీ చేశారు.
న్యాయ పోరాటం చేస్తా: వెంకట్రామిరెడ్డి
ఉద్యోగులను భయపెట్టి, వారు ప్రశ్నించకుండా చేసేందుకే తనపై ప్రభుత్వం వేటు వేసిందని వెంకట్రామిరెడ్డి ఆరోపించారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తానన్నారు. ఉద్యోగుల రాజకీయాల గురించి మాట్లాడే అర్హత సీఎంకు లేదన్నారు. ‘‘నేను 2024లో ఎన్నికల ప్రచారం చేసినట్లు ఒక్క ఆధారమూ లేదు. ఇలాంటి వాటికి నేను భయపడబోను’’ అని పేర్కొన్నారు. డిస్మిస్ కావడం వల్ల రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ అందవు కదా అని ప్రశ్నించగా, ‘ఏమౌతుంది? రెండు, మూడు నెలలే కదా? కోర్టులున్నాయి..న్యాయం చేస్తాయి. మళ్లీ మంచి ప్రభుత్వం వచ్చినప్పుడు నాకు న్యాయం జరుగుతుంది’’ అని తెలిపారు.